కేసీఆర్​ను ఇంటికి పంపించే  నిర్ణయమే తీసుకుంటా :  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మరిపెడ, వెలుగు:  సీఎం కేసీఆర్​ను  ఇంటికి పంపించడానికి  సరైన టైంలో  మంచి నిర్ణయం తీసుకుంటామని  మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.  శనివారం  మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల గ్రామంలో బీఆర్ఎస్ లీడర్ పాశం నరేశ్​ రెడ్డి నాయనమ్మ  దశదినకర్మలకు హాజరయ్యారు.  

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..   తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని ప్రజలు ఎన్నో కలలు కన్నారని,  వారి కలలు కల్లలుగానే మిగిలాయన్నారు.  రైతులు పడుతున్న ఇబ్బందులు కేసీఆర్​ కండ్లకు కనబడడం లేదా అని ప్రశ్నించారు.  గొప్ప రైతును అని చెప్పుకునే కేసీఆర్ ఎన్నికల స్టంట్ తో కాకుండా చిత్తశుద్ధితో రైతులను ఆదుకోవాలన్నారు. గొప్పలకు పోయి ప్రభుత్వ సొమ్ముతో  రైతు దినోత్సవం పేరిట హడావుడి చేస్తున్నారని ఆరోపించారు.  

రైతులకు పంట పరిహారం కింద రూ.10వేలు అందించలేని ప్రభుత్వం  21రోజులు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పుకోవడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.