‘మన యుద్ధం సంపద కోసమో, అధికారం కోసమో కాదు.. స్వేచ్ఛ, మానవ వ్యక్తిత్వ పునరుద్ధరణ కోసం’ అని అంటారు మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. మరి నేడు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడటంలో పాలకులకు ‘నైతిక బాధ్యత అనే స్పృహ, ప్రజాక్షేమం అనే ధ్యాస’ ఎంతవరకు ఉంది అనేది ప్రశ్న. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అన్యాయానికి గురైందని అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదనే కదా.. స్వరాష్ట్రం కోసం పోరాటం చేసింది. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకే కావాలని తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఆశించాం. కానీ ప్రస్తుత తెలంగాణలో పరిస్థితి మాత్రం ఆశించిన దానికి భిన్నంగా ఉన్నది.
నియంతృత్వ విధానానికి దారులు
ప్రజాస్వామ్య పరిరక్షణలో, ప్రజాభివృద్ధిలో ‘స్వేచ్ఛాయుత ఎన్నికలు’, ‘పౌర హక్కులు, చట్టాల అమలు’, ‘ప్రతిపక్షాల నిర్మాణాత్మక పాత్ర’ లాంటి అంశాలు కీలక పాత్రవహిస్తాయి. ప్రభుత్వాలు రూపొందించే ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకమైన/కార్యక్రమమైన ‘ఆవశ్యకత’, ‘నిబద్ధత’, ‘నిర్మాణాత్మకత’ అనే మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి లోపించినా అది లోపభూయిష్టంగానే తయారవుతుంది. పై అంశాలను బట్టి చూస్తే తెలంగాణలో పరిపాలన ఏ మార్గంలో, ఎటువైపు సాగుతుందో ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే గెలిపించిన ప్రజల పట్ల ఆయా ప్రభుత్వాలు కూడా అంతే బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రజా -సమస్యల సత్వర పరిష్కారం, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగాల -కల్పన, పేదరిక నిర్మూలనలాంటి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పకడ్బందీగా అమలు చేయడంలో అధికారాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగానీ, వచ్చిన మెజారిటీని ప్రతిపక్ష-పార్టీలపై కక్ష సాధింపునకో, ఇష్టారీతిన అధికార దుర్వినియోగానికో, స్వ-ప్రయోజనాలకో, పార్టీ- ప్రయోజనాలకో వాడుకోకూడదు. ఇలాంటి అవాంచిత, అనవసర చర్యలు నియంతృత్వ, ఫాసిజమ్ లాంటి విధానాలకు దారితీస్తాయి.
ప్రస్తుత పరిణామాలను గమనిస్తే రాష్ట్రంలో ఇదే రీతిన పరిపాలన కొనసాగుతుందేమోనన్న అనుమానం కలుగక మానదు. రైతుల సమస్యలను పరిష్కరించి వారి ‘ఆత్మహత్యలు’ జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది. అలాగే పెరిగిపోయిన నిరుద్యోగ-స్థాయి, సామాజిక సమస్యలకు పరిష్కార మార్గాలు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగం రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించదు. ఎంతసేపు అనవసర గొప్పలు, పార్టీ విస్తరణ, భవనాల కూల్చివేత, నూతన కట్టడాల నమూనాలే వారికి అత్యధిక ప్రాధాన్యత. వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోర్టుల్లో కూడా నిరంతర వాదనలు వినిపిస్తారు. ఇటు అతి పెద్ద కట్టడాల పేరున నిర్మాణాలు, దానికి మీడియాలో పెద్దఎత్తున ప్రచార ఆర్భాటాలు.
విద్య, వైద్యంపై దృష్టి ఏది?
విద్య, వైద్య, పారిశ్రామిక, ఆర్థిక, రవాణా వ్యవస్థల అభివృద్ధి ఒక్క హైదరాబాద్ లో జరిగితే ఏం లాభం.. అది అన్ని ప్రాంతాలకు విస్తరించాలి. తెలంగాణలో హైదరాబాద్ నగరాన్ని తప్పిస్తే ఇంకొక విమానాశ్రయమే లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 33 జిల్లాలుగా విభజించినా ఎలాంటి అవస్థాపన సౌకర్యాలు మెరుగుపరచలేదు. ఈ తొమ్మిది సంవత్సరాలలో ఏ జిల్లాలో కూడా కొత్త యూనివర్సిటీలు కట్టలేదు. కార్పొరేట్ స్థాయిలో విద్య అంటూ సంఖ్య పరంగా గురుకులాలను పెంచటం కాకుండా వాటిలో కనీస అవసరాలను కల్పించాలనే స్పృహ కొరవడింది. సంక్షేమం పేరుతో వివిధ ఆకర్షక పథకాలకు చేస్తున్న ఖర్చులో సగ భాగం విద్య, వైద్యానికి కేటాయించి అన్ని జిల్లాల్లో ఒకే విధమైన సంతులిత అభివృద్ధి జరిగేలా చూడాల్సింది. ఇ
ష్టారీతిన వ్యక్తిగత హోదా పలుకుబడిల ఆధారంగా ఉన్న పళంగా వేదికపైనే వరాలు ప్రకటిస్తూ కొన్ని ప్రాంతాలకు పాధాన్యత ఇస్తూ, మిగతా ప్రాంతాలను విస్మరించడం సరికాదు. ఇకనైనా ఒక ముందస్తు ప్రణాళికతో ఆ ప్రాంత అవసరాలను దృష్టి పెట్టుకుంటూ సమ్మిళిత అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కొన్ని ప్రాంతాల్లోనే డెవలప్మెంట్
మరోపక్క తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ అనే అంశాన్ని తీసుకొని ప్రజా-సమస్యలైన ‘ఉద్యోగాల -కల్పన’, ‘సామాజిక -న్యాయం’ అనే విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చటంలో సఫలీకృతమైనట్లు తెలుస్తున్నది. ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భావించే భారతదేశంలో ప్రస్తుతం ‘మెజారిటీ వర్సెస్ మైనారిటీ’ అనే ప్రయోగాత్మక ఆధిపత్య పోరు జరుగుతోంది. ఇలా సంపూర్ణ మెజారిటీతో దూసుకుపోతున్న ప్రభుత్వాలు మునుముందు ఎలాంటి దుందుడుకు చర్యలకు పోకుండా ప్రజా-సంక్షేమం, అభివృద్ధి కోసం నడుంబిగించాలి. రాష్ట్ర పరిపాలన అధికారం ఒకరి(కుటుంబం) చేతిలో కేంద్రీకృతం అయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ అభివృద్ధి కూడా గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల లాంటి కొన్ని ప్రాంతాలకే(నియోజకవర్గాలకే) పరిమితం అయింది.
రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి చేయాల్సిన ఫక్తు రాజకీయ నేతలు ఎన్నికల సమయంలో వాళ్ల నియోజక వర్గాలను మాత్రమే చూపిస్తూ ‘అలా చేస్తాం.. ఇలా చేస్తాం’ అంటూ ఊదరకొడతారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాం అంటారు. కానీ పార్టీ మారినా ఏ ఒక్క నాయకుడి నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణ అత్యంత ఆవశ్యకం. అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరాన్ని లండన్, డల్లాస్, టోక్యోల్లాగా చేస్తాం అని చెప్పడం కాదు అభివృద్ధికి దూరంగా కనీస సౌకర్యాలు లేని ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.
- డా.చాకేటి రాజు,ఫ్యాకల్టీ, అమిటీ యూనివర్సిటీ