భారత ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ తండ్రి లోకేంద్ర సింగ్ చాహర్ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయనను అలీగఢ్‌లోని మిత్రరాజ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మెరుగైన చికిత్స కోసం ఆయనను ఢిల్లీ లేదా ఆగ్రాకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన డయాబెటిక్, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆయన వైద్యానికి సహకరించట్లేదని నివేదికలు వస్తున్నాయి.
ఆదివారం(డిసెంబర్ 03) బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20లో దీపక్ చాహర్ ఆడలేదు. తన తండ్రికి బాగోకపోవడంతో అత్యవసర పరిస్థుతులలో అతను ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
బ్రెయిన్ స్ట్రోక్
రక్తప్రసరణకు అవరోధం కలగడం లేదా నరాలు చిట్లడము వల్ల సంభవించే వైద్య అత్యవసర పరిస్థితిని స్ట్రోక్ అంటారు. అదే బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడుకు ఆక్సిజన్ మరియు పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాలు చిట్లి పోవడం, ఫలితంగా రక్త సరఫరాకు అంతరాయం కలగడం. దీని పలితంగా మెదడులోని ఒక భాగానికి ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి ఆ భాగం యొక్క కణ మరణానికి దారితీస్తుంది. దీన్నే పక్షవాతం అని పిలుస్తుంటారు. దీని బారిన పడితే కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం, మాట పడిపోవడం వంటివి జరుగుతుంటాయి.
బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన వ్యక్తికి మొదటి నాలుగైదు గంటల్లో ఆస్పత్రికి తీసుకెళ్లగలిగితే మెదడులోని కణాలు దెబ్బతినకుండా చికిత్స అందించగలరు. ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టం జరుగుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ వల్ల నిమిషంలో మిలియన్ల మెదడు కణాలు విరిగిపోతాయి. అందుకే ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్ళాలి.