- త్వరలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ
- ధరలు మరింత తగ్గే చాన్స్
- బోనస్ ప్రకటనతో ఈసారి భారీగా పెరిగిన సన్నాల సాగు
మహబూబ్‌నగర్, వెలుగు : సన్న బియ్యం రేట్లు దిగొస్తున్నాయి. నిరుడు క్వింటాల్ రూ.5,800 నుంచి 6,500 వరకు పలికాయి. గత బీఆర్ఎస్ సర్కార్.. కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాలే తప్ప.. సన్న వడ్లు కొనలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సన్న రకం ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు వాటి సాగును ప్రోత్సహించింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించింది. దీంతో ఎన్నడూ లేనంతగా ఈ వానాకాలంలో రైతులు సుమారు 40 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు.
దీంతో అటు ప్రభుత్వం, ఇటు మిల్లర్లు పోటీపడి సన్న రకం వడ్లు కొనుగోలు చేశారు. సప్లై పెరగడంతో వ్యాపారులు సన్న బియ్యం ధరలు తగ్గించారు. ప్రస్తుతం క్వింటాల్ సన్న బియ్యం రూ.4 వేల నుంచి 5 వేల వరకు పలుకుతున్నాయి.
రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీకి సర్కార్ రెడీ అవుతున్నది. దీంతో రేట్లు మరింత తగ్గే అవకాశాలున్నాయి.
సన్నాల సాగు ఖర్చు ఎక్కువే..
దొడ్డు రకంతో పోలిస్తే.. సన్నాల సాగుకు ఎకరానికి కనీసం రూ.10వేలు ఎక్కువ ఖర్చు అవుతాయి. ఇదే విషయాన్ని అప్పటి బీఆర్ఎస్ సర్కార్‌కు వివరించి.. ధరలు పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో క్వింటాల్‌కు రూ.200 చొప్పున బోనస్ ఇస్తామని అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రకటించారు. అయినప్పటికీ అది అమలు కాలేదు. అలాగే, కొనుగోలు కేంద్రాల్లో కేవలం దొడ్డు వడ్లను మాత్రమే కొంటుండటంతో సన్న వడ్లను రైతులు మిల్లర్లకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇదే అదనుగా.. మిల్లర్లంతా ఏకమై రేట్లు తగ్గించి రైతులను మోసం చేశారు.
దీంతో సన్నాలు సాగు చేసిన రైతులంతా తీవ్రంగా నష్టపోయారు. ఆ తర్వాత సన్నాల సాగును తగ్గిస్తూ వచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సన్నాల సాగును ప్రోత్సహించింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించింది. దొడ్డు, సన్నాల కొనుగోళ్లకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వానా కాలం సీజన్లో 66.71 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అందులో 40లక్షల ఎకరాల్లో సన్నాలే పండించారు.
నిరుడు 20 లక్షల ఎకరాల్లోనే సాగు
2023–2024 వానాకాలం సీజన్లో కేవలం 20 లక్షల టన్నులు మాత్రమే సన్నాల దిగుబడి వచ్చింది. సప్లై తగ్గడంతో డిమాండ్ పెరుగుతుందని భావించిన మిల్లర్లు స్టాక్‌ను బ్లాక్ చేసి.. జనవరిలోనే ధరలు పెంచేశారు. క్వింటాల్ కొత్త బియ్యాన్ని రూ.5వేల నుంచి రూ.6 వేల దాకా అమ్మారు. బీపీటీ సోనా రూ.5 వేలు, ఆర్ఎన్ఆర్ రూ.5,500, హెచ్ఎంటీ రూ.5,700, జైశ్రీరాం రూ.6వేల దాకా విక్రయించారు. పాత బియ్యాన్ని రూ.5,800 నుంచి రూ.6,500 దాకా అమ్ముకున్నారు.
ఆ తర్వాత యాసంగిలో సాగు మరింత తగ్గడంతో పెరిగిన బియ్యం రేట్లు ఏ దశలోనూ అదుపులోకి రాలేదు. గత వానాకాలంతో పోలిస్తే ఈసారి సన్నాల దిగుబడులు రెట్టింపు కావడం విశేషం. సప్లై పెరగడంతో డిమాండ్ తగ్గుతుందనే భయంతో వ్యాపారులు రేట్లు తగ్గిస్తున్నారు. నిరుడు జనవరితో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో కొత్త బియ్యం..
రకాన్ని బట్టి రూ.4,300 నుంచి రూ.5వేల దాకా విక్రయిస్తున్నాయి. అలాగే, ఫిబ్రవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్తున్నది. ఈ మేరకు 20లక్షల టన్నులకు పైగా సన్నవడ్లను సేకరించింది. దీంతో సన్నబియ్యం రేట్లు మరింత తగ్గే అవకాశం కనిపిస్తున్నది.