
- ఏఐజీగా మారుతుందన్న గూగుల్ డీప్‌మైండ్ రీసెర్చ్
న్యూఢిల్లీ: మానవ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌గా పిలిచే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) 2030 నాటికి అందుబాటులోకి వస్తుందని గూగుల్ డీప్‌మైండ్ తమ ఎక్స్‌పెరిమెంట్‌తో అంచనా వేసింది. ఏజీఐ వస్తే.. మానవాళి అస్తిత్వానికి ముప్పు ఏర్పడుతుందని తెలిపింది. ఏజీఐ వల్ల ప్రమాదం ఉందని తాము అంచనా వేస్తున్నట్లు రీసెర్చర్లు చెప్పారు. ఏజీఐ వల్ల కలిగే ప్రమాదాలను నాలుగు కేటగిరీలుగా విభజించినట్లు గూగుల్ డీప్‌మైండ్ తెలిపింది. డేటా దుర్వినియోగం, తప్పులు, తప్పుగా పొందుపరచడం, స్ట్రక్చరల్ రిస్క్స్‌లాంటి ముప్పులు పొంచి ఉన్నట్లు పేర్కొన్నది. మానవాళిని ఏజీఐ ఎలా నాశనం చేస్తుందనే దాని గురించి మాత్రం డీప్ మైండ్ కో ఫౌండర్ షేన్‌లెగ్ స్పష్టంగా చెప్పలేదు. ఏజీఐ వల్ల కలిగే ముప్పును తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపైనే తమ దృష్టి సారించామని తెలిపారు. గూగుల్, ఏఐ కంపెనీలకు వివరించారు. ఇతరులపై ప్రతీకారం తీర్చుకునేందుకు కొందరు ఏఐని ఉపయోగించే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
పలు రంగాల్లో కీలక మార్పులు!
కంప్యూటింగ్ శక్తి పెరుగుదల, అల్గారిథమ్‌లలో పురోగతి, డేటా లభ్యత వంటి లక్ష్యాలు ఏజీఐతో సాధ్యం అవుతాయని రీసెర్చర్లు భావిస్తున్నారు. ఏజీఐ ట్రీట్మెంట్, ఎడ్యుకేషన్, పర్యావరణ సమస్యల పరిష్కారం వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉన్నది. క్లిష్టమైన రోగాల నిర్ధారణ, వాతావరణ మార్పులపై కచ్చితమైన సమాచారం ఏజీఐ సాయంతో తెలుసుకోవచ్చు. ఏజీఐని బాధ్యతాయుతంగా డెవలప్ చేసేందుకు డీప్‌మైండ్ ‘సేఫ్టీ ఫస్ట్’ విధానాన్ని సూచించింది. మానవుల కంటే తెలివైన ఏజీఐ రాబోతున్నదని ఫిబ్రవరిలోనే డీప్‌మైండ్ సీఈవో డెమిస్ హస్సాబిస్ ప్రకటించారు. రాబోయే ఐదు లేదా పదేండ్లలో ఇది తయారవుతుందని వివరించారు. కాగా, ఏఐకి మరో ముందడుగే ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అని నిపుణులు చెప్తున్నారు. ఏఐ అనేది టాస్క్ స్పెసిఫిక్‌గా ఉంటే.. ఏజీఐ అనేది మానవుల మేధస్సుతో విస్తృత పనులు చేయగలుగుతుందని అంటున్నారు. ఏజీఐ అనేది మనుషుల్లాగే విభిన్నమైన డొమైన్‌లో జ్ఞానాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుందని చెప్తున్నారు.