గత కొద్దినెలలుగా ఫార్ములా ఈ కారు రేసు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కారు రేసు వ్యవహారం.. ఏసీబీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు, అలాగే రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా పని కల్పించడం జరిగింది. వార్తా పత్రికలు, టీవీ చానళ్లు ఈ కారు రేసుపై జరుగుతున్న విచారణ విషయాలు, రాజకీయ పార్టీల ఆరోపణలు పరస్పర ఆరోపణలు ప్రసారం చేయడంలో బిజీగా ఉన్నాయి.
కారు రేసుకు సంబంధించి కేసు కోర్టులో ఉన్నందున కొన్ని విషయాలు మాత్రమే క్లుప్తంగా రాయడం జరుగుతుంది. కారు రేసుకు సంబంధించి ఒక విదేశీ కంపెనీకి ఆర్బీఐ పర్మిషన్ లేకుండా విదేశీ కరెన్సీలో నిబంధనలకు విరుద్ధంగా 45 కోట్ల రూపాయలు బదిలీ చేశారని ప్రధాన ఆరోపణ. కాగా, పదికోట్లకు మించి డబ్బులు చెల్లించినప్పుడు ఆర్థికశాఖ అనుమతి అలాగే మంత్రివర్గ ఆమోదం కూడా కావాలి.
ఇవి రెండూ కూడా జరగలేదు.
డబ్బు మార్పిడి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు జరిగింది. దీనికి ఎన్నికల కమిషన్ అనుమతి కూడా కావాలి. ఇలా రకరకాల నిబంధనలకు విరుద్ధంగా డబ్బు మార్పిడి జరిగిందని కీలక అభియోగం. సంబంధిత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డబ్బు మార్పిడి నా నిర్ణయం కాదు, అది సంబంధిత మంత్రి ఆదేశానుసారంగా జరిగిందని తెలిపారు. అదేవిధంగా విశ్రాంత హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీరు కూడా చెప్పడంతో.. ఇదంతా రాజకీయ ఒత్తిడి, ప్రమేయంతోనే అధికారులు పనిచేశారని తెలుస్తోంది. అయితే, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఒక ఉన్నత పదవిలో ఉన్నారు.
వారు నోట్‌ఫైల్ పై ఇలా రూ. 45 కోట్ల డబ్బు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఒక ముక్క రాసి ఉంటే ఈనాడు ఆయన, చీఫ్ ఇంజినీరు కూడా చిక్కుల్లో పడేవారు కాదు. ఉన్నత పదవులలో ఉన్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకుల ఆదేశాలు అమలుచేసి చిక్కుల్లోపడ్డ ఉదంతం ఇది మొదటిది కాదు. ఇంతకుపూర్వం రహేజా సంస్థకు భూమి కేటాయింపు అలాగే నిబంధనలకు విరుద్ధంగా గనుల కేటాయింపులలో ఉన్నత పదవులలో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు చిక్కుల్లోపడ్డారు. ఇటువంటి కేసులు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఇక్కడ పాలనలో అధికారుల పాత్ర గురించి కొంచెం పరిశీలన చేయవలసిన అవసరముంది.
తుప్పుపడుతున్న ‘స్టీల్ ఫ్రేమ్’
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశ విభజన జరిగి పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. దానికితోడు సుమారు 300కు పైబడి చిన్న, పెద్ద సంస్థానాలు, బ్రిటిష్‌వారు పాలించిన ప్రాంతాలను కలిపి ఒక దేశంగా చేయవలసిన విపత్కర పరిస్థితి నెలకొంది. అప్పటి ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఇండియన్ పోలీసు అధికారులు సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో దేశాన్నంతటిని ఒక తాటిపైకి తెచ్చి ప్రభుత్వ పాలనను గాడిలో పెట్టారు.
అందుకే వారిని స్టీల్ ఫ్రేమ్ (ఉక్కు చట్రం) అనేవారు. అనంతరం ఐసీఎస్, ఐపీ సర్వీసులు.. ఐ.ఏఎస్, ఐ.పీ.ఎస్ గా రూపాంతరం చెందాయి. స్వాతంత్ర్యం నాటి ‘స్టీల్ ఫ్రేమ్’ కాలక్రమేణా తుప్పు పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ పాలనా యంత్రాంగం చాలామటుకు తమ విధేయతను, రాజ్యాంగం నుంచి రాజకీయ నాయకులకు బదలాయించినారు. నాలుగురాళ్ళు దొరికే స్థలాలకు పోస్టింగ్ వేయించుకోవడం, అలాగే రిటైర్మెంట్ తరువాత అడ్వైజర్ వంటి ఏదో పదవికోసం రాజకీయ నాయకుల చెప్పుచేతుల్లో పనిచేస్తూ నిబంధనలు తుంగలో తొక్కి పాలన అంతా అస్తవ్యస్తం చేయడం, రాష్ట్రానికి నష్టం కలిగేటట్లు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది.
మసకబారుతున్న సివిల్ సర్వీసులు
ఐఏఎస్, ఐపీఎస్. అధికారులకు చక్కటి ట్రైనింగ్ ఇవ్వబడుతోంది. అదీగాక ఉద్యోగరీత్యా తీసుకున్న నిర్ణయాల్లో తప్పులు దొర్లినా సదుద్దేశంతో చేసిన పనిగా పరిగణించి ఎటువంటి చర్యలు తీసుకోరు. వీరిపై సామాన్య పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వీలులేదు. ఎక్కువలో ఎక్కువ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసులు మసకబారిపోతున్నాయి. ప్రజల్లో వీరిపై చులకన భావం పెరగకముందే ఈ అధికార గణం తమ పద్ధతులు మార్చుకోవాలి. సివిల్ సర్వీస్అధికారుల్లో నిజాయితీపరులైన అధికారులు ఉన్నా.. వారికి సరియైన గుర్తింపు లభించడం లేదు. కేవలం వారికి కావలసిన అధికారులను మాత్రమే రాజకీయ నాయకులు అక్కున చేర్చుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ అధికారులు ముఖ్యంగా యువ అధికారులు, నిబంధనల ప్రకారం నడుచుకుంటూ సుపరిపాలనకు సహకరించాలి. రాబోయే తరానికి స్ఫూర్తిమంతంగా నిలవాలి.
పాలకులతో మమేకం!
తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా పోలీసు వ్యవస్థ తమ విధేయతను మార్చుకుంటున్నది. అందుకే అక్కడ డీఎంకే పోలీసు, ఏఐఏడీఎంకే పోలీసు అని పిలుస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కొందరు పోలీసు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి తల ఒగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు అధికారులు అధికార పార్టీకి లబ్ధి చేకూరేలా సిగ్గుమాలిన పనిచేసిన సంఘటన తెలిసిందే. గత పది ఏండ్లలో తెలంగాణలో రాజకీయ వ్యవస్థ పోలీసు యంత్రాంగాన్ని తమ అధీనంలో తీసుకుంది. స్థానిక శాసనసభ్యుడి అనుమతి లేనిదే అక్కడ పోలీసు ఇన్స్పెక్టర్ను ట్రాన్స్‌ఫర్ చేయలేని పరిస్థితి నెలకొంది. పోలీసువారు అధికారపార్టీకి కొమ్ముకాస్తూ ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు కేసులు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.
- ఎం. పద్మనాభరెడ్డి, అధ్యక్షుడు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్-