హైదరాబాద్, వెలుగు: మిర్చిపంటను రక్షించడానికి ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ “డిసైడ్” అనే పురుగుమందును దక్షిణ భారత దేశ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది మిరపపంటలో రసం పీల్చే పురుగులను, నల్లి పురుగు, తామరపురుగు, తెల్లదోమ వంటి కీటకాలను ఒకే పిచికారి స్ప్రేతో చంపుతుంది. రెండు పురుగు మందులను కలిపి డిసైడ్ను తయారు చేశారు. మిత్సుషి కెమికల్స్ జపాన్ ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ పరస్పర సహకారంతో భారత మార్కెట్లోకి తెచ్చాయి.
డిసైడ్ నీటిలో కరిగే గుళికల రూపంలో లభ్యమవుతుంది. దీనికి ఇతర పురుగుల మందులను కలపాల్సిన అవసరం లేదని ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్, నేషనల్ సేల్స్ హెడ్ అభిషేక్ ధనుకా తెలిపారు. ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ గతంలో డిసైడ్ను ఉత్తర, తూర్పు పశ్చిమ రాష్ట్రాల్లో మాలిక్యూల్ రూపంలో విడుదల చేసింది. దేశంలో మిర్చిపంటలో 67 శాతం ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల రైతులు సాధిస్తున్నారు.