భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత సారథి ఎంఎస్ ధోనీ(MS Dhoni)పై పరువు నష్టం కేసు నమోదైంది. క్రికెట్ అకాడమీల పేరుతో తన మాజీ వ్యాపార భాగస్వాములు రూ.15 కోట్ల మేర మోసం చేశారంటూ ధోనీ ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కా స్పోర్ట్స్ యజమానులు మిహిర్ దివాకర్, సౌమ్యా విశ్వాస్ తాజాగా ధోనీపై పరువు నష్టం దావా వేశారు.
ఈ కేసు కోర్టు పరిధిలో వుండగా.. ధోనీ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆర్కా స్పోర్ట్స్ యజమానులు పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ పరువుకు భంగం కలిగించేలా ప్రకటన చేసినందుకుగానూ నష్ట పరిహారం చెల్లించాలని వారు పిటిషన్‌లో పొందుపరిచారు. అలాగే, తమకు వ్యతిరేకంగా సోషల్ మీడియా, మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో ఎలాంటి ప్రకటనలు చేయకుండా నియంత్రించాలని వారు కోర్టును అభ్యర్థించారు. ఈ కేసుపై జనవరి 18న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది.
2017లో ఒప్పందం
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు.. మిహిర్ దివాకర్, సౌమ్యా విశ్వాస్‌ల యాజమాన్యంలోని ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌తో ధోని 2017లో ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం సదరు సంస్థ.. ఫ్రాంఛైజీ ఫీజులు, లాభాల్లో వాటాను క్రికెటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఒప్పందంలోని షరతులను పాటించకపోగా.. నిర్ణీత వ్యవధిలో క్రికెట్ అకాడమీలను స్థాపించడంలో విఫలమైంది. దీంతో ధోని ఆ ఒప్పందం నుంచి వైదొలిగారు. అనంతరం తనకు రావాల్సిన చెల్లింపులపై కోర్టును ఆశ్రయించారు.
అయితే, ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని దివాకర్ కొట్టిపారేశారు. కోర్టు తీర్పులు వెలువడకముందే ధోనీ తరపు న్యాయవాది దయానంద్ షమ్రా మీడియా సమావేశం నిర్వహించి తమ పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారన్నారు.