- ఉమ్మడి జిల్లాలో గతేడాది 69.29శాతం.. ఈసారి 63.23శాతం
- హుస్నాబాద్ మినహా 12 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి
- గెలుపోటములపై ప్రధాన పార్టీల అభ్యర్థుల ఆరా
- రిలాక్స్ మోడ్‌లోకి మరికొందరు అభ్యర్థులు
- ఈవీఎంల్లో నేతల భవితవ్యం
కరీంనగర్/సిరిసిల్ల/పెద్దపల్లి : ఉమ్మడి జిల్లాలో 2018 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ పర్సంటేజీ తగ్గింది. పోలైన ఓట్ల సంఖ్య ఎక్కువగా కనిపించినా.. అది మొత్తం ఓట్లలో తక్కువగానే నమోదైంది. హుస్నాబాద్ నియోజకవర్గం మినహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. పోల్పర్సంటేజీని పెంచేందుకు అధికారులు, లీడర్లు ఎంతగా ప్రయత్నించినా మెజార్టీ నియోజకవర్గాల్లో 80 శాతం దాటడం లేదు.
ప్రతి వంద మందిలో 20 మందికిపైగా ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు. నెలంతా పగలు, రాత్రి తేడాలేకుండా తిరిగిన అభ్యర్థులు, ముఖ్య నాయకులు పోలింగ్ ముగియడంతో రిలాక్స్ మోడ్ లోకి వెళ్లారు. మరికొందరు తమకు పోలయ్యే ఓట్లపై లెక్కలేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లతోపాటు మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ పోటీపడిన కరీంనగర్ నియోజకవర్గం, బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈటల ఎమ్మెల్యేగా ఉన్న హుజూరాబాద్ స్థానాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
ఈసారి 6 శాతం తగ్గింది..
కరీంనగర్ నియోజకవర్గంలో 2018లో 69.29(1,98,926 ఓట్లు) పోలింగ్ నమోదు కాగా ఈసారి 63.23 శాతమే నమోదైంది. గతంతో పోలిస్తే 6 శాతానికి పోలింగ్ తగ్గింది. సుమారు 36 శాతం మంది ఓటర్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. చొప్పదండిలో 2018లో 79.73(1,69,332 ఓట్లు) పోలింగ్ నమోదు కాగా ఈ సారి 77.77 మాత్రమే నమోదైంది. చొప్పదండిలో గతంతో పోలిస్తే 2 శాతం ఓటింగ్ తగ్గింది. మానకొండూరులో 2018లో 85.36(1,72,907ఓట్లు) పోలింగ్ శాతం నమోదు కాగా ఈ సారి 83.21 శాతానికి తగ్గింది.
హుజూరాబాద్‌లో 2018లో 84.40(1,76,675 ఓట్లు) శాతం, 2021 బైఎలక్షన్లో 86.92(2,06,013 ఓట్లు) పోలింగ్ నమోదైతే ఈసారి 83.19శాతానికి తగ్గింది. సిరిసిల్లలో 2018లో 80.57 శాతం ఓట్లు పోలవ్వగా ఈసారి 77 శాతం ఓట్లు పోలయ్యాయి. వేములవాడలో 2018లో 80.41 శాతం పోలవ్వగా ఈ ఎన్నికల్లో 78.42శాతం నమోదైంది. రామగుండంలో 2018లో 71.94 పోలింగ్ జరిగితే ఈ సారి 68.71 శాతానికి తగ్గింది. పెద్దపల్లిలో గతంలో 84.08శాతం పోలింగ్ జరిగితే ఈ సారి 81.57 శాతానికి పడిపోయింది.
మంథనిలో కిందటిసారి 85.41 శాతం నమోదైతే ఈ సారి 82.74 దగ్గరే ఆగిపోయింది. కోరుట్లలో గతంలో75.84 శాతం ఓట్లు పోలైతే ఈ సారి 75.62 శాతం ఓట్లు పోలయ్యాయి. కోరుట్లలో స్వల్పంగా పోలింగ్ తగ్గింది. జగిత్యాలలో పోయినసారి 78.83శాతం ఓట్లు పోలైతే ఈ సారి 75.42 శాతం, ధర్మపురిలో 2018లో 80.19 శాతానికి, ఈసారి 79.54 శాతమే పోలింగ్ నమోదైంది.
ఆ మూడు స్థానాలపై ఆసక్తి..
ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, కరీంనగర్, హుజూరాబాద్ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఐదోసారి పోటీ చేయగా, స్టార్ క్యాంపెయినర్ గా ఆయన రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. దీంతో సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు. కేవలం రెండు, మూడు రోడ్ షోలకే పరిమితమయ్యారు. ఆయన తరఫున అనుచరులు, ముఖ్య నాయకులు మాత్రమే ప్రచారం చేశారు.
కేటీఆర్ నియోజకర్గ ప్రజలకు అందుబాటులో ఉండడన్న అభిప్రాయం ఉంది. దీంతో ఆయన ముఖ్యనాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఈసారి గెలిస్తే వారంలో రెండు రోజులు అందుబాటులో ఉంటానని సర్ది చెప్పాల్సి వచ్చింది. సిరిసిల్ల గెలుపుపై పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ఆయన చీల్చే ఓట్లపై కేటీఆర్, కేకే మహేందర్ రెడ్డి గెలుపు ఉండబోతుందన్న చర్చ జోరందుకుంది.
పట్టణానికి చెందిన పద్మశాలీ ఓట్లు భారీగా చీలితే కేటీఆర్‌కు నష్టం జరిగే అవకాశముంది. కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున బరిలో దిగిన మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా నడుస్తోంది. ఎవరు గెలిచినా మెజార్టీ 5 వేలలోపే ఉండొచ్చని విశ్లేషకుల అంచనా. బీజేపీ స్టేట్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు ఈసారి గజ్వేల్ లోనూ పోటీచేయడంతో హుజూరాబాద్‌పై పెద్దగా దృష్టి సారించలేదు.
ఆయన భార్య జమున, ఇతర నాయకులు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్.. కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండడం, ఆయనకున్న క్లీన్ ఇమేజ్, కాంగ్రెస్ వేవ్ కలిసొచ్చేలా ఉంది. మొత్తంగా ఈటల, ప్రణవ్ మధ్యే పోటీ ఉంటుందనే చర్చ జరుగుతోంది.
రిలాక్స్ మోడ్‌లోకి లీడర్లు..
ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచే బీఆర్ఎస్ అభ్యర్థులు వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రజల్లో తిరిగారు. షెడ్యూల్ వచ్చాక కొందరు, పార్టీ టికెట్ ఖరారయ్యాక మరికొందరు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. మొత్తంగా నెల రోజులుగా కంటి నిండా నిద్ర లేకుండా తిరిగారు. పోలింగ్ పూర్తి కావడంతో కాస్త రిలాక్స్ అయ్యారు. కొందరు నాయకులు తమ గెలుపు భారాన్ని భగవంతుడిపై వేసేందుకు ఆలయాలకు వెళ్తున్నారు. కొందరికి ఎన్నికల ఫలితాలపై టెన్షన్ ఉన్నప్పటికీ తమను కలిసేందుకు వస్తున్న నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. మరికొందరు ఫామ్ హౌస్‌లకు మకాం మార్చారు.