హైదరాబాద్, వెలుగు : డిసెంబర్ 9 చరిత్రాత్మకమైన రోజని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీని వాస్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. 2009లో అప్పటి కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం ఇదే రోజు తెలంగాణ ప్రకటన చేశారని గుర్తుచేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లుగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు గురించి ఏమీ చేయలేదని, గత ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేధావులు, విద్యార్థులు ఏ వర్గం కూడా ఆమోదించలేదన్నారు.
కేవలం కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందనే చిల్లర మాటలు ఈ పదేండ్లలో విన్నామన్నారు. విగ్రహా విష్కరణ సమయంలో, సభలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు లేకపోవ డమంటే కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న ద్రోహమన్నారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించిన వారికి తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన జరిగిందని చెప్పారు.