ఫిఫ్టీ, హ్యాట్రిక్‌‌తో మెరిసిన దీప్తి శర్మ

ఫిఫ్టీ, హ్యాట్రిక్‌‌తో మెరిసిన దీప్తి  శర్మ
  •     ఢిల్లీపై ఒక్క పరుగు తేడాతో యూపీ థ్రిల్లింగ్ విక్టరీ

న్యూఢిల్లీ:  డబ్ల్యూపీఎల్‌‌ రెండో సీజన్‌‌లో వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తున్న  ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు యూపీ వారియర్స్‌‌ షాకిచ్చింది. దీప్తి శర్మ  (48 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 59, 4/19) ఫిఫ్టీతో పాటు హ్యాట్రిక్‌‌తో సత్తా చాటడంతో   శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌లో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీని ఓడించింది. టాస్‌‌ నెగ్గిన యూపీ 20 ఓవర్లలో 138/8 స్కోరు చేసింది. దీప్తి, కెప్టెన్ అలీసా హేలీ (29) రాణించగా.. మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు. 

ఢిల్లీ బౌలర్లలో టిటాస్, రాధా యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో ఢిల్లీ 19.5 ఓవర్లలో 137 రన్స్‌‌కు ఆలౌటైంది. కెప్టెన్‌‌ మెగ్‌‌ లానింగ్ (46 బాల్స్‌‌లో 12 ఫోర్లతో 60) ఫిఫ్టీ కొట్టగా, జెమీమా (17), క్యాప్సీ (15), షెఫాలీ (15), జొనాసెన్ (11)  పోరాటంతో ఢిల్లీ ఈజీగా గెలిచేలా కనిపించింది. చేతిలో ఆరు వికెట్లు ఉండగా  చివరి 12 బాల్స్‌‌లో ఢిల్లీకి 15 రన్స్‌‌ అవసరమైన టైమ్‌‌లో దీప్తి మ్యాజిక్‌‌ చేసింది. 19వ ఓవర్లో మూడు వికెట్లు తీసి ఐదే రన్స్ ఇచ్చింది.  

తొలి రెండు బాల్స్‌‌కు సదర్లాండ్‌‌ (6),  అరుంధతి (0)ని పెవిలియన్‌‌ చేర్చింది. అంతకుముందు 14వ ఓవర్‌‌ ఆఖరి బాల్‌‌కు లానింగ్‌‌ను ఔట్‌‌ చేయడంతో దీప్తి ఖాతాలో హ్యాట్రిక్ చేరింది. దాంతో ఈ టోర్నీలో హ్యాట్రిక్ రాబట్టిన రెండో ప్లేయర్‌‌గా నిలిచింది.  ఇక, చివరి ఓవర్లో తొలి రెండు బాల్స్‌‌కు రాధా యాదవ్ (9) 6, 4 కొట్టడంతో ఢిల్లీకి మరో రెండు రన్సే అవసరం అయ్యాయి. కానీ, మూడో బాల్‌‌కు రాధాను గ్రేస్ హారిస్ (2/8) బౌల్డ్‌‌ చేయగా..నాలుగో బాల్‌‌కు  జొనాసెన్ రనౌటైంది. తర్వాతి బాల్‌‌కు టిటాస్‌‌ (0) క్యాచ్‌‌ ఇవ్వడంతో ఢిల్లీ చేజేతులా ఓడింది. దీప్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.