INDW vs WIW: దీప్తి ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌.. విండీస్ విలవిల

INDW vs WIW: దీప్తి ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌.. విండీస్ విలవిల
  • 3–0తో సిరీస్ నెగ్గిన ఇండియా 
  • దీప్తి ఆల్‌‌రౌండ్ షో
  • మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై గెలుపు

వడోదర: సీనియర్ ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ (6/31, 39 నాటౌట్‌‌) ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌తో విజృంభించడంతో వెస్టిండీస్‌‌తో మూడో వన్డేలోనూ ఇండియా ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 3–0తో క్లీన్‌‌స్వీప్‌‌ చేసి కరీబియన్‌‌ టీమ్‌‌ను వైట్‌‌వాష్‌‌ చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌లో ఇండియా ఐదు వికెట్ల తేడాతో విండీస్‌‌ను ఓడించింది. 

తొలుత టాస్  నెగ్గి బ్యాటింగ్‌‌కు వచ్చిన కరీబియన్ టీమ్  38.5 ఓవర్లలో 162 రన్స్‌‌కే ఆలౌటైంది. చినెల్లె హెన్రీ (61), షెమైన్‌‌ క్యాంప్‌‌బెల్ (46), అలియా అలెన్ (21) తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌‌కే పరిమితం అయ్యారు. పేసర్‌‌‌‌ రేణుకా సింగ్ (4/29) తొలి ఓవర్లోనే ఓపెనర్లు  క్వియానా జోసెఫ్ (0), హేలీ మాథ్యూస్ (0) ఇద్దరినీ డకౌట్ చేసి అద్భుత ఆరంభం ఇచ్చింది. దియేంద్ర డాటిన్‌‌ (5)ను కూడా బౌల్డ్ చేయడంతో విండీస్ 9/3తో నిలిచింది. ఈ దశలో క్యాంప్‌‌బెల్‌‌, హెన్రీ నాలుగో వికెట్‌‌కు 91 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ,   దీప్తి శర్మ ఒక్కసారిగా చెలరేగడంతో ఆ జట్టు   కుప్పకూలింది.

అనంతరం ఇండియా  28.2 ఓవర్లలో 167/5 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్లు మంధాన (4), ప్రతికా రావల్ (18)తో పాటు హర్లీన్ డియోల్ (1) ఫెయిలవడంతో చిన్న టార్గెట్ ఛేజింగ్‌‌లో  ఇండియా55/3తో తడబడింది. అయితే, కెప్టెన్ హర్మన్‌‌ (32), జెమీమా (29) ఇన్నింగ్స్‌‌ను  సరిదిద్దగా.. దీప్తి శర్మ గెలుపు లాంఛనం పూర్తి చేసింది. చివర్లో రిచా ఘోష్ (11 బాల్స్‌‌లో 23 నాటౌట్‌‌)  ఓ ఫోర్‌‌‌‌, మూడు సిక్సర్లతో ఫినిషింగ్ టచ్‌‌ ఇచ్చింది. దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌, రేణుకా సింగ్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌‌ అవార్డులు లభించాయి.