గల్ఫ్​ ఆఫ్​ మెక్సికో పేరు మార్చిన ట్రంప్

గల్ఫ్​ ఆఫ్​ మెక్సికో పేరు మార్చిన ట్రంప్

47వ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్​ ట్రంప్ ​బాధ్యతలు చేపట్టిన  తొలిరోజే గల్ఫ్​ ఆఫ్​ మెక్సికో పేరును గల్ఫ్​ ఆఫ్​ అమెరికాగా మారుస్తూ ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్​ను జారీ చేశాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు గల్ఫ్​ ఆఫ్​ మెక్సికో కీలకం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గల్ఫ్. 9వ అతిపెద్ద జల వనరు. సముద్రంలో చమురు ఉత్పత్తి చేసే క్షేత్రాల్లో ప్రపంచంలోనే అతి పెద్దది గల్ఫ్​ ఆఫ్​ మెక్సికో. అమెరికా ముడి చమురు ఉత్పత్తిలో 14 శాతం, 5 శాతం సహజవాయువు ఉత్పత్తి ఇక్కడ నుంచే జరుగుతున్నది. అమెరికాలో వినియోగించే 40 శాతం మత్స్య సంపద ఇక్కడే లభిస్తున్నది. 

 గల్ఫ్​ ఆఫ్​ మెక్సికో  16 లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నది. ఇది అట్లాంటిక్​ మహాసముద్రం, కరేబియన్​ సముద్రం, తూర్పు మెక్సికో, ఆగ్నేయ అమెరికా, పశ్చిమ క్యూబా మధ్య ఉన్న ఒక సముద్ర ప్రాంతం. ఈ గల్ఫ్​ చుట్టూ మెక్సికోకు చెందిన టమౌలిపస్, వెరక్రుజ్, టబస్కో, కాంపెచే, యుక్తాన్​ రాష్ట్రాలు ఉన్నాయి. 
    
గల్ఫ్​ ఆఫ్​ మెక్సికోకు సంబంధించి అమెరికా– మెక్సికో, అమెరికా–క్యూబా, మెక్సికో–క్యూబాల మధ్య సముద్ర సరిహద్దులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి తదితర అంతర్జాతీయ సంస్థల సమక్షంలో కొన్ని ఒప్పందాలు జరిగాయి. 
    
గల్ఫ్​ ఆఫ్​ మెక్సికోలోకి మిస్సిస్సిప్పీ, రియో గ్రాండే నదులు ప్రవహిస్తున్నాయి. 

గల్ఫ్​ ఆఫ్​ మెక్సికో 

ఈ పేరును 16వ శతాబ్దంలో స్పెయిన్​కు చెందిన అన్వేషకులు తొలిసారి యూరోపియన్ మ్యాపుల్లో పేర్కొన్నారు. 1560 బ్రిటీష్​ అన్వేషకుడు ఫ్రాన్సిస్ డ్రేక్, మ్యాపుల చిత్రాకారుడు బాప్టిస్ట్​ బొయోజియో తన మ్యాపుల్లో గల్ఫ్​ ఆఫ్​ మెక్సికోగా గుర్తించారు. 1591లో డిబ్రై రూపొందించిన మ్యాపులో కూడా గల్ఫ్​ ఆఫ్​ మెక్సికో అనే పేరు ఉపయోగించారు. 1630లో రూపొందించిన మరో మ్యాపులో ఈ ప్రాంతాన్ని గల్ఫ్​ ఆఫ్​ న్యూ స్పెయిన్​గా పేర్కొన్నారు. అమెరికాలో ప్రస్తుతం ఫ్లోరిడా రాష్ట్రాన్ని అప్పట్లో న్యూ స్పెయిన్​గా పిలిచేవారు. అంతకుముందు ఎవరు ఎలా పిలిచినా 400 ఏండ్లుగా గల్ఫ్​ ఆఫ్​ మెక్సికో అనే పేరు వాడుకలో ఉన్నది. 

ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్​

అమెరికా చట్టసభ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి అధ్యక్షుడు జారీ చేసే లిఖిత పూర్వక ఆదేశాలనే ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్​గా పేర్కొంటారు. ప్రభుత్వ విధానాలకు సంబంధించి అధ్యక్షుడు తీసుకునే కీలక నిర్ణయాలు ఇందులో ఉంటాయి. కేంద్ర సంస్థలకు ఆదేశాలు ఇవ్వడం లేదా నివేదికలను కోరడం వంటివి ఉండవచ్చు. అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం ఈ ఆదేశాలు జారీచేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఈ ఆదేశాలకు చట్టబద్ధత ఉంటుంది. 

సాధారణంగా జారీచేసే ఆధికారిక ప్రకటన వంటి వాటికి మాత్రం చట్టబద్ధత ఉండదు. ఎగ్జిక్యూటివ్​ ఆదేశాలను తిరస్కరించేందుకు చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం కాంగ్రెస్ కు ఉన్నప్పటికీ దానిపై వీటో అధికారం మాత్రం అధ్యక్షుడిదే. అందుకే కాంగ్రెస్​ ఆమోదించలేని అంశాలను తమ ఎజెండాలో అధ్యక్షుడు పెట్టుకుంటారు. చట్టసభ ఆమోదం లేకుండా జారీచేసే అధికారం అధ్యక్షుడికి ఉన్నా వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆదేశాలను వ్యతిరేకించలేనప్పటికీ ఆ నిర్ణయాలకు అవసరమైన నిధులు ఇవ్వకుండా అడ్డుకోవడం లేదా ఇతర అడ్డంకులు సృష్టించడం ద్వారా వీటి అమలుకు కాంగ్రెస్​ ఆటంకం కలిగించే వీలు ఉన్నది.