అసైన్డ్ భూములపై హక్కులు.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటం: మంత్రి పొంగులేటి

  • అసైన్డ్ భూములపై హక్కులు.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటం: పొంగులేటి
  • కొన్నిచోట్ల పొజిషన్​లో పేదలుంటే, రికార్డులు ధనవంతుల పేర్లపై ఉన్నయ్
  • అట్లాంటి భూములపై పేదలకు పట్టాలు
  • ధరణి పేరుతో ప్రభుత్వ భూములు కబ్జా చేసిన్రు.. వాటిపై ఎంక్వైరీ చేస్తున్నం 
  • వీఆర్వోల్లో అర్హత ఉన్న వెయ్యి మందిని సర్వేయర్లుగా తీసుకుంటం 
  • ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్వోఆర్ చట్టం
  • ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా ఒకేసారి తయారు చేస్తం
  • వెలుగు ఇంటర్వ్యూలో మంత్రి వెల్లడి


హైదరాబాద్, వెలుగు: గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములపై పేదలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామని, వాటి క్రయవిక్రయాలు జరిగేలా పట్టాలు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేదలకు గతంలో ఇందిరమ్మ సర్కార్ అసైన్డ్​ భూములు ఇచ్చింది. అయితే అవసరాలకు వాటిని అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ఆ అసైన్డ్​ భూములపై పేదలకు పూర్తి హక్కులు కల్పిస్తాం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదలకు పంచడం. అది భూమి అయినా.. ఇండ్లు ఇవ్వడమైనా” అని పేర్కొన్నారు.

ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ‘వెలుగు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హుల వివరాలను ఒకేసారి యాప్​లో ఎంట్రీ చేస్తామని, అందులో నుంచే దశలవారీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. ‘‘రాష్ట్రంలో రికార్డుల్లో ఉన్న భూమికి, ఫీల్డ్​లో ఉన్న భూమికి పొంతనలేదు. ఇది గత పదేండ్లలో ఎక్కువైంది. ధరణి వచ్చాక లెక్కలు ఏమాత్రం సరిపోలడం లేదు. రైతుబంధు కోసం ధరణిలో భూములు నమోదు చేసినట్టు తేలింది. 

కొన్నిచోట్ల పొజిషన్​లో పేదోడు ఉండి వ్యవసాయం చేస్తుంటడు. ఆ పేదోని పేరు మీద పట్టా ఉండదు. అదే  భూమి ధనవంతుడి పేరు మీద, బీఆర్ఎస్ లీడర్ల పేరు మీద ఉంటది. అట్లాంటి భూములన్నింటిపైనా ఎంక్వైరీ చేస్తం. ఆ ధనవంతుల పేరు మీద ఉన్న భూమిని నిజంగా పొజిషన్​లో ఉన్న పేదోడి పేరు మీదకు మారుస్తాం. తిరుమలగిరి మండలంలో పైలట్ ప్రాజెక్ట్ చేస్తే 2,600 ఎకరాల్లో పొజిషన్​లో ఉన్న రైతులు పట్టాలు లేకుండా సాగు చేసుకుంటున్నారు. త్వరలోనే వారికి సీఎం చేతుల మీదుగా పట్టాలు అందజేస్తం’’ అని వెల్లడించారు.  

సర్వేయర్లుగా వీఆర్వోలు.. 

రాష్ట్రంలో భూముల హద్దుల విషయంలో పంచాయితీలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించామని పొంగులేటి తెలిపారు. ‘‘గెట్టు పంచాది పరిష్కరించుకుందామని ఎవరైనా సర్వేకు పెట్టుకుంటే నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కారణం ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా 232 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. 10 వేలకు పైచిలుకు రెవెన్యూ గ్రామాలకు అంత తక్కువ మంది సర్వేయర్లు మాత్రమే ఉండటం ఏంటి? అందుకే త్వరలో వెయ్యి మంది సర్వేయర్లను తీసుకుంటున్నం. గతంలో ఉన్న వీఆర్వోల నుంచే సర్వేయర్లను తీసుకుంటాం. వారికి ప్రత్యేకంగా ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తాం’’ అని చెప్పారు.  

ధరణి అక్రమాలపై విచారణ చేస్తున్నం.. 

గత ప్రభుత్వం ధరణిని ప్రైవేట్​ఏజెన్సీ టెర్రాసిస్​కు అప్పగించి భూములను ఆగం జేసిందని పొంగులేటి మండిపడ్డారు. ‘‘ధరణి పోర్టల్ ను ఎన్ఐసీకి అప్పగించినం. త్వరలోనే టెర్రాసిస్​లో జరిగిన వ్యవహరాలపై ఎంక్వైరీ చేస్తం. ధరణిని అడ్డం పెట్టుకుని ప్రైమ్ ఏరియాల్లో 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్​పట్టాలు చేశారు. సిద్దిపేటలో దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇట్లనే మాయం చేసి, 40 మంది పట్టాలుగా మార్చుకున్నరు. 

ఆ తరువాత ఆ భూమిని కంపెనీలకు అమ్ముకున్నారు. వీటన్నింటిపై ఎంక్వైరీ చేయిస్తున్నం. 58,59 జీవోలను అడ్డం పెట్టుకుని అక్రమంగా 19 ఎకరాలు రెగ్యులరైజ్​ చేసుకున్నరు. ఆ 2 వేల ఎకరాలు, ఈ 19 ఎకరాలు ప్రొహిబిషన్​లో పెట్టినం” అని తెలిపారు. ‘‘రంగనాయక సాగర్​దగ్గర మాజీ మంత్రి హరీశ్​రావు ఒకసారి భూసేకరణకు నోటిఫికేషన్​ఇచ్చాక, మళ్లీ డినోటిఫై చేయించి.. ఆ రైతులను భయపెట్టి పట్టాలు చేసుకున్నారు. దీనిపైనా ఎంక్వైరీ చేస్తున్నాం. రిపోర్ట్ వచ్చాక చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు. 

ధరణి స్థానంలో కొత్త పోర్టల్.. 

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్వోఆర్–2024 చట్టం తీసుకొస్తామని పొంగులేటి వెల్లడించారు. ‘‘ధరణి స్థానంలో కొత్త వెబ్​పోర్టల్​వస్తుంది. ఇప్పుడు ఒక పట్టాదారు కాలమ్​మాత్రమే ఉన్నది. కొత్తగా తెచ్చే పోర్టల్​లో 12 నుంచి 14 కాలమ్​లు ఉంటాయి. పోర్టల్​లోనే కాకుండా మాన్యువల్​గానూ ఆ కాలమ్స్​రికార్డును నిర్వహిస్తం. ప్రభుత్వ భూములన్నింటికీ లాక్​వేసి కబ్జా కాకుండా కాపాడుతాం” అని తెలిపారు. ‘‘నేను ప్రభుత్వంలో నెంబర్ 2,3 కాదు.. నెంబర్​11. నా వెంట 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రభుత్వం నాకు ప్రాధాన్యం ఇస్తుందనేది అబద్ధం. అవకాశం వచ్చింది మంత్రిగా సేవలు అందిస్తున్న. 

నేనే రాజకీయాల్లోకి రాకముందే కాంట్రాక్టర్‎ను. ఇప్పుడు నా బంధువులు, కుటుంబ సభ్యులు కంపెనీలలో ఎక్కడైనా డైరెక్టర్లుగా ఉన్నారు కావొచ్చు. ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​పార్టీలోనూ నేను ఉన్నాను. మరి అప్పుడేందుకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడెందుకు గుర్తుకొస్తున్నది. వాళ్లవన్నీ అవకాశవాద రాజకీయాలు. ఈడీకి నా దగ్గర ఏం దొరకలేదు. అంత అనుమానం ఉంటే అర్ధరాత్రి పూట కేంద్రంలో నంబర్ 1,2లను పోయి కలిసిండు కదా. వాళ్లనే అడిగి తెలుసుకోవాలి నా ఇంట్లో ఏం దొరికిందో’’ అని అన్నారు.