జిల్లాల్లో బీసీ డెడికేటెడ్ కమిషన్ పబ్లిక్ హియరింగ్

జిల్లాల్లో బీసీ డెడికేటెడ్ కమిషన్ పబ్లిక్ హియరింగ్
  • బీసీ కమిషన్ వెళ్లని జిల్లాలకు వెళ్లే చాన్స్
  • ఈ నెల 30 కల్లా రిపోర్ట్ ఇస్తామన్న చైర్మన్ బూసాని

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్​కమిషన్ కసరత్తు షురూ చేసింది. కమిషన్​కు ప్రభుత్వం ఈ నెల 30 వరకు డెడ్​లైన్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు, మెంబర్ సైదులు గురువారం ఖైరతాబాద్​లోని బీసీ కమిషన్ ఆఫీసులో కలిసి, వివిధ అంశాలపై చర్చించారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు ముందు బీసీ కమిషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 28 నుంచి ఈ నెల 2 వరకు ఆదిలాబాద్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, సంగారెడ్డి, కరీంనగర్‌‌‌‌, వరంగల్ జిల్లాల్లో పర్యటించింది.

 ఆ విషయాలను బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు డెడికేటెడ్​కమిషన్ చైర్మన్, సభ్యులకు వివరించారు. ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాలు, మేధావుల నుంచి స్వీకరించిన సలహాలు, సూచనలు, వినతిపత్రాలను కలెక్టర్లు ఈ డెడికేటెడ్ కమిషన్ కే పంపనున్నట్లు తెలిసింది. ఇప్పటికే బీసీ కమిషన్ పర్యటించిన ఐదు ఉమ్మడి జిల్లాల్లో కాకుండా నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌ జిల్లాల్లో 11వ తేదీ నుంచి పర్యటించనుంది. నేడో, రేపో షెడ్యూల్​వెలువడనుంది. ఈ నెల 25న కులగణన సర్వే పూర్తయ్యాక ఆ వివరాలను కూడా తమకు అందజేయాలని సీఎస్ ను కమిషన్ చైర్మన్ కోరనున్నట్టు సమచారం.

గడువులోగా రిపోర్ట్ ఇస్తాం..

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కు అనుగుణంగా ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేసింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై సిఫార్సులు చేయాలని ప్రభుత్వం ఈ నెల 30 వరకు గడువు ఇచ్చింది. జిల్లాల్లో పర్యటించి, బీసీ సంఘాలు, మేధావుల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని ప్రభుత్వ శాఖలు, బీసీ కమిషన్ తో చర్చించి గడువులోగా ప్రభుత్వానికి రిపోర్టు అందజేస్తం. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే డేటా మా రిపోర్ట్ కు కీలకం కానుంది. ముందుగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రిపోర్ట్ ఇవ్వనున్నాం. తర్వాత ప్రభుత్వం కోరితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీల్లో బీసీ రిజర్వేషన్లపై స్టడీ చేస్తం.- బూసాని వెంకటేశ్వరరావు,డెడికేటెడ్ కమిషన్ చైర్మన్