మెరిసేనా..మన దీప్తి.. పారాలింపిక్స్ బరిలో తెలంగాణ బిడ్డ

  • పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌ బరిలో తెలంగాణ బిడ్డ
  • రేపటి నుంచే పారిస్ పారా గేమ్స్‌‌‌‌‌‌‌‌
  • పారాలింపిక్స్​లో మన దీప్తి 

హైదరాబాద్, వెలుగు:  భారీ అంచనాలతో..  వంద పైచిలుకు క్రీడాకారులతో  పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో పోటీ పడ్డ ఇండియా ఆరు పతకాలతో సరిపెట్టి నిరాశపరిచింది.  ఇప్పుడు అదే పారిస్‌‌‌‌‌‌‌‌లో పతకాల మోత మోగించేందుకు మన పారా అథ్లెట్లు సిద్ధమయ్యారు.  బుధవారం మొదలయ్యే పారిస్ పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో  84 మందితో కూడిన  జంబో జట్టుతో బరిలోకి దిగనుంది. టోక్యోలో 54 మందితో  పోటీపడి ఐదు స్వర్ణాలు సహా 19  మెడల్స్ గెలిచిన ఇండియా ఈసారి పాతిక పతకాలు తేవాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది.

మూడేండ్ల కిందట 14 మంది మహిళా క్రీడాకారులే పోటీ పడగా.. ఈసారి 32 మంది అమ్మాయిలు పతక వేటలో ఉన్నారు. ఇందులో  తెలంగాణ నుంచి ఏకైక అథ్లెట్‌‌‌‌‌‌‌‌గా ఓరుగల్లు బిడ్డ జీవాంజి దీప్తి బరిలో నిలిచింది. పారిస్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో తను టి20  కేటగిరీ విమెన్స్‌‌‌‌‌‌‌‌ 400 మీటర్ల ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మేలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌లో ఇదే ఈవెంట్‌‌లో దీప్తి 55.07 సెకన్లతో వరల్డ్ రికార్డు సృష్టిస్తూ  గోల్డ్ మెడల్‌‌‌‌‌‌‌‌ గెలిచింది. దాంతో  తొలిసారి ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు ఎంపికైంది.కొన్నేళ్లుగా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్ చేయడం.. ఫామ్ దృష్ట్యా దీప్తికి మొదటి ప్రయత్నంలోనే ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ గోల్డ్ మెడలిస్ట్ అయ్యే సత్తా ఉంది.

తెలిసింది పరుగే

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి  నిరుపేద రైతు కూలీ కుటుంబంలో  మేధోపరమైన బలహీనతతో జన్మించింది.  ఈ కారణంగా తను ఎదుటివాళ్లు చెప్పేది త్వరగా అర్థం చేసుకోలేదు.  సరిగ్గా మాట్లాడలేదు. తనకు తెలిసింది పరుగెత్తడం ఒక్కటే! తన వైకల్యం కారణంగా దీప్తితో చిన్నప్పుడు తోటి వాళ్లు  ఆడుకునేవాళ్లు కాదు. దాంతో తల్లిదండ్రులతో కలిసి పొలం గట్లపై పరుగులు తీసిన ఆమె.. స్కూల్లోనూ పరుగు పందెంలో  రాణించింది. స్కూల్ పీఈటీ  ఆమెను  ప్రోత్సహించగా.. ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్‌‌‌‌‌‌‌‌ కంట్లో పడటం తన  జీవితాన్ని మార్చింది. దీప్తి పరుగులో వేగాన్ని గుర్తించిన రమేశ్‌‌‌‌‌‌‌‌ తన సొంత ఖర్ఛులతో ఆమెను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చి గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌‌‌‌‌‌‌‌) సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్పించాడు.

ప్రత్యేక శద్ధ తీసుకొని కోచింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి ఆమెను తీర్చిదిద్దాడు.  రమేశ్ శిక్షణలో రాటుదేలిన దీప్తి  మొదట్లో సాధారణ అథ్లెట్లతో కలిసి పోటీపడుతూ సత్తా చాటింది.  కానీ, దేశ, విదేశాల్లో  పోటీల్లో పాల్గొనేందుకు ప్రయాణ, ఇతర ఖర్చులు ఆమె తల్లిదండ్రులకు తలకు మించిన భారం అయింది. ఇందుకోసం తమకున్న అర ఎకరం పొలాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. రమేశ్ ద్వారా దీప్తి ప్రతిభను, ఆమె కష్టాలను తెలుసుకున్న  పుల్లెల గోపిచంద్‌‌‌‌‌‌‌‌ తనకు అండగా నిలిచాడు. గోపీచంద్ సూచనతోనే దీప్తికి పరీక్షలు చేయించి మేధోపర వైకల్య సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ ఇప్పించిన కోచ్ రమేశ్‌‌‌‌‌‌‌‌ ఆమెను పారా అథ్లెట్‌‌‌‌‌‌‌‌గా మార్చాడు.

అక్కడి నుంచి దీప్తి జీవితం మరో మలుపు తిరిగింది. తొలుత సాధారణ అథ్లెట్లనే ఓడించిన దీప్తి పారా ఈవెంట్లలో  పతకాల వేట మొదలు పెట్టింది. మెరుపు వేగంతో దూసుకెళ్తూ  పలు రికార్డులు కూడా బద్దలు కొడుతూ మంచి పేరు తేచ్చుకుంది. ఆసియా పారా గేమ్స్‌‌‌‌‌‌‌‌ 400 మీటర్ల ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో 56.69 సెకన్లతో  గేమ్స్ రికార్డును బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేస్తూ  గోల్డ్ మెడల్ గెలిచింది. గతేడాది వరల్డ్ పారా గ్రాండ్ ప్రీలోనూ 400 మీటర్లలో చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టించింది. ఇప్పుడు వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా, వరల్డ్ రికార్డు హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పారిస్ పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతున్న దీప్తి బంగారు పతకంతో తిరిగి రావాలని ఆశిద్దాం!