మహారాష్ట్ర పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్: CM ఎవరో తెలియకుండానే ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఫిక్స్

మహారాష్ట్ర పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్: CM ఎవరో తెలియకుండానే  ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఫిక్స్

ముంబై: మహారాష్ట్ర పాలిటిక్స్‎లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరో అధికారికంగా ప్రకటించకముందే.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి తేదీ ఫిక్స్ అయ్యింది. 2024, డిసెంబర్ 5వ తేదీన ఆజాద్ మైదాన్‎లో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే శనివారం (నవంబర్ 30) ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. మహా సీఎం పదవి స్వీకారోత్స కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నట్లు బవాన్ కులే వెల్లడించారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 

ALSO READ | ‘మహా’ ట్విస్ట్.. అసంతృప్తిలో ఏక్నాథ్ షిండే.. మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ సొంతూరికి..

దీంతో మహాయుతి కూటమిలో సీఎం పదవి కోసం పోటీ పెరిగింది. మాజీ సీఎంలు ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టారు. దీంతో మహా సీఎం ఎవరు అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన బీజేపీ హై కమాండ్ సీఎం పంచాయతీ విషయాన్ని కొలిక్కి తెచ్చింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించడంతో.. ఆ పార్టీకే సీఎం పదవి ఇవ్వాలని కాషాయ పార్టీ పెద్దలు డిసైడ్ చేశారు. దీనికి కూటమిలోని శివసేన(షిండే), ఎన్సీపీ (అజిత్) పార్టీలు కూడా ఒకే చెప్పాయి. దీంతో మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‎కు లైన్ క్లియర్ అయ్యింది.

 అయితే, మంత్రి పదవి పంపకాల్లో మహాయుతి కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదు. హోం శాఖ తమకు ఇవ్వాలని శివసేన డిమాండ్ చేస్తోంది. ఇందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యమవుతోంది. సీఎం పదవి ఉన్న వారి దగ్గరే హోం శాఖ కూడా ఉంటుందని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో ఏక్ నాథ్ షిండే అసంతృప్తికి గురై  తన సొంతూరుకు వెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యమవుతోంది. ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సీఎం పేరును కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ముఖ్యమంత్రి పేరు అఫిషియల్‎గా అనౌన్స్ చేయ్యకముందే.. సీఎం ప్రమాణస్వీకారోత్సవ తేదీ ఖరారు చేయడం మహా పాలిటిక్స్‎లో కాక రేపుతోంది.