దీపావళి పండుగ రోజున ఆత్మీయులందరికీ స్వీట్లు పంచి, పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు.అంతేకాదు, ఇంటికొచ్చిన అతిథులకు స్వీట్లు పంచి, శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అలాంటి ఈ పండుగను మీరు ఈ స్వీట్స్ తో చేసుకోండి.
పనస తొనలు తయారీకి కావలసిన పదార్థాలు
- మైదా పిండి-ఒక కప్పు...
- బేకింగ్ పౌడర్ - ఒక టీ స్పూన్
- నెయ్యి - ఒక టీస్పూన్
- నూనె- 2 కప్పులు
- చక్కెర - ఒక కప్పు
- నీళ్లు - అరకప్పు
తయారీ విధానం: ఒక గిన్నెలో మైదాపిండి, బేకింగ్ పౌడర్,నెయ్యి, సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని ఉండలు చేయాలి. వాటితో చిన్న సైజు పూరీలు చేయాలి. తర్వాత చాక్ లేదా బ్లేడ్ తీసుకుని. పూరీ చివర్లు వదిలేసి గాట్లు పెట్టాలి. వాటిని పనన తగిన ఆకారంలోకి మడిచి చివర్లు వత్తాలి. అలా పిండి అంతా చేసుకున్నాక నూనెలో వేగించాలి. తర్వాత అర కప్పు నీళ్లలో చక్కెర వేసి తీగ పాకం పట్టాలి. వేగించిన తొనలను చక్కెరపాకంలో కొద్దిసేపు ఉంచి తీసేయాలి. చాలా ప్రాంతాల్లో వీటిని ప్రత్యేకంగా దీపావళి పండుగ నాడు చేసుకుంటారు.
కోవా గరిజెలు తయారీకి కావాల్సినవి
- నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
- నీళ్లు ఒక కప్పు
- ఉప్పు - చిటికెడు
- గోధుమ పిండి- అర కిలో
- కోవా - ఒక కప్పు
- చిక్కటి పాలు- పావు కప్పు
- చక్కెర - రెండు కప్పులు
- పిస్తా పప్పు - ఒక టేబుల్ స్పూన్
- కొబ్బరి తురుము
- నూనె - సరిపడా
తయారీ విధానం : ఒక వెడల్పాటి గిన్నెలో పిండి, కొన్ని నీళ్లు కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్ని చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి. ఒక కప్పు చక్కెరలో అరకప్పు నీళ్లు పోసి పాకం పట్టాలి. మరోగిన్నెలో కోవా, చిక్కటి పాలు ఒక కప్పు చక్కెర, పిస్తా పప్పు, కొబ్బరి తురుము వేసి మిశ్రమాన్ని కలపాలి. తర్వాత పిండి ఉండలను చిన్నసైజు పూరీల్లా చేసి, మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి, మిశ్రమం బయటకు రాకుండా చివర్లను వత్తాలి. ఇలా చేసుకున్న గరిజెలను నూనెలో డీప్ ఫ్రై చేయాలి. తర్వాత వీటిని చక్కెర పాకంలో పావుగంట నానబెట్టి తీయాలి. పాకంలో వేయకుండా కూడా వీటిని తినొచ్చు.
డేట్ రోల్స్ తయారీకి కావలసినవి
- ఖర్జూరాలు – పన్నెండు
- బ్రెడ్ ముక్కలు - పన్నెండు.
- చక్కెర పాకం-ఒక కప్పు
- పాలు -రెండు టేబుల్ స్పూన్లు
- ఇలాచీ పొడి - పావు టీ స్పూన్
- బాదంపప్పు తరుగు - ఒక టేబుల్
తయారీ విధానం : ఖర్జూర పండ్లలో గింజలు తీసేసి బాదం పప్పులతో కలిపి పేస్ట్ వేయాలి. తర్వాత బ్రెడ్ ముక్కలు అంచులు కట్ చేసి, వాటిని పాలలో ముంచాలి. ఒక్కో బ్రెడ్ ముక్క మధ్యలో ఖర్జూర మిశ్రమం పెట్టి రోటీ చేయాలి. మరోగిన్నెలో చక్కెర పాకం, ఇలాచీ పొడి వేసి కలపాలి. తర్వాత బ్రెడ్ రోల్స్ ను పాకంలో ముంచి తీయాలి వీటిని పెద్దవాళ్ళతోపాటు పిల్లలూ ఇష్టంగా తింటారు.
పాల కోవా తయారీకి కావలసినవి
- మీగడ తీయని పాలు - ఒకటిన్నర లీటరు
- నెయ్యి - రెండు టేబుల్ స్పూను
- కుంకుమ పువ్వు - కొద్దిగా
- ఇలాచీ పొడి - చిటికెడు
- చక్కెర నాలుగు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం: ఒక పాన్ లో పాలు పోసి చిన్నమంటపై మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు కుంకుమ పువ్వు వేసి కలపాలి. పాలు మరిగి చిక్కబడ్డ తర్వాత ఇలాచీ పొడి, చక్కెర, నెయ్యి వేసి కలపాలి. చక్కెర వేశాక మిశ్రమం పల్చగా అవుతుంది. అప్పుడు. మరికొంత సేపు చిన్నమంటపై ఉంచితే మిశ్రమం చిక్కగా అవుతుంది. స్టవ్ ఆపేసి మరో గిన్నెలోకి మార్చుకుని, డ్రై ఫ్రూట్ తో గార్నిష్ చేసి తినేయడమే...
–వెలుగు, లైఫ్–