తెలంగాణలో తగ్గుతున్న వృక్ష సంపద

తెలంగాణలో తగ్గుతున్న వృక్ష సంపద

తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు దట్టమైన అడవులు ఉండేవి.  ప్రతిరోడ్డు పక్కన భారీ చింతచెట్లు, మర్రి, వేప, రావి, మామిడి చెట్లు ఉండేవి.  వ్యవసాయ క్షేత్రాలలో,  గట్ల వెంబడి చెట్లు ఉండేవి. చెట్ల తోపులు కూడా ఉండేవి. వ్యవసాయ క్షేత్రాల నుంచి గ్రామాలకు ఉండే దారుల వెంబడి కూడా చెట్లు ఉండేవి. సాధారణంగా గుళ్లు ఎత్తైన ప్రదేశాలలో ఉన్న పుణ్యక్షేత్రాల ప్రాంతంలో కూడా రావిచెట్లు, ఇంకా వివిధ చెట్లు ఉండేవి.  గ్రామ చెరువు గట్ల మీద పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఈ చెట్ల కిందనే మైసమ్మ, ఎల్లమ్మ, తదితర దేవతలను పూజించేవారు. ఈ చెట్లన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు ఎందుకు లేవు?  చెట్లను నరికేసిన వ్యక్తులు, సంస్థలు ఎవరు? ప్రభుత్వం ఏమి చేస్తోంది? 

ఎక్కడ చెట్లు ఉన్నా వాటి ద్వారా మంచి పరిణామాలే తప్పితే ఇతరత్రా ఏమి ఉండదు. కానీ, చెట్లను నరికివేయడానికి అనేక కారణాలు వెతకడం మొదలుపెట్టారు. చెట్టు నీడ వస్తే పంట దిగుబడి తగ్గుతుంది అని వ్యవసాయ క్షేత్రాల నుంచి తొలగించారు.  గట్టు  గట్టిగా ఉండాలని,   పంటమీద ఎండ ఉండాలని,  పక్షులు వస్తాయని,  గట్లమీద ఉన్న వృక్షాలను తొలగించారు. రోడ్డు పక్కన చెట్లను ప్రమాదాలు ఏర్పడుతున్నాయని తీసివేశారు. ఏదో ఒక సాకు. అపనమ్మకం. ఊరి పొలిమేరలలో ఉండే అనేక చెట్ల తోపులు రకరకాల కారణాల వల్ల తొలగించారు. 

చెట్ల ద్వారానే స్వచ్ఛమైన గాలి

మనం నీళ్లు కొనుక్కోవడం మొదలు పెట్టినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. దానికి ముందు పండ్లు కొనడం కూడా గ్రామీణులకు ఆశ్చర్యం అనిపించేది. గ్రామాలలో పండ్ల తోటలు ఎక్కువ.  చిట్టడవులలో, తోపులలో, ఎక్కడపడితే అక్కడ పండ్లు దొరికేవి. అందరికీ అందుబాటులో ఉండేవి.  ఇప్పుడు స్వచ్ఛమైన గాలి వంతు రాబోతున్నది అని అందరూ హెచ్చరిస్తున్నారు. మానవాళికి కావాల్సిన స్వచ్ఛమైన గాలి చెట్ల ద్వారా మాత్రమే సాధ్యం. స్వచ్ఛమైన గాలిని అందించే చెట్లను మాత్రం నరికేస్తున్నారు. వేప వంటి కొన్ని జాతుల చెట్లు అందించే గాలి ఆరోగ్యకరమైనది. వాటిని కూడా కాపాడడం లేదు. ఒక చెట్టు ఉన్నా మంచిదే. ఒక అడవి లేక ఒక తోపు ఉంటే ఇంకా మంచిది.  రహదారుల వెడల్పు పనులలో రహదారి చెట్లను నరికివేశారు. వాహనాలకు రోడ్లు కావాలని రోడ్లను వెడల్పు చేసి, అమెరికా తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటూ, వేల సంఖ్యలో  చెట్లను నిర్మూలించారు. ఇక్కడ ఒక చెట్టు పోతే, ఇంకెక్కడనో దానికి రెండింతలు చెట్లు పెడతామని ప్రభుత్వం సాధారణంగా వాగ్దానం చేస్తుంది. కాకపోతే, ఆ వాగ్దానం అమలు అయ్యిందా లేదా అని చూసి, చెప్పే, పర్యవేక్షించే వ్యవస్థ లేదు. 

అభివృద్ధి పేరుతో వృక్షాల నరికివేత

ఆధునిక అభివృద్ధి పేరుతో వృక్షాల నరికివేత నిత్యం కొనసాగుతూనే ఉన్నది. తెలంగాణ ఏర్పడిన మొదటి 5 ఏండ్లలోనే దాదాపు 12 లక్షల చెట్లను నరికివేసినట్లు ఒక అంచనా. ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. కేవలం రెండు దశాబ్దాల కిందనే ఎక్కువ సంఖ్యలో చెట్లు ఉండేవి. అప్పట్లో ఎవరైనా చెట్ల గణన చేయమంటే నవ్వి ఉండేవారు. ఒకప్పటి అసంఖ్యాక వృక్షాలు ఇప్పుడు లెక్కించేంతగా తగ్గిపోయినాయి. అప్పట్లో అవసరం అనిపించేది కాదు. ఇప్పుడు చెట్ల గణన అవసరం కనపడుతున్నది. వృక్షాలలో ఏ జాతులు ఎన్ని ఉన్నాయి?  అంతరించినపోయిన లేదా అంతరించిపోతున్న వృక్ష జాతుల మీద అధ్యయనం అవసరం ఉన్నది. ప్రతి చెట్టు ముఖ్యమే.  అనేక చోట్ల ఇష్టానుసారం చెట్లను నరికినా దర్యాప్తు లేదు. సదరు అధికారుల మీద చర్యలు శూన్యం.   

అటవీ ప్రాంతం 27,292 చదరపు కిలోమీటర్లు 

అడవుల స్థితి మీద కేంద్ర నివేదిక ప్రకారం, తెలంగాణలో అటవీ ప్రాంతం 27,292 చదరపు కిలోమీటర్లు.- మొత్తం భౌగోళిక ప్రాంతంలో దాదాపు 24.35 శాతం.  రికార్డుల ప్రకారం, 27,292 చదరపు కిలోమీటర్లలో,  రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా 19,696.23 చదరపు కిలోమీటర్లు, రక్షిత అడవులు 6953.47 చదరపు కిలోమీటర్లు. మిగిలిన 642.30 చదరపు కిలోమీటర్లలో  ఏమి ఉన్నాయో తెలియదు. అడవులకు ఇచ్చే పుస్తక నిర్వచనం ప్రకారం, మనం చూసిన ఆడవులతో పోలిస్తే ఇప్పుడు అడవులుగా భావిస్తున్న ప్రాంతంలో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయో తెలియదు. అటవీ ప్రాంతాలు పలచబడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో, వికారాబాద్ గుట్టల మీద, నల్లమల ప్రాంతంలో చెట్ల సంఖ్య పడిపోతున్నది. 

అటవీ శాఖకు దీని మీద దృష్టి లేదు. భూతాపం వల్ల పరిస్థితి మారుతుందా, భూమిలో తేమ లేకనా? అటవీ ఉత్పత్తులు కూడా తగ్గుతున్నాయి. తెలంగాణ అడవుల మీద చర్చించాలిఇటీవల కంచ గచ్చిబౌలి వివాదం వచ్చినప్పుడు, విద్యార్థులు చేపట్టిన 400 ఎకరాలను వన్య సంరక్షణ కేంద్రంగా ప్రకటించమంటే, ప్రభుత్వం సమీప బొటానికల్ గార్డెన్, ఇంకా ప్రాంతాలు ఉన్నాయి కనుక ఇక్కడ అవసరం లేదు అని ప్రకటించడం శోచనీయం. ఈ మధ్య ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కులలో జీవ వైవిధ్యం, వన్యప్రాణులు, పక్షులు పెరగకపోవడానికి ప్రధాన కారణం అక్కడ నాటిన వృక్షాలు. జీవవైవిధ్య శాస్త్రం అమలు చేయకుండా గుడ్డిగా చెట్లను నాటడం వల్ల సుస్థిర ఫలితాలు రావు అనడానికి నిదర్శనం ఈ పార్కులే.  చెట్లలో కూడా వైవిధ్యం ఉన్నది. కొన్ని చెట్లు వన్యప్రాణులకు ఆధారం. వైవిధ్యం లేకుండా, వివిధ ప్రాణులకు ఆహారాన్ని ఇవ్వని చెట్లు నాటితే ఆ ప్రాంతం చివరకు ‘పచ్చ’ ఎడారిగా మిగులుతుంది. వృక్షశాస్త్రజ్ఞులు ట్రీస్ ఆఫ్ ఇండియా (ToI) వృక్షాల మీద ఒక సమగ్ర డేటాబేస్‌‌‌‌ను రూపొందించారు. ఇందులో  3,708 చెట్ల జాతుల జాబితా ఉన్నది. మన దేశంలో 609 స్థానిక వృక్ష జాతులు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 347 అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. తెలంగాణలో ఎన్ని వృక్ష జాతులు ఉన్నాయి? అంతరించిపోతున్నాయి ఎన్ని వంటి వివరాలు ఎప్పటికప్పుడు సేకరించి ఇచ్చే సంస్థ లేకపోవడం మన దురదృష్టం.  చెట్ల వైవిధ్యం అంతరించిపోతే తిరిగి సాధించటం కష్టమే.  రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు మారాల్సిన అవసరం ఉన్నది. చెట్లు, జీవ వైవిధ్య, అడవుల పట్ల అవగాహన పెంచుకోవాలి. అసెంబ్లీలో తెలంగాణ అడవుల మీద చర్చించాలి. అటవీ విస్తీర్ణం 33 శాతం చేయడానికి ప్రణాళిక తయారు చేయాలి. 

నిర్లక్ష్యంలో అటవీ సంరక్షణ కేంద్రాలు

హైదరాబాద్  చుట్టుపక్కల 90వ దశకంలో సంరక్షణ పార్కులుగా ప్రకటించిన మూడు పెద్ద అటవీ సంరక్షణ కేంద్రాలు నిర్లక్ష్యం నీడలో ఉన్నాయి. అవి  కేబీఆర్,  హరిణ వనస్థలి,  మృగవని. వీటిపై నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉన్నది అంటే  అటవీశాఖ ఇన్ని ఏండ్లలో  భూ సర్వే చేయలేదు. వివిధ ప్రాజెక్టులకు  కేకు కోసినట్టు కొంత కొంత భూమిని ఇచ్చేస్తున్నారు. లెక్క లేదు. మృగవని పార్కు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుమతి ఇచ్చిన తరువాత రోడ్డుకు ఇవతల ఉన్న భూమి మీద అటవీశాఖ శ్రద్ధ పోయింది. మూడింటిలో మృగవని పార్కు దాదాపు 40 శాతం అన్యాక్రాంతం అయిపోయింది. కోర్టు కేసులో వాస్తవాలు బయటకు వచ్చిన తరువాత కూడా అటవీశాఖ నిర్లక్ష్యం కొనసాగుతున్నది. అడిగినా కూడా కోర్టు కూడా ఈ నిర్లక్ష్యాన్ని ఎండగట్టే పని చేపట్టలేదు. ఇక్కడ అరుదైన చెట్లు మాయం అవుతున్నాయి. ప్రభుత్వ శాఖలే  చట్ట విరుద్ధంగా, అనుమతి లేకుండా ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నాయి. 

- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​