భారత్​లో ..తగ్గుతున్న ​పేదరికం

భారత్​లో ..తగ్గుతున్న ​పేదరికం

అన్ని సమస్యల్లోకెల్లా పేదరికం ఒక తీవ్రమైన సమస్య.  కాబట్టి ప్రతి కాలంలోనూ వ్యవస్థలోనూ పేదరికం లేని సమాజాన్ని నిర్మించటమే అంతిమ లక్ష్యంగా ఉంటుంది. దశాబ్దాలుగా ప్రపంచంలోని అనేక దేశాలతో పాటు భారతదేశం కూడా పేదరికం చేత పీడించబడుతోందనేది వాస్తవం. అయితే గత కొంతకాలంగా భారత దేశంలో పేదరికం తగ్గుముఖం పడుతోందని ముఖ్యంగా దేశంలో మల్టీ డైమెన్షనల్  పేదరికం తగ్గుతుందని నీతి ఆయోగ్ తన నివేదికలో స్పష్టం చేస్తుంది. 

నీతి ఆయోగ్ సభ్యుడైన రమేష్ చాంద్ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం గడచిన తొమ్మిది సంవత్సరాల్లో భారతదేశంలో  బహుముఖి పేదరిక సూచి  ఆధారంగా పేదరికం 29.17 శాతం నుంచి 11.28 శాతానికి తగ్గింది. అంటే ఈ తొమ్మిది సంవత్సరాల్లో  పేదరికం 17.89 శాతం తగ్గటం వలన భారతదేశంలో 24.82 కోట్ల మంది  పేదరికం నుంచి బయటపడినారని రమేష్ చాంద్ రిపోర్టు వెల్లడి చేస్తోంది. 

రిపోర్ట్ ప్రకారం పేదరికంలో ఉన్న పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్​లో 5.94, బిహార్​లో 3.77, మధ్యప్రదేశ్​లో 2.30, రాజస్థాన్​లో 1.87 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినారు. ఈ ఐదు రాష్ట్రాల్లో దాదాపు 14 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటం శుభపరిణామమే. 2023 నీతి ఆయోగ్ రిపోర్టు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ పేదరికం గణనీయంగా తగ్గిందని చెప్పింది.


ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనూ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్​లోని ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణంలాంటి మూడు ముఖ్య అంశాలకు సంబంధించి 12 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఆధారంగా పేదరికాన్ని అంచనా వేస్తున్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన పౌష్టికాహారం, శిశు మరణాలు, బాలింతల ఆరోగ్యం, పాఠశాలలో హాజరు శాతం, వంట చెరకు, పరిశుభ్రత, సురక్షిత త్రాగునీరు, విద్యుత్ శక్తి వినియోగం, గృహ సౌకర్యం, బ్యాంకు ఖాతాలు లాంటి అంశాలను ఆధారంగా చేసుకుని పేదరికాన్ని లెక్కిస్తున్నారు. అయితే ఈ 12 అంశాలకు సంబంధించి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టడం వలన దేశంలో పేదరికం నుంచి బయటపడే వారి శాతం గణనీయంగా పెరుగుతుందనే భావన ఉంది.

సత్ఫలితాలిస్తున్న సంక్షేమం

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత బియ్యం పంపిణీ, ఉజ్వల యోజన,  స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, సౌభాగ్య ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి జన ఆయుష్మాన్ యోజన, జాతి ఆరోగ్య మిషన్, జననీ సురక్ష  యోజన, సర్వ శిక్ష అభియాన్, జల శక్తి అభియాన్, నేషనల్ వాటర్ మిషన్,  ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర స్వస్తి భారత్ యోజన, ప్రధానమంత్రి మాతృవందనం యోజన, మధ్యాహ్న భోజన పథకాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వటం వలన దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందనే చెప్పాలి.   1990 తర్వాత సరళీకరణ అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్విముఖ వ్యూహంతో  పేదరికం నిర్మూలించవచ్చనే ప్రభుత్వాల వ్యూహాలు సత్ఫలితాలు ఇస్తున్నట్లుగానే కనపడుతోంది.
 

ప్రపంచంలోనే భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించబోతున్న తరుణంలో పేదరికం తగ్గటం సంతోషించాల్సిన విషయమే. కానీ, నిరుద్యోగం, ధరల పెరుగుదల ఆందోళనకరస్థాయిలో ఉండటం. రూపాయి విలువ పతనంకావడం, అసమానతలు ముఖ్యంగా ఆదాయ అసమానతలు పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయాలే. దేశంలో ఆదాయ అసమానతలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయని ఆక్స్ ఫామ్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసిందనే విషయాన్ని గమనించాలి. దేశంలో పెరుగుతున్న సంపద అభివృద్ధి సంక్షేమ ఫలాలు కింది వర్గాలకు చేరువ కావడమే నిజమైన అభివృద్ధి, అప్పుడే భారత దేశం విశ్వ గురువుగా, వికసిత్ భారత్ గా ఎదుగుతుంది. 

-  డాక్టర్  తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్,
కాకతీయ యూనివర్సిటీ