ఎండ పెరిగి జింకల చావుకొచ్చింది

క్లైమేట్​ ఛేంజ్​ సైడ్​ ఎఫెక్ట్స్​ మొదలయ్యాయి. నోరు లేని జీవుల నోటి కాడి తిండిని దూరం చేస్తున్నాయి. ఆర్కిటిక్​ మహాసముద్రంలోని ఓ ద్వీప సముదాయంలో 200 మూగజీవులను ఈమధ్య బలి తీసుకున్నాయి. మంచు ప్రాంతాల్లో తిరిగే జింకల (రీన్​డీర్ల​) సంఖ్య​ పెరగటానికి ఉపయోగపడుతున్న వాతావరణ మార్పులే… వాటి మరణానికి దారి తీస్తున్నాయి. పెరిగిన జింకల సంఖ్యకు కావలసిన చెట్టూ చేమా దొరక్కుండా పోతోంది. నార్వేకి, నార్త్​ పోల్​కి మధ్య ఉన్న స్వాల్​బార్డ్​ అనే ఏరియా ఈ వింత పరిస్థితికి వేదికైంది.

వాతావరణ మార్పులు ఎకో స్టిస్టమ్స్​ని కూల్చేస్తున్నాయి. స్వాల్​బార్డ్​ ద్వీప సముదాయంలో గత చలికాలంలో 200 మంచు ప్రాంత జింకలు (రీన్​డీర్లు) ఆకలితో చనిపోవటమే దీనికి ఉదాహరణ అని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ప్రాంతం నార్వే మెయిన్​ ల్యాండ్​కి, నార్త్​ పోల్​కి మధ్యలో ఉంటుంది. అక్కడ న్యాచురల్​గా ఏర్పడ్డ పచ్చని మైదానాలు దండిగా కనిపిస్తాయి. జింకల మేతకు సరిపడా మొక్కలు కూడా దొరుకుతాయి. అయినా ఆ మూగ జీవులు తినటానికి తిండి కరువై ఆకలితో అలమటించి చివరికి ప్రాణాలు కోల్పోయాయి.  ఈ ప్రాంతంలోని రీన్​డీర్లపై సర్వే చేస్తున్న నార్వేజియన్​ పోలార్​ ఇన్​స్టిట్యూట్​ తెలిపింది. 2007–08 తర్వాత ఇన్ని జింకలు మరణించటం ఇదే తొలిసారి అని చెప్పింది. ‘క్లైమేట్​ ఛేంజ్​ కారణంగా ఎత్తైన ప్రాంతాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. చలికాలంలో కూడా పెద్దఎత్తున కురుస్తున్న ఈ వర్షాల వల్ల ముంచెత్తే వరద ఆ తర్వాత గడ్డ కడుతోంది. దీంతో మంచు ప్రాంతపు జింకలకు తినటానికి చెట్టూ చేమా దొరక్కుండా పోతోంది’ అని ఒక టెర్రెస్ట్రియల్​ ఎకాలజిస్ట్​ వివరించారు.

1925 నుంచి రక్షిస్తున్నా..

నార్వేలో మంచు ప్రాంత జింకలను 1925 నుంచి రక్షిస్తూ వస్తున్నారు. దీంతో వాటి సంఖ్య పుంజుకుంటోంది. కానీ.. క్లైమేట్​ ఛేంజ్​ వల్ల ఆ జీవులు రానురానూ అంతరించిపోతున్నాయని గడిచిన 40 ఏళ్లుగా రీసెర్చర్లు చేస్తున్న స్టడీలో తేలింది. 1900వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు నమోదు చేసిన వివరాలను బట్టి చూస్తే ఆర్కిటిక్​ ప్రాంతంలో పోయిన ఐదేళ్లలో ఉన్నంతగా టెంపరేచర్లు గతంలో ఎప్పుడూ లేవు. మిగతా ప్రపంచంతో పోల్చితే ఈ రీజియన్​ రెండు రెట్ల వేగంతో వేడెక్కుతున్నట్లు అమెరికాలోని ఎన్​ఓఏఏ గతేడాది ఇచ్చిన రిపోర్టు తెలిపింది.

2013 నుంచే ప్రారంభం​

స్వాల్​బార్డ్​లో రీన్​డీర్లు, ఇతర జీవులపై వాతావరణ మార్పుల ప్రభావం 2013 నుంచే ప్రారంభమైందని సైంటిస్టులు అంటున్నారు. 2016లో 300లకు పైగా రీన్​డీర్లు, 2017లో 100 రీన్​డీర్లు చనిపోవటం పట్ల యానిమల్​ కన్జర్వేషనిస్టుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

మంచి చెడు రెండూ..

వాతావరణ మార్పుల ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలం ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ రోజులు కొనసాగుతోంది. దీనివల్ల మంచీ చెడు రెండూ ఉన్నాయి. ఎండల కారణంగా రీన్​డీర్ల పాపులేషన్​ పెరగటం మంచి పరిణామమే. కానీ, జింకల సంఖ్య ఎక్కువ కావటంతో తక్కువగా ఉన్న గడ్డీగాదం సరిపోవట్లేదు. ఫలితంగా తీవ్ర ఆహార సమస్య ఏర్పడుతోంది. అది చివరికి ఆ నోరు లేని జీవుల ఆకలి చావులకు దారితీస్తోంది.