బీసీ జనాభాను తగ్గించడమే రోల్ మోడలా? కాంగ్రెస్ కులగణన తప్పుల తడకగా ఉంది: లక్ష్మణ్

బీసీ జనాభాను తగ్గించడమే రోల్ మోడలా? కాంగ్రెస్ కులగణన తప్పుల తడకగా ఉంది: లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: బీసీల జనాభాను తగ్గించి ముస్లింలకు కట్టబెట్టడమే దేశానికి కాంగ్రెస్ చూపే రోల్ మోడలా? అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ కులగణన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని కిషన్ రెడ్డి అధికారిక నివాసంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. 

కాంగ్రెస్ సర్కార్ ఓబీసీల పట్ల కపట ప్రేమను ఒలకబోస్తున్నదని ఎద్దేవా చేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా.. సర్వేలో బీసీల శాతాన్ని తగ్గించి చూపారని ఫైర్ అయ్యారు. కులగణన బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు ప్రభుత్వం చేసిన చర్యగా అభివర్ణించారు. 

మండల్ కమిషన్ లో 51%, బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వేలో 52% ఉన్న బీసీలు.. 46%కి ఎలా తగ్గారో రేవంత్ చెప్పాలన్నారు. 4కోట్ల జనాభాలో దాదాపు 6% తగ్గుదల బీసీలకు కాంగ్రెస్ చేస్తోన్న ద్రోహానికి అద్దం పడుతోందన్నారు. 12% ముస్లింల జనాభాను చూపిస్తూ.. 2% ముస్లిం బీసీలు, ముస్లిం ఓసీలు అని చూపించడం 
దేనికి నిదర్శనమని నిలదీశారు.