- మెయిన్ పైప్ లైన్ లీకేజీలతో నిలిచిపోతున్న నీటి సరఫరా
- నెలలో రెండుసార్లు రిపేర్లతో తీవ్రమైన వాటర్ ప్రాబ్లం
- ట్యాకర్ల ద్వారా సప్లై చేస్తున్న మున్సిపల్ అధికారులు
సూర్యాపేట, వెలుగు: గత పాలకులు సూర్యాపేట ప్రజలకు మురుగు నీళ్లు సరఫరా చేశారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మిషన్ భగీరథ నీళ్లు తాగిస్తున్నామని దశాబ్ది ఉత్సవాల్లో గొప్పలు చెప్పిన మంత్రి జగదీశ్ రెడ్డి ఇలాకాలో నెలకు 10 రోజులే నీళ్లొస్తున్నాయి. తరచూ మోటార్లు పాడవడం, మెయిన్ పైప్ లైన్ లీకేజీ అవుతుండడంతో నీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నెలలో రెండు మూడుసార్లు రిపేర్లు చేయాల్సి వస్తుండడంతో దాదాపు 20 రోజులు నీళ్లు బంద్ అవుతున్నాయి. దీంతో మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నారు. అయితే, అవి ఏమాత్రం సరపోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
సూర్యాపేటలో18 వేల కనెక్షన్లు
సూర్యాపేట పట్టణంలో48 వార్డులు, 20వేలకు పైగా కుటుంబాలు, లక్షకు పైగా జనాభా ఉన్నారు. మొత్తం 18వేల వరకు నల్లా కనెక్షన్లు ఉండగా రోజుకు 28 మిలియన్ లీటర్ల నీటి అవసరం ఉంది. కానీ, ప్రస్తుతం 20 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే సప్లై చేస్తున్నారు. అవంతి పురం టెయిల్ పాండ్ నుంచి చిట్యాల పంప్ హౌస్, ఇమాంపేట 95 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, శాంతి నగర్‌లో1500 కేఎంఎల్‌డీ ట్యాంక్ ద్వారా ప్రజలకు నీటి సరఫరా జరుగుతుంది. అయితే అవంతిపురం టెయిల్ పాండ్‌లో కరెంట్ కోతల కారణంగా మోటార్ రిపేర్‌కు రావడంతో పాటు పైప్ లైన్లకు నిత్యం లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఇటీవల పైప్ లైన్ లీకేజీ ఏర్పడడంతో గత నెల 23 నుంచి నీటి సప్లై నిలిచిపోయింది. ఇటీవల రూ.15లక్షలతో మోటర్లు రిపేర్ చేయించి దోసపహాడ్ నుంచి 13ఎంఎల్‌డీ నీటిని సరాఫరా చేస్తున్నా.. 8 వార్డులకు మాత్రమే సరిపోతున్నాయి.
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
అవంతిపురం నుండి నీటి సరఫరా నిలిచిపోవడంతో 40 వార్డుల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో మున్సిపల్ అధికారులు టౌన్ పరిధిలో తాళ్లగడ్డ ఫిల్టర్ బెడ్ నుంచి వార్డుకు ఐదు ట్యాంకర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ, నాలుగైదు బిందెలకు మించి రాకపోవడంతో దేనికీ సరిపోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ప్యూరిఫైడ్, మినరల్ వాటర్ ప్లాంట్లకు క్యూ కడుతున్నారు. నీటి సరఫరాకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.
నీటి సరఫరాపై కలెక్టర్ మీటింగ్
మిషన్ భగీరధ నీటి సరఫరాపై కలెక్టర్ ఎస్ వెంకట్‌రావు శనివారం మిషన్ భగీరథ, మున్సిపల్ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. అవంతి పురం నుంచి సూర్యాపేట మున్సిపాలిటీకి వచ్చే పైస్‌లైన్ లీకేజీకి తర్వగా రిపేర్లు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటికి ప్రతి రోజు 2 కోట్ల లీటర్లు, విలీనమైన గ్రామాలకు 23 లక్షల లీటర్ల తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. నీటి సరఫరాను తెలుసుకొనేందుకు బల్క్ ఫ్లో మీటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పాలకులు విఫలం
పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరా చేయడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారు. పది రోజులుగా నీళ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే పైప్‌లైన్ లీకేజీలు రిపేర్ చేసి నీళ్లివ్వాలి. దోసపాడు నుంచి వేసిన పైపు లైన్ పునరుద్ధరించి నీటి సరఫరా చేయడంపై మంత్రి జగదీశ్ రెడ్డి దృష్టిపెట్టాలి.
- పల్స మహాలక్ష్మి మల్సూర్ గౌడ్, బీజేపీ ఫ్లోర్ లీడర్
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయట్లే
అధికారుల తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మోటార్లకు రిపేర్ వస్తే నాలుగు రోజులు నీళ్లు బంద్ అవుతున్నాయి. మూడునాలుగేళ్లుగా ఇలాగే జరుగుతోంది. కౌన్సిల్ మీటింగ్‌లో ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోవడం లేదు. వార్డుకు ఒకటి, రెండు ట్యాంకర్లే పంపిస్తున్నరు.
- కక్కిరేణి శ్రీనివాస్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్