తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గతంలో బీజేపీ నాయకులు ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణలపై ఇటీవల పరువు నష్టం కేసు వేశారు దీపాదాస్ మున్షీ. ఈ క్రమంలో దీపాదాస్ మున్షీ కోర్టుకు హాజరయ్యారు. ఆమెతో పాటు ప్రభాకర్ కూడా కోర్టుకు హాజరయ్యారు.
కాంగ్రెస్ నేతలకు పదవులు, ఎన్నికల్లో టికెట్లు ఇప్పించేందుకు దీపాదాస్ మున్షీ బెంజి కారు, ముడుపులు తీసుకున్నారని ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ 2024 ఫిబ్రవరిలో ఆరోపణలు చేశారు. దీంతో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ 2024 జూన్ 7న దీపాదాస్ మున్షీ పరువునష్టం దావా వేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు రూ.10 కోట్లు నష్ట పరిహారం ఇప్పించాలని నాంపల్లి కోర్టును కోరారు.
అయితే అక్టోబర్ 25న విచారణకు హాజరుకాకపోవడంతో ప్రభాకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది నాంపల్లి కోర్టు. తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశిస్తూ నవంబర్ 5కు కేసును వాయిదా వేసింది. ఈ క్రమంలో దీపాదాస్ మున్షీ, ప్రభాకర్ కోర్టుకు హాజరయ్యారు.