IPL 2025 Mega Auction: వేలంలో చెన్నై నన్ను తీసుకుంటుంది.. లేకపోతే ఆ జట్టుకు ఆడతా: భారత ఫాస్ట్ బౌలర్

IPL 2025 Mega Auction: వేలంలో చెన్నై నన్ను తీసుకుంటుంది.. లేకపోతే ఆ జట్టుకు ఆడతా: భారత ఫాస్ట్ బౌలర్

ఐపీఎల్ రిటెన్షన్ లిస్టుపై ఉత్కంఠ వీడిన విషయం విదితమే. ఫ్రాంఛైజీలు కోట్లు కురిపించి కొందరిని రిటైన్ చేసుకోగా.. మరికొందరిని వేలంలోకి వదిలేశాయి. 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. వేలంలో మొత్తం 1574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 1,165 మంది భారత ఆటగాళ్లు కాగా.. మిగిలిన 409 మంది ఓవర్సీస్(విదేశీ) ప్లేయర్లు. వీరిలో ఫ్రాంచైజీలు భారత స్టార్ ప్లేయర్లను టార్గెట్ చేయడం ఖాయం. వారిలో పంత్, రాహుల్, శ్రేయాస్ అయ్యర్ తో పాటు టీమిండియా ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కూడా ఉన్నాడు.
 
 చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాళ్లలో దీపక్ చాహర్ ఒకరు. స్వింగ్ బౌలింగ్ తో చెన్నై విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. 2022 లో ఈ ఫాస్ట్ బౌలర్ ను రూ. 14 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. అయితే ఆతర్వాత గాయాల కారణంగా చాలా మ్యాచ్ లకు దూరమయ్యాడు. అదే సమయంలో పేలవ ఫామ్ తో జట్టుకు భారంగా మారాడు. దీంతో అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ 2025 ఐపీఎల్ లో కొనసాగించేందుకు ఆసక్తి చూపించలేదు. అతన్ని రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసింది. అయితే తాను మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. 

ALSO READ | ICC Award: ఆ ఇద్దరికీ నిరాశే.. పాకిస్థాన్ ప్లేయర్‌ను వరించిన ఐసీసీ అవార్డు

"వేలంలో చెన్నై నన్ను తీసుకుంటుందని భావిస్తున్నాను. నాకు ఆ నమ్మకం ఉంది. చివరిసారిగా జరిగిన మెగా ఆక్షన్ కు ముందు చెన్నై నన్ను రిటైన్ చేసుకోలేదు. కానీ  మెగా ఆక్షన్ లో భారీ ధరకు నన్ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ నా ప్రతిభ మీద నాకు నమ్మకం ఉంది. ఒకవేళ చెన్నై జట్టు తీసుకోకపోతే రాజస్థాన్ రాయల్స్ నా కోసం వేలం వేయాలని నేను కోరుకుంటున్నాను" అని చాహర్ చెప్పాడు.

ఐపీఎల్ 2025 కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ ఆటగాళ్ల విషయానికి వస్తే.. ఐదుగురిని రిటైన్ చేసుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు జడేజాకు రూ. 18 కోట్ల రూపాయలు ఇచ్చారు. లంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరానాకు రూ. 13 కోట్లు.. ఆల్ రౌండర్ శివమ్ దూబే రూ.12 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ. 4 కోట్ల రూపాయలతో అన్ క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నాడు.