జగిత్యాల ఎంసీహెచ్​లో తగ్గుతున్న డెలివరీలు

  • మూడు నెలల్లో ఐదుగురు బాలింతలు, శిశువు మృతి
  • నెలలో వందకు పడిపోయిన డెలివరీ రేట్
  • వివాదాల్లో ఉన్నవారికే కీలక పోస్టింగ్ లు 
  • ఆందోళన చేస్తున్న బాధితులు

జగిత్యాల, వెలుగు: గర్భిణులు, బాలింతలు, శిశువుల సంరక్షణ కోసం జగిత్యాలలో ఏర్పాటు చేసిన మాత,శిశు సంరక్షణ కేంద్రంపై 3 నెలలుగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. డెలివరీల సంఖ్య పెంచి, గవర్నమెంట్ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆస్పత్రులలో మాతా శిశువుల మరణాలు ఆందోళనకు కారణమవుతున్నాయి.

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింతల మృతి..

జగిత్యాల ఎంసీహెచ్ లో మూడు నెలలలోపు కొండ్ర రమ్య, కుర్ర మహేశ్వరి, అయ్యోరి నాగమణి, బాదినేని రజిత, మారంపెల్లి పావని మృత్యువాత పడ్డారు. వీరి మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహించిన మృతుల బంధువులు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు ఆస్పత్రి సిబ్బందితో సమావేశమై ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల మల్లాపూర్ మండలం వాల్గొండకు చెందిన లాస్యకు సరైన వైద్యం అందకపోవడంతో పుట్టిన వెంటనే శిశువు చనిపోయింది. దీంతో ఎంసీహెచ్ సిబ్బందిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

తగ్గుతున్న డెలివరీ రేట్..

ఎంసీహెచ్ తో పాటు కోరుట్ల, మెట్​పల్లి ప్రభుత్వ ఆస్పత్రులు, రాయికల్, ధర్మపురి ఆస్పత్రుల్లో డెలివరీ రేట్ తగ్గుతోంది. వీటిలో ఈ ఏడాది అక్టోబర్ లో 460 , నవంబర్ 420, డిసెంబర్ 21 వరకు 240 డెలివరీలు అయ్యాయి. డిసెంబర్ నెలలో మరో సుమారు 100కు పైగా డెలివరీలు జరిగినా 340 దాటదు. మూడు నెలలుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య 100కు తగ్గడంతో ప్రజలు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కోల్పోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

పోస్టింగుల్లో రాజకీయాలు..?

  • మెడికల్ కాలేజీగా అప్ గ్రేడ్ కాకముందు జిల్లా ఆస్పత్రి వైద్య విధాన్ పరిషత్ పరిధిలోకి వచ్చేది. ఆ సమయంలో పీడియాట్రిక్ వార్డు ఇన్​చార్జిగా పని చేసిన ఓ డాక్టర్ అధికార పార్టీ నేతల అండతో మెడికల్ కాలేజీలో భాగమైన ఎంసీహెచ్ లో కీలక పోస్టు దక్కించుకున్నాడు. అయితే ఆ పోస్టుకు సరిపడా అర్హులందరినీ పక్కన పెట్టిన ఉన్నతాధికారులు సదరు డాక్టరుకు పోస్టు ఇవ్వడంపై ఆస్పత్రి వర్గాలు సైతం విముఖంగానే ఉన్నాయి.
  • మహిళ వైద్య సిబ్బంది, డాక్టర్లతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వైద్యాధికారిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదారాబాద్ విజిలెన్స్ కమిటీ విచారణ చేసి మూడు నెలలు గడిచినా చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ  లీడర్ల అండదండలతో ఎంక్వైరీ నీరుగారిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
  • గతంలో వైద్య సిబ్బంది, శానిటేషన్, వార్డు బాయ్స్, సెక్యూరిటీ సిబ్బందిని ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న మరో డాక్టర్ రాయికల్ హెల్త్ సెంటర్ కు బదిలీపై వెళ్లాడు. కానీ రెండు మూడు నెలలు గడవక ముందే ఓ మంత్రి పీఏ పైరవీతో డిప్యూటేషన్ పొంది అదే రీతిలో స్టాఫ్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు వ్యక్తికి పర్మినెంట్ గా పోస్టింగ్ వచ్చేలా ఎంసీహెచ్ లోని ఓ కీలక ఆఫీసర్ హైదరాబాద్ హెల్త్ డిపార్ట్​మెంట్ ఆఫీస్ లో చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.
  • అధికార పార్టీ నేతల జోక్యం ఎక్కువ కావడం, జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కొందరు డాక్టర్లు రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు.
  • ఎంసీహెచ్ లో మెటర్నటి, పీడియాట్రిక్, ఎస్ఎన్​సీయూ వార్డుల్లో సుమారు వంద మంది రోగులకు చికిత్స అందించేందుకు ఆల్ట్రా సౌండ్ స్కానింగ్, టీఫా మిషన్ తో అన్ని సదుపాయాలు ఉన్నా సరైన వైద్య సేవలు అందక రూ.కోట్లు వృథా అవుతున్నాయి.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

వైద్య సేవలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. వంద మందికి చికిత్స అందించేందుకు మెటర్నటీ, పీడియాట్రిక్, ఎస్ఎన్​సీయూ వార్డులు ఏర్పాటు చేశాం. వీటిలో అల్ట్రా సౌండ్ స్కానింగ్, టీఫా మిషన్లతో పాటు మరిన్ని ఆత్యాధు నిక మిషనరీ అందుబాటులో ఉంచాం.

- రాములు, సుపరింటెండెంట్,  జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి