- దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టు చైర్మన్ వేదకుమార్
హైదరాబాద్, వెలుగు: చెక్కతీగల తోలుబొమ్మలాట కళాకారుడు మోతె జగన్నాథం మృతిపై దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టు చైర్మన్ మణికొండ వేదకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగన్నాథం మృతి కళా రంగానికి తీరని లోటని అన్నారు. ఆయనకు పద్మశ్రీ దక్కే ప్రయత్నం చేస్తున్న సమయంలో జగన్నాథం చనిపోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు.
అంతరించిపోతున్న కళారూపానికి తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. జనగామ జిల్లా అమ్మాపురానికి చెందిన మోతె జగన్నాథం.. శతాబ్దాల కథా సంప్రదాయాన్ని పరిరక్షించడానికి కృషి చేశారని కొనియాడారు. ‘బొమ్మలోళ్లు’ అని పిలుచుకునే ప్రదర్శనలతో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలకు, ప్రహ్లాద, భక్త రామదాసు కథలకు ప్రాణం పోశాయని తెలిపారు. ఇలాంటి కళా నైపుణ్యం తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఈ కళ అంతరించిపోయే దశలో ఉందని, ప్రస్తుతం రెండు బృందాలు మాత్రమే మిగిలాయని తెలిపారు.