శారీరక శ్రమ తగ్గుతున్నది : సోషల్ అనలిస్ట్ ఐ. ప్రసాదరావు

గత ఎనిమిది దశాబ్దాల నుంచి రీసెర్చ్ పేపర్స్, పేటెంట్ రైట్స్ కోసం తాపత్రయం పడేవారి సంఖ్య తగ్గుతున్నది. దీనికి కారణం, ఉన్న ఆవిష్కరణలతో పనులు నెరవేరుతున్నాయి అనే భావన చాలామందిలో ఉద్భవించింది. దీంతో కొత్త ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు పెట్టడం తగ్గించి, మేథో సోమరితనాన్ని పెంచి పోషిస్తున్నారు. ఉదాహరణకు, వ్యవసాయ రంగంలో నూతన సాధనాలు వాడకం వల్ల, భౌతిక శ్రమ లేకుండా ఊబకాయం తోడై, సోమరితనం ఆవహిస్తున్నది‌‌. దీనికి తోడు ఇటీవల పట్టణాల నుంచి పల్లెటూరు వరకు ‘జంక్ ఫుడ్ బేకరి ఐటమ్స్’  తినడం పెరగడం వల్ల స్థూలకాయం పెరిగి పిల్లలు, యువత అనారోగ్యం పాలవతున్నారు.శ్రమ రహితం మంచిది కాదు.

అలాగే ప్రతీ అవసరాన్ని తీర్చుకోవడానికి బైకులు వాడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల, స్థూలకాయానికి అవకాశం ఇస్తున్నారు. పిల్లల పెంపకంలోనూ ఇలాంటి వైఖరే కనిపిస్తున్నది. టీవీల్లో క్రీడలు చూడటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప, నడవడానికి, ఆటలు ఆడటానికి ప్రయత్నాలు చేయడం లేదు. చిరుతిళ్లు తింటూ భారీ కాయం పెంచుతున్నారు. వీటన్నిటి ఫలితంగా యుక్త వయసులోనే గుండెపోటు లాంటి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కనీస పరిజ్ఞానం ఏ రంగంలోనూ లేకుండా పోయింది. ‌‌అత్యంత బాధాకరమైన విషయం. ‌‌ఉన్న వాటితో సర్దుకు పోవడం, లేనివాటిని దిగుమతి చేసుకుంటూ జీవితాన్ని గడిపేయడం జరుగుతున్నది. అందుకే రీసెర్చ్ అండ్ డెవలప్​ మెంట్ రంగాల్లో జరగాల్సినంత కృషి జరగక, ఆశించిన ఫలితాలు రావడం లేదు. పరిశోధన పత్రాలు, పేటెంట్ రైట్స్ కోసం అతి తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయి.‌‌ ఇకనైనా పౌరులు ముఖ్యంగా యువత నూతన ఆలోచనలకు, కొత్త ఆవిష్కరణల కోసం ప్రయత్నం చేయాలి. శారీరక మానసిక సోమరితనం వీడాలి. మరెన్నో కొత్త ప్రయోగాలు, ఆలోచనల ద్వారా మేధోమథనం చేసి, సరికొత్త ఆవిష్కరణలు చేసి, నోబెల్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు సాధించాలి. సాంకేతికతను అవసరం మేరకే, పరిమితంగా వాడటం చేయాలి. శారీరక, మానసిక శ్రమను పెంచుకునే  ప్రయత్నం చేయాలి.

మొబైలే జీవితం కావద్దు

ఇక ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు‌‌,‌‌సెల్ ఫోన్లు, కంప్యూటర్, ట్యాబ్, లాప్ టాప్ వాడకం పెరిగింది. దీంతో ఆలోచించడం మానేస్తున్నారు. చిన్న చిన్న లెక్కలకు కూడా క్యాలిక్యులేటర్ వాడటంపై ఆధారపడుతున్నారు. ఇలా టెక్నాలజీ పురోభివృద్ధి వల్ల మానవ మెదడుకు కనీసం ఆలోచన, విశ్లేషణ లేకుండా పోతున్నది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది సోషల్ మీడియాలో చిట్ చాట్, అనవసర విషయాలు, ఫొటోలు చూస్తూ కాలక్షేపం చేయడం జరుగుతున్నది. వీడియో గేమ్స్, రకరకాల వెబ్ సైట్లు చూస్తూ కాలక్షేపం చేయటమూ పెరుగుతున్నది. వాట్సప్, ట్విట్టర్, ఇన్​స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో  మూడు సంవత్సరాల వయసు గల వారి నుంచి పండు ముసలి వరకు కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు మత్తులో జోగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నూతన ఆవిష్కరణలు ఎలా వస్తాయి? మరింత శారీరక, మేథో సోమరితనం పెరుగుతుంది అని గ్రహించాలి. ‌‌

-ఐ. ప్రసాదరావు
సోషల్ అనలిస్ట్