-
నేను ఎవ్వరి అయ్యకు భయపడ: కేటీఆర్
-
రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా
ఇబ్రహీంపట్నం, వెలుగు: తనమీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి మీద కేసు వేశానని, సీఎం మీద కూడా పరువునష్టం దావా వేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తాను తప్పే చేయనప్పుడు ఎవ్వరి అయ్యకు భయపడేదే లేదని అన్నారు. తాను ప్రధాని మోదీకే భయపడలేదని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు క్రాస్ రోడ్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నాలో కేటీఆర్ మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పది నెలల్లో సాధించిందేమీ లేదు. పేదల పథకాలకు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నరు.
మూసీ సుందరీకరణకు కేటాయింపులు చేస్తున్నరు. మూసీలోని ఎన్ని ఎకరాలకు నీళ్లిస్తరో రేవంత్‌రెడ్డి వద్ద సమాధానం ఉందా? ’ అని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణకు రూ. లక్ష యాభై వేల కోట్లు ఇస్తున్న సీఎంకు.. పేదల పథకాలకు మాత్రం ఇవ్వడానికి డబ్బులు లేవా? అని అడిగారు. మూసీ సుందరీకరణ కేవలం కమీషన్ల కోసమేనని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను తమ ప్రభుత్వం రాగానే తిరిగి రైతులకే ఇచ్చేస్తామని బస్సు యాత్రలు చేసి మరీ చెప్పారని, కానీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
సబితక్క కొడుకులకు ఫామ్‌హౌస్‌లు ఏడున్నయ్?
‘సబితక్క ముగ్గురు కొడుకులకు ఫామ్‌హౌస్‌లు ఉన్నవి అంటున్నవ్. ఏడున్నవో చెప్తే మేమే కూలగొడ్తం’ అని రేవంత్‌నుద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘40 ఏండ్ల నుంచి అన్ని ట్యాక్సులు కట్టించుకుని ఆక్రమణ దారులంటున్నవ్. బుల్డోజర్లు పంపుతనంటున్నవ్..నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కొడంగల్‌లోని రెడ్డికుంటలో నీ ఇల్లు కూలగొట్టు.. నీ అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో కట్టుకున్న ఇల్లు కూలగొట్టు.. ఏమన్నా ఉంటే మావి కూడా కూలగొట్టు కానీ..పేదల జోలికి పోవద్దు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సబితా రెడ్డి, మహమూద్‌అలీ, ఎమ్మెల్యే ముఠాగోపాల్, సురభి వాణీదేవి పాల్గొన్నారు.