రోజురోజుకు తగ్గుతున్న మిర్చి రేటు

రోజురోజుకు తగ్గుతున్న మిర్చి రేటు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మిర్చి రేటు రోజురోజుకూ మరింత తగ్గుతోంది. గురువారం ఖమ్మం మార్కెట్ కు 65 వేల బస్తాల మిర్చి రాగా, జెండా పాట రూ.13,900 పలికింది. వ్యాపారులు కనిష్ట ధర రూ.7 వేలకు కొనుగోలు చేశారు. కోల్డ్  స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నా.. ఆ తర్వాత రేటు పెరుగుతుందన్న నమ్మకం లేకపోవడంతో, రైతులు వచ్చిన రేటుకే పంటను అమ్ముకుంటున్నారు. 

మరోవైపు గురువారం ఖమ్మం మిర్చి యార్డును రీజనల్  జాయింట్  డైరెక్టర్  ఉప్పల శ్రీనివాస్ సందర్శించారు. మూడు రోజుల కింద ఈ సీజన్​లోనే అత్యధికంగా లక్ష బస్తాల మిర్చి మార్కెట్ కు రావడం, రేటు తగ్గుతుండడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మిర్చి కొనుగోళ్ల తీరును ఆయన పరిశీలించారు. మార్కెట్ కు వచ్చిన మిర్చిని అదే రోజు తరలించాలని సూచించారు.