దీప్తి శర్మకు అరుదైన గౌరవం..డీఎస్పీ హోదాతో సత్కారం

దీప్తి శర్మకు అరుదైన గౌరవం..డీఎస్పీ హోదాతో సత్కారం

భారత మహిళా క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ గా సత్తా చాటుతున్న దీప్తి శర్మకు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న ఈ మహిళా ఆల్ రౌండర్ కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హోదాతో సత్కరించింది. మహిళల క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ఆమె ప్రదర్శనలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సంయుక్తంగా దీప్తి శర్మకు అపాయింట్‌మెంట్ లెటర్ తో 3 కోట్ల రూపాయల నగదును బహుమతిగా ఇచ్చారు.
 
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి తన కృతజ్ఞతలు తెలిపిన దీప్తి శర్మ.. DSPగా మహిళా క్రికెట్ జట్టును మరింతగా ఎంకరేజ్ చేస్తానని తెలియజేసింది. 2023 చైనాలో జరిగిన ఆసియా క్రీడలలో బంగారు పతకాన్ని గెలుచుకున్న ఆమె..ఇంగ్లాండ్‌ వేదికగా బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. డిసెంబర్ 2023లో దీప్తి శర్మ అసాధారణమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ICC 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు ను గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన రెండవ భారతీయ మహిళా క్రికెటర్‌గా నిలిచింది.  

ఈ కార్యక్రమంలో భాగంగా ఇతర క్రీడల్లో ప్రతిభ చూపిన ఆటగాళ్లను గుర్తించింది. పారా ఆసియా క్రీడల్లో పాల్గొన్న జతిన్ కుష్వాహా, యశ్ కుమార్‌లకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున నగదు బహుమతి అందించారు. స్నూకర్‌ ఛాంపియన్‌ పరాస్‌ గుప్తా, రైఫిల్‌ షూటింగ్‌ ఆయుషి గుప్తా జాతీయ క్రీడల్లో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు అవార్డులు అందుకున్నారు.