
- పాక్ ఉగ్రమూకలపై దాడులకు ప్రధాని ఆదేశం
- రక్షణ మంత్రి, సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులతో పీఎం భేటీ
- దాడులు ఊహించని స్థాయిలో ఉండాలి
- ముష్కరులను మట్టిలో కలిపేయాలని దేశం కోరుకుంటోంది
- సైన్యంపై పూర్తి విశ్వాసం ఉందని వెల్లడి
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో నరమేధం సృష్టించిన టెర్రరిస్టులను, వారి వెనక ఉన్న వాళ్లను మట్టిలో కలిపేయాలని సైనిక బలగాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ‘‘టార్గెట్లు, టైమ్ మీరే డిసైడ్ చేయండి. అటాకింగ్ మోడ్ ఎలా ఉండాలన్నదీ మీ ఇష్టం. ఈ విషయాల్లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. ఉగ్రమూకలపై మాత్రం ఊహించలేని విధంగా దాడులు చేసి మట్టిలో కలిపేయాలి” అని త్రివిధ దళాల అధిపతులకు ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం (April 30) ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్‌తో ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పాక్ టెర్రర్ క్యాంపులను నేలమట్టం చేసి తీరాల్సిందేనని యావత్తు దేశం కోరుకుంటోందని ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులకు ప్రధాని స్పష్టం చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
పాక్ టెర్రర్ క్యాంపులను నేలమట్టం చేసి తీరాల్సిందేనని యావత్తు దేశం కోరుకుంటోందని ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులకు ప్రధాని స్పష్టం చేశారని ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సైనిక బలగాలపై ప్రధాని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారని తెలిపాయి. కాగా, ఈ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధానితో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం (ఈ నెల 30) సెక్యూరిటీపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం కూడా జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత వారం రోజుల్లోనే సీసీఎస్ మీటింగ్ జరగనుండటం ఇది రెండోసారి కానుంది. అనంతరం ప్రధాని అధ్యక్షతన రాజకీయ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం కూడా జరగనున్నట్టు తెలుస్తున్నది.
హోంసెక్రటరీ అధ్యక్షతన హైలెవల్ మీటింగ్..
పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతాపరమైన సమీక్ష కోసం కేంద్ర హోం శాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హోం సెక్రటరీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌధరి, ఎన్ఎస్ జీ డీజీ భృగు శ్రీనివాసన్, అస్సాం రైఫిల్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా, సశస్త్ర సీమాబల్ డీజీ అనుపమా నీలేకర్ చంద్ర హాజరయ్యారు. అయితే, సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
పాక్ విమానాలకు, షిప్పులకు నో ఎంట్రీ..
భారత గగనతలంపై పాక్ విమానాలు ఎగరకుండా, భారత సముద్రజలాలు, పోర్టుల్లోకి పాక్ షిప్పులు రాకుండా నిషేధం విధించేందుకు కూడా కేంద్రం సిద్ధమైందని తెలుస్తున్నది. ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా పాక్ తన గగనతలంపై ఇండియన్ విమానాలు ఎగరకుండా నిషేధం విధించింది. భారత్ మాత్రం ఎయిర్ స్పేస్ మూసివేతపై ప్రకటన చేయలేదు. అయినా ఇప్పటికే పాక్ విమానాలు భారత గగనతలం మీదుగా రాకపోకలు ఆపేశాయి. ఇటు చైనా లేదా అటు శ్రీలంక మీదుగా చుట్టూ తిరిగి మలేషియా, థాయిలాండ్ వంటి తూర్పు దేశాలకు వెళ్తున్నాయి. మరోవైపు పహల్గాం ఉగ్రదాడిపై ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా, జపాన్, యూరోపియన్ దేశాల డిప్లమాట్లకు కేంద్రం వివరించింది. ఈ ఉగ్రదాడికి పాల్పడిన లష్కరే తయిబా ప్రాక్సీ సంస్థ టీఆర్ఎఫ్వెనక పాకిస్తాన్ ఉన్నట్టుగా ఆధారాలను సైతం చూపినట్టుగా తెలుస్తోంది.
హషీమ్ మూసా.. పాక్ మాజీ కమెండో
పహల్గాం టెర్రర్ అటాక్ సూత్రధారుల్లో ఒకడైన టెర్రరిస్ట్ హషీమ్ మూసా పాక్ ఆర్మీకి చెందిన మాజీ పారా కమెండో అని అధికారులు గుర్తించారు. ముందుగా పాక్ ఆర్మీలో పని చేసిన తర్వాత అతడు లష్కరే తయిబాలో చేరాడని.. ఏడాది కిందట మరో టెర్రరిస్ట్ తో కలిసి ఇండియాలోకి చొరబడ్డాడని నిర్ధారించారు. పాక్ ఆర్మీలో అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన కమెండో పహల్గాం టెర్రర్ అటాక్ లో పాల్గొన్నట్టు గుర్తించడం ఈ కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు. నిరుడు అక్టోబర్ లో సోనామార్గ్ టన్నెల్ వద్ద జరిగిన ఉగ్రదాడిలోనూ మూసా పాల్గొన్నట్టు భావిస్తున్నారు.
ఆ సందర్భంగా భద్రతా బలగాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో జునైద్ అహ్మద్ భట్ హతం కాగా, మూసా తప్పించుకున్నాడు. అప్పుడు భట్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ లో మూసా ఫొటోను బట్టి.. ఆ అటాక్ లో ఇతడి పాత్ర కూడా ఉన్నట్టు తేల్చారు. మూసా, ఇతర టెర్రరిస్టులు బార్డర్లో ఫెన్సింగ్‌ను కట్ చేసి జమ్మూకాశ్మీర్లోకి చొరబడ్డారని, అప్పటి నుంచి అనేకసార్లు దాడులకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. వీరికి 15 మంది లోకల్ కాశ్మీరీలు సాయం చేస్తూ వచ్చారని నిర్ధారించారు.
దక్షిణ కాశ్మీర్ ను జల్లెడపడుతున్న బలగాలు
పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత టెర్రరిస్టుల ఏరివేత కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు ప్రధానంగా దక్షిణ కాశ్మీర్ లోని అనంతనాగ్, షోపియాన్, కుల్గాం, పుల్వామా జిల్లాలను జల్లెడ పడుతున్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఆర్మీ జవాన్లు కలిసి ప్రత్యేకంగా 4 యాంటీ టెర్రర్ ఆపరేషన్లు చేపట్టాయని మంగళవారం అధికారులు వెల్లడించారు.
సైనిక దాడులకు సిద్ధమైనట్టే..?
బైసరన్ వ్యాలీలో 26 మంది టూరిస్టులను పాక్ టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్న తర్వాత ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించా రు. ఈ నరమేధానికి పాల్పడిన టెర్రరిస్టులతో పాటు, వారి వెనకున్న వారి భరతం పడతామని ప్రకటించారు. అనంతరం పాక్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు పాకిస్తానీయుల వీసాలను రద్దు చేశారు. టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమని ఆదివారం మన్ కీ బాత్ లోనూ ప్రధాని హెచ్చరించారు. వారం రోజులుగా రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు ఆవరించిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్, ఇతరులతో కీలక సమావేశాలు నిర్వహించారు. మంగళవారం రక్షణ మంత్రితోపాటు త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని భేటీ నేపథ్యంలో ఏ క్షణమైనా పాక్ టెర్రర్ క్యాంపులపై సైనిక దాడులు చేసేలా రంగం సిద్ధమైనట్టుగా భావిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్లో 48 రిసార్టులు క్లోజ్
శ్రీనగర్: పహల్గాం అటాక్ తర్వాత జమ్మూ కాశ్మీర్ సర్కార్ అప్రమత్తమైంది. భద్రతా కారణాలు, మరిన్ని దాడులు జరగొచ్చనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో 87 టూరిస్టు కేంద్రాల్లోని 48 రిసార్టులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. టూరిస్టుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది.
స్థానిక ప్రజలు, టూరిస్టులు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వాలని సూచించింది. కాగా, పహల్గాం దాడి తర్వాత కాశ్మీర్ లోయలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. గుల్మార్గ్, సోన్మార్గ్, దాల్ లేక్ వంటి కొన్ని సున్నితమైన ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.