ముంబై: గతేదాడి జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన ఇండియా కూటమికి తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎదురు దెబ్బను దృష్టిలో పెట్టుకుని త్వరలో జరగనున్న ముంబై, థానే, నాగ్‌పూర్, ఇతర మున్సిపల్ కార్పొరేషన్‌లు, జిల్లా పరిషత్‌లు, స్థానిక పంచాయితీలలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షమైన శివసేన (ఉద్ధవ్ వర్గం) డిసైడ్ అయ్యింది.
శివసేన సీనియర్ నేత, రాజ్య సభ ఎంపీ సంజయ్ రౌత్ 2025, జనవరి 11వ తేదీన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ముంబై, నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేస్తోందని స్పష్టం చేశారు. ఇండియా కూటమితో పొత్తు ఉండదని.. మేం సింగల్గానే పోరాడుతామని.. ఏం జరిగినా చూసుకుంటామని అన్నారు.
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. కూటమి పొత్తులో భాగంగా పార్టీ కార్యకర్తలకు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాదని.. స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా పొత్తు పెట్టుకుంటే కార్యకర్తలకు సరైన అవకాశాలు రావని.. ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగి పార్టీని బలోపేతం చేసుకుంటామని పేర్కొన్నారు.గత ఏడాది లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత భారత కూటమి ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదని.. ఇది మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read :- అప్పుడే ఏడాది అయిపోయింది.. అయోధ్య రామ మందిర వార్షికోత్సవ వేడుకలు..
కూటమిలో అతిపెద్ద పార్టీగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్ బాధ్యత అని హస్తం పార్టీకి చురకలంటించారు. కాగా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. శివసేన యూబీటీ, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్) పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్యులుగా చేరి పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా అద్భుత ఫలితాలు సాధించింది. అధికార బీజేపీని తక్కువ స్థానాలకు పరిమితం చేసి మెజార్టీ సీట్లు ఇండియా కూటమి దక్కించుకుంది.
అయితే, 2024 చివర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో కేవలం 70 సీట్లకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎదురు దెబ్బ తగలడంతో ఇండియా కూటమిలో బీటలు వారాయి. దీంతోనే లోకల్ బాడీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన (ఉద్ధవ్) నిర్ణయించుకుంది. ఎంవీఏ కూటమి నుంచి వైదొలగాలని ఉద్ధవ్ ఠాక్రే తీసుకున్న నిర్ణయం ఆయన కుమారుడు ఆదిత్య ప్రయోజనాల కోసమేనని వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) అధినేత ప్రకాశ్ అంబేద్కర్ విమర్శించారు.