
పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా ఆర్చర్లు పతకం లేకుండానే వెనుదిరిగారు. విమెన్స్ ఇండివిడ్యువల్‌లో వెటరన్ ఆర్చర్ దీపిక కుమారి క్వార్టర్‌ఫైనల్‌ను దాటలేకపోయింది. శనివారం జరిగిన పోరులో దీపిక 4–6తో సుయోన్ నామ్ (కొరియా) చేతిలో ఓడింది. తొలి మూడు సెట్లలో రెండు గెలిచి ఆధిక్యంలో నిలిచిన దీపికకు ఆ తర్వాత గురి కుదరలేదు. 4–2తో నాలుగో సెట్ మొదలుపెట్టిన దీపిక తొలి బాణానికి 10 పాయింట్లు సాధించింది.
కానీ రెండో బాణానికి ఏడు పాయింట్లు రావడంతో అవకాశం చేజారింది. కానీ కొరియన్ ఆర్చర్ 10, 9 పాయింట్లతో స్కోరును 4–4తో సమం చేసింది. కీలకమైన ఐదో సెట్‌లో సుయోన్ 10, 9, 10 పాయింట్లు సాధించగా, దీపిక 9, 9, 9తోనే సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో దీపిక 6–4తో మిచెల్ కోర్పెన్ (జర్మనీ)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. మరో మ్యాచ్‌లో భజన్ కౌర్ 5–6తో దయానంద చోయిరునిసా (ఇండోనేసియా) చేతిలో ఓడింది.