70 సీట్లలో బీజేపీకి ఓటమి ఖాయం: మాజీ సీఎం అఖిలేష్ యాదవ్

70 సీట్లలో బీజేపీకి ఓటమి ఖాయం: మాజీ సీఎం అఖిలేష్ యాదవ్

న్యూఢిల్లీ: ఇండియా కూటమిలో మిత్రపక్షమైన కాంగ్రెస్‎కు సమాజ్‎వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ షాకిచ్చారు. కాంగ్రెస్‎ను కాదని.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటికే బహిరంగా మద్దతు తెలిపిన అఖిలేష్.. తాజాగా స్వయంగా రంగంలోకి దిగి ఆప్ తరుఫున ప్రచారం చేశారు. మరో వారం రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆప్ ప్రచారం హోరెత్తి్స్తోంది. ఈ క్రమంలోనే గురువారం కేజ్రీవాల్‎తో కలిసి కిరారీ నియోజకవర్గంలో ఆప్ తరుపున అఖిలేష్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..  ఢిల్లీ ప్రజలు  బీజేపీకి ఓటు వేసి తమ తమ అమూల్యమైన ఓటును వృధా చేసుకోవద్దని సూచించారు. ఆప్‌కి ఓటు వేసి మరోసారి అభివృద్ధికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. మత విద్వేషాలు వ్యాప్తి చేస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తోన్న బీజేపీని ఓడించేందుకు ఢిల్లీ ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు అఖిలేష్. విద్య, ఆరోగ్య రంగంలో ఆప్ అద్భుతంగా పని చేసిందని కొనియాడారు. ఆప్ తీసుకొచ్చిన పథకాలను అలాగే కొనసాగిస్తామని బీజేపీ చెప్పడమే కేజ్రీవాల్ పాలనకు నిదర్శమన్నారు.

Also Read :- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ సీఎం ఇంట్లో ఈసీ రైడ్స్

 ‘‘ఈసారి ఢిల్లీలో బీజేపీ మొత్తం 70 సీట్లలో ఓటమి పాలుకావచ్చు. ఢిల్లీలో మరోసారి ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని నమ్మకం ఉంది. ఆప్ సుపరిపాలన బీజేపీ దుష్పరిపాలనను ఓడిస్తుంది. ఆప్ పనులన్నీ చారిత్రాత్మకం. ఆప్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఢిల్లీలోని పేద, సామాన్య ప్రజలకు మేలు చేస్తున్నాయి. మరోసారి ఆప్ గెలిస్తే సకల సౌకర్యాలు పొందుతారని ఢిల్లీ ప్రజలకు తెలుసు. అందుకే ఢిల్లీలో మరోసారి ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది’’ అని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం మొత్తంలో ఇండియా కూటమిలో తమ మిత్రపక్షమైన కాంగ్రెస్ ప్రస్తావనను ఎక్కడ తీసుకురాలేదు అఖిలేష్. కాంగ్రెస్‎ను అటు పొగడను లేదు.. ఇటు విమర్శించకపోవడం గమనార్హం.