క్లీనింగ్​ పని ఇప్పిస్తానని మోసం

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన దల్ల రవి ఏజెంట్ ద్వారా  గత ఏడాది ఆగస్టు 29న ఒమన్ వెళ్లాడు. క్లీనింగ్​ పని ఇప్పిస్తానని, నెలకు 130 రియాల్స్​జీతం అని చెప్పిన ఏజెంట్​వీసా కోసమంటూ రూ.65 వేలు తీసుకున్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాత రెండు నెలలు పని చేసినా జీతం ఇవ్వలేదు. తర్వాత పని లేదంటూ బయటకు వెళ్లగొట్టారు. అప్పటినుంచి రోజూ రోడ్లపై కూర్చుంటూ.. రాత్రి పార్కుల్లో పడుకుంటున్నాడు. ఇండియాకు పంపించాలని ఎంబసీ చుట్టూ ఐదు నెలలుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 500 ఒమన్ రియాల్స్ జరిమానా కట్టుమంటున్నారని, అంత డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని వాపోతున్నాడు. ఏజెంట్ కు ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వడం లేదని, ఇంట్లో భార్యాపిల్లలు పరేషాన్ అవుతున్నారని, దయచేసి ఇంటికి రప్పించాలని వేడుకుంటున్నాడు. 

జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలకు చెందిన గల్ఫ్ ఏజెంట్లు ఒమన్ దేశంలో క్లీనింగ్ పని ఇప్పిస్తామంటూ వీసా కోసం ఒక్కొక్కరి వద్ద రూ.70 వేల నుంచి లక్ష వరకు వసూలు చేశారు. నెల జీతం 120 ఒమన్ రియాల్స్ అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు.  వీరిలో చాలామంది గత ఏడాది ఆగస్టు నెలలో ఒమన్ వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఏజెంట్ ప్రతినిధి వచ్చి ఓ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక నెల పని చేశాక 15 రోజుల జీతం మాత్రమే ఇచ్చి వెళ్లగొట్టారు. మీ పని అయిపోయింది. వీసా టైం అయిపోయింది. వేరే వీసా తీసుకోవాలని చెప్పారు. దీంతో బాధితులు సంబంధిత ఏజెంట్లను ఫోన్లో సంప్రదిస్తే సమాధానం ఇవ్వడం లేదు. దీంతో ఆయా జిల్లాలకు చెందిన బాధితులు ఒమన్ లోని ఎంబసీకు వెళ్లి అక్కడి అధికారులకు జరిగిన మోసం గురించి చెప్పారు. మీరు విజిటింగ్​వీసాపై వచ్చారని, వీసా గడువు అయిపోయిందని, 500 ఒమన్ రియాల్స్ జరిమానా కడితేనే  స్వదేశం వెళ్లడానికి పర్మిషన్​ఇస్తారని అక్కడ చెప్పారు. దీంతో 70 మంది వరకు బాధితులు ఏం చేయాలో తెలియక ఎంబసీ సమీపంలో ఉన్న రోడ్లు, పార్కుల్లో ఉంటూ ఐదు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజు తమను ఇండియాకు పంపించాలని ఎంబసీ అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సీఎం కేసీఆర్, మినిస్టర్ కేటీఆర్ స్పందించి ఏజెంట్ల మోసంతో ఒమన్ లో చిక్కుకున్న తెలంగాణ వాసులను వెంటనే స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్నారు.

పస్తులు ఉంటున్నం

ఒమన్ దేశంలో క్లీనింగ్ పని కోసం జగిత్యాలకు చెందిన గల్ఫ్ ఏజెంట్ వీసా ఉందన్నాడు. వీసా కోసం రూ.55 వేలు తీసుకున్నాడు. గత ఏడాది ఆగస్టు 29న నన్ను ఒమన్ పంపించాడు. నెలకు 120 ఒమన్ రియాల్స్​జీతం అన్నాడు. ఇక్కడ ఒక నెల పని చేయించుకుని 60 రియాల్స్ మాత్రమే ఇచ్చారు. రెండో నెలలో నీ విజిటింగ్​వీసా  టైం అయిపోయిందంటూ వెళ్లగొట్టారు. ఏజెంట్ కు ఫోన్​చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఐదు నెలులుగా రోడ్లపైనే ఉంటున్నాం. ఇంటికి పంపించాలని ఎంబసీ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందిస్తలేరు. అడుక్కొని తింటున్నాం. ఒక్కో రోజు పస్తులుంటున్నం. అక్కడ భార్యాపిల్లలు నన్నే యాద్ జేస్తున్నరు. ప్లీజ్ మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లండి. 

- షేక్ ముష్షు, వర్శకొండ, 
ఇబ్రహీంపట్నం మండలం

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

విజిటింగ్​ వీసాపై గల్ఫ్ దేశాలకు పంపించి మోసం చేసిన ఏజెంట్లపై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. యువత లైసెన్స్ లేని ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దు. గల్ఫ్ వెళ్లే యువకులు వీసా గురించి ఎంక్వైరీ చేసిన తర్వాతే అక్కడికి వెళ్లాలి. కంపెనీ వీసాల పేరిట అమాయక యువతను మోసం చేస్తే కేసులు నమోదు చేస్తాం. 

- వంగ రవీంద్రరెడ్డి, డీఎస్పీ, మెట్ పల్లి