- అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్నుంచి జంపింగ్‌లు
- గులాబీ పార్టీనుంచి బీజేపీలో చేరిన ఐదుగురు ఓటమి
- కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసినోళ్లలో నలుగురు పరాజయం
- బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్పీకి మూడో స్థానం
హైదరాబాద్, వెలుగు: పార్టీ మారి టికెట్ దక్కించుకున్న కొందరు నేతలకు ఎన్నికల్లో నిరాశ తప్పలేదు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పార్టీ నేతలకు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో డీలాపడిన బీఆర్ఎస్ నుంచే.. ఎక్కువ మంది నేతలు జంప్ కొట్టి కాంగ్రెస్, బీజేపీ తరఫున పోటీచేశారు. బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందన్న చర్చలు జరగడం, ఆ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆలోచించి పలువురు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. కానీ, ఆ వ్యూహం బెడిసి కొట్టింది. రంజిత్‌రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, ఆరూరి రమేశ్, బీబీ పాటిల్, పోతుగంటి భరత్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నీలం మధు, సీతారాం నాయక్, దానం నాగేందర్ లోక్‌సభ ఎన్నికలకు ముందే పార్టీలు మారారు. వివిధ పార్టీల్లో చేరి టికెట్లు దక్కించుకున్నారు. కానీ, అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయారు. ఈ జాబితాలో ఐదుగురు బీజేపీ అభ్యర్థులు, నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక్క బీఆర్ఎస్అభ్యర్థి ఉన్నారు.
చేవెళ్ల, మల్కాజిగిరి రివర్స్
చేవెళ్లనుంచి గతంలో బీఆర్ఎస్ తరఫున ఎంపీగా పనిచేసిన రంజిత్‌రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నారు. అయితే, అక్కడి టికెట్ఆశించి కాంగ్రెస్‌లో చేరిన పట్నం సునీతా మహేందర్‌రెడ్డిని కాంగ్రెస్.. మల్కాజిగిరి నుంచి బరిలోకి దింపింది. కాగా, ఆ నిర్ణయం బెడిసికొట్టినట్టయింది. ఆ ఇద్దరూ వారు పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేతిలో రంజిత్‌రెడ్డి, ఈటల రాజేందర్ చేతిలో సునీతా మహేందర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్నుంచి ఖైరతాబాద్ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. సికింద్రాబాద్ఎంపీగా పోటీ చేశారు. ఆయనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు టికెట్ ఆశించిన నీలం మధు.. కాంగ్రెస్‌ను వీడి బీఎస్పీలో చేరి, పోటీ చేశారు. కానీ, అక్కడ ఓడిపోయారు. బీఎస్పీని వీడి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ మెదక్ టికెట్‌ఇచ్చింది. అక్కడ ఆయన రఘునందన్‌రావు చేతిలో పరాజయం చెందారు.
బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినోళ్లు ఓడిన్రు
బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీలైన బీబీ పాటిల్, పోతుగంటి రాములు తనయుడు భరత్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, శానంపూడి సైదిరెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ టికెట్లు సాధించినా గెలవలేకపోయారు. కాంగ్రెస్‌కు కంచుకోట అయిన నల్గొండ బరిలో నిలిచిన శానంపూడి సైదిరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూశారు. వాస్తవానికి సైదిరెడ్డి చేరికను బీజేపీ కార్యకర్తలు, క్షేత్ర స్థాయి నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సైదిరెడ్డికే బీజేపీ టికెట్‌ఇచ్చింది.
అప్పటికే సైదిరెడ్డిపై అక్కడ విపరీతమైన వ్యతిరేకత ఉండడం, కాంగ్రెస్ కంచుకోట కావడంతో భారీ ఓటమి తప్పలేదు. బీఆర్ఎస్తరఫున వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆరూరి రమేశ్.. బీజేపీ నుంచి వరంగల్ఎంపీగా అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నారు. కానీ, బీఆర్ఎస్నుంచే వచ్చి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి కూతురు కావ్య చేతిలో ఘోర ఓటమిపాలయ్యారు. నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేసిన పోతుగంటి భరత్.. కాంగ్రెస్అభ్యర్థి మల్లు రవి చేతిలో ఓడిపోయారు. బీఆర్ఎస్ తరఫున మహబూబాబాద్ నుంచి 2014లో గెలిచిన మాజీ ఎంపీ సీతారాంనాయక్.. ఈసారి ఎన్నికల్లో బీజేపీ తరఫున అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూశారు. కానీ, కేంద్రంలో మాజీ మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్అభ్యర్థి పొరిక బలరాం నాయక్ చేతిలో ఓడిపోయారు. జహీరాబాద్ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన బీఆర్ఎస్ సిట్టింగ్ఎంపీ బీబీ పాటిల్.. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్‌షెట్కార్ చేతిలో ఓటమి పాలయ్యారు.
బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో చేరినా తప్పని ఓటమి
బహుజన్ సమాజ్‌పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఫలితాల తదనంతర పరిణామాలతో బీఆర్ఎస్లో చేరారు. నాగర్‌కర్నూల్ టికెట్‌ను సాధించారు. ఆ స్థానం ప్రవీణ్‌కుమార్‌కు కచ్చితంగా కలిసొస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. కానీ, అక్కడ ఆయనకు మూడో స్థానమే దక్కింది. వాస్తవానికి బీఆర్ఎస్లో ఆర్ఎస్పీ చేరడాన్ని చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారు. బహుజనుల రాజ్యం తీసుకొస్తామని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మళ్లీ గడీల పాలనకు జై కొట్టడం సబబు కాదని అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. అయినా ఆయన బీఆర్ఎస్లో చేరగా, ప్రజలు ఓడించారు.