- పోలీస్ ప్రత్యేక పరిశీలకులు దీపక్ మిశ్రా
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్,ఎస్పీ, ఎన్నికల అధికారులతో సమావేశం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు చేపట్టాలని పోలీస్ ప్రత్యేక పరిశీలకులు దీపక్ మిశ్రా అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ప్రియాంక అల, ఎస్పీ వినీత్, ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. గుర్తింపు కార్డు కలిగిన వాళ్లు మాత్రమే ఉండనివ్వాలని చెప్పారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పటిష్ట బందోబస్తు మధ్య తరలించాలని సూచించారు. హోం ఓటింగ్ ప్రక్రియ నిర్వహణపై నియోజకవర్గాల వారీగా షెడ్యూల్ రూపొందించి పోటీ చేసే అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఏజెంట్ల సమక్షంలో హోం ఓటింగ్ జరిగేలా చూడాలని చెప్పారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌తో పాటు పోలింగ్ కేంద్రాల బయట శాంతి భద్రతల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
పోలింగ్ నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. ఎస్పీ వినీత్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో సాధారణ పరిశీలకులు కమల్ కిషోర్, హరికిషోర్, గణేశ్, స్వపన్ సర్కార్, జయంత్సింగ్, రిటర్నింగ్అధికారులు ప్రతీక్‌జైన్, రాంబాబు, శిరీష, మంగీలాల్, కార్తీక్ పాల్గొన్నారు.
రెండు రోజుల్లో పూర్తిచేయాలి
ఖమ్మం టౌన్, వెలుగు : పోలింగ్ కేంద్రాల్లో వసతులు, పెయింటింగ్ పనులు రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. గురువారం నూతన కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఇంజినీరింగ్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలింగ్ కేంద్రాల పనులపై ఆయన సమీక్షించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
మూతపడ్డ పాఠశాలలు ఉండి, పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటుచేసిన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. వసతులతో పాటు పారిశుద్ధ్యం ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో పార్టీల స్లోగన్స్ లేకుండా చూడాలన్నారు. కాంపౌండ్ గోడలపై స్వీప్ స్లోగన్స్ వేయించాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జడ్పీ సీఈవో అప్పారావు, డీఈవో సోమశేఖరశర్మ, డీపీవో హరికిషన్, విద్యాశాఖ ఈఈ నాగశేషు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : 2.81 కోట్ల ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి : సీఈఓ వికాస్ రాజ్