ట్లాక్స్‌కాల (మెక్సికో): ఇండియా స్టార్ ఆర్చర్, మాజీ వరల్డ్ నంబర్ వన్ దీపిక కుమారి ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ టోర్నమెంట్‌లో మరోసారి తన మార్కు చూపెట్టింది. మెగా టోర్నీలో ఐదోసారి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన విమెన్స్ రికర్వ్ ఫైనల్లో దీపిక 0–6తో చైనా ఆర్చర్ లి జైమన్ చేతిలో ఓడిపోయింది. దాంతో ఈ టోర్నీలో బంగారు పతకం నెగ్గాలన్న తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
మ్మిదోసారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన దీపికకు మొత్తంగా ఇది ఆరో పతకం. ఇది వరకు ఓ కాంస్యం కూడా గెలిచింది. పెండ్లి చేసుకొని బిడ్డకు జన్మనివ్వడంతో మూడేండ్ల విరామం తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన దీపిక ఎనిమిది మంది ఆర్చర్లలో మూడో సీడ్‌గా పోటీ పడింది. సెమీఫైనల్ వరకూ ఆమె పోరాటం సాఫీగానే సాగింది. తొలుత 6–0 (27-–23, 29–-22, 29–-27)తో చైనాకు చెందిన యాంగ్ జియలెయిపై ఘన విజయం సాధించి టోర్నీని ఆరంభించింది. సెమీఫైనల్లో 6–4 (29–-28, 26-26, 26–-29, 28-–28, 28–-27)తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అలెజాండ్ర వాలెన్సియాను ఓడించింది.
అయితే, సెమీస్ జోరును ఫైనల్లో కొనసాగించడంలో దీపిక విఫలమైంది. ఒక్క పాయింట్ తేడాతో తొలి సెట్ (26-–27)ను కోల్పోయింది. రెండో సెట్‌లో మెరుగై 28 పాయింట్లు స్కోరు చేసినా..జైమన్ ఓ పర్ఫెక్ట్ టెన్ సహా 30 పాయింట్లతో ఈ సెట్ కూడా నెగ్గింది. కీలకమైన మూడో సెట్‌లో ఇండియా ఆర్చర్ తడబడింది. ఏడు పాయింట్ల షాట్ సహా 25 పాయింట్లే నెగ్గగా జైమన్ మూడుసార్లు 9 పాయింట్లు సాధించింది. వరుసగా మూడు సెట్లు నెగ్గి తన తొలి వరల్డ్ కప్ ఫైనల్లోనే గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది.
ధీరజ్‌కు నిరాశ
మరోవైపు మెన్స్ రికర్వ్‌లో ఇండియా నుంచి క్వాలిఫై అయిన ఏకైక ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఆరంభ మ్యాచ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టాడు. మూడో సీడ్ ధీరజ్ 4–6 తేడాతో సౌత్ కొరియాకు చెందిన రెండో సీడ్ ఆర్చర్ లీ వూ సెయెక్ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి సెట్ టై అయిన తర్వాత రెండో సెట్ నెగ్గిన ధీరజ్ మూడో సెట్‌లో మ్యాచ్ నెగ్గే చాన్స్ కోల్పోయాడు. ఈ సెట్ కూడా 28–28తో టై అవగా.. చివరి రెండు సెట్లలో నిరాశపరిచాడు. ఈ టోర్నీలో ఇండియా నుంచి ఐదుగురు ఆర్చర్లు పోటీ పడగా దీపిక మాత్రమే పతకంతో తిరిగొచ్చింది.