నాసిరకం పైపులేసి నట్టేట ముంచిన్రు

ఎనిమిదేండ్లలో దాదాపు వందసార్లు పగుళ్లు 
ఎమ్మెస్ పైపులకు బదులు జీఆర్పీ పైపులు వేయడంతోనే..  
నాడు రూ.4 కోట్లకు కక్కుర్తి..నేడు రూ.144 కోట్ల ఖర్చు
పరోక్షంగా పైపుల కంపెనీకి లాభం చేసిన సర్కారు 
30 వేల ఎకరాలకు నీళ్లందక ఎండుతున్న పంటలు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లాలోని గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో లోపాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. 12 కిలోమీటర్ల పైపులైన్ నాసిరకంగా నిర్మించడంతో మాటిమాటికి  పగులుతున్నాయి. లిఫ్ట్ నుంచి నీళ్లందక ఆయకట్టు పరిధిలోని 30 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. అప్పుడు కేవలం రూ.4 కోట్లు ఆదా చేసేందుకు ఎమ్మెస్ (మైల్డ్ స్టీల్) పైపులకు బదులు జీఆర్పీ (గ్లాస్ రెయిన్​ఫోర్సుడ్​ ప్లాస్టిక్) పైపులు వేశారు. సర్కారుకు డబ్బులు మిగులుతున్నట్టు చెప్పినా లోపాయికారిగా పైపుల కంపెనీకి లాభం చేసేందుకే ఈ మార్పులు చేశారన్న విమర్శలు వచ్చాయి. 50 ఏండ్ల సర్వీస్ ఇయ్యాల్సిన పైపులు ఇప్పటివరకు దాదాపు వందసార్లు పగిలిపోయాయి. దీంతో జీఆర్పీ పైపులను తొలగించి ఎమ్మెస్ పైపులు వేయడానికి ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారు. కొత్త పైపులైన్ నిర్మాణానికి కిలోమీటరుకు రూ.12 కోట్ల చొప్పున సుమారు రూ.144 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు.  

రూ.180 కోట్లతో నిర్మాణం

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు కింద 70 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాలకు ఎన్నడూ నీళ్లందని పరిస్థితి ఉండేది. దీంతో మూడు మండలాల్లోని 30వేల ఎకరాల చివరి ఆయకట్టును స్థిరీకరించేందుకు దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరి నదిపై లిఫ్ట్​ను నిర్మించారు. రూ.125 కోట్లతో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​(మెయిల్), కేబీఎల్ డబ్ల్యూజీ సంస్థలకు అప్పగించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 3 టీఎంసీల నీటిని తీసుకొని 30 వేల ఎకరాలకు అందించేలా ఈ స్కీం రూపొందించారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వ టైంలో పనులు ప్రారంభించి 2015లో టీఆర్ఎస్ హయాంలో పూర్తి చేశారు.  ఆలస్యం కావడంతో ఖర్చు రూ.180 కోట్లకు చేరింది. గూడెం పంపుహౌస్ నుంచి దండేపల్లి మండలంలోని తానిమడుగు వరకు 12.01 కిలోమీటర్లు పైపులైన్ నిర్మించి కడెం ప్రాజెక్టు 30వ డిస్ర్టిబ్యూటరీ కెనాల్​కు లింక్ చేశారు. అక్కడినుంచి హాజీపూర్ మండలం 42వ డిస్ర్టిబ్యూటరీ వరకు యాసంగిలో ఆయకట్టు పంటలకు సాగునీరందించాల్సి ఉంది.   

మేఘాకు మేలు చేయడానికే..  

గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం డీపీఆర్ లో 12.01 కిలోమీటర్ల మేర పూర్తిగా 2,300 ఎంఎం ఎమ్మెస్ పైపులు వేయాలని ఉండగా, కాంట్రాక్టర్ సూచన మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎమ్మెస్ పైపులకు బదులు జీఆర్పీ పైపుల వైపు మొగ్గుచూపారు. ఈ పైపులు 50 ఏండ్ల సర్వీస్ ఇస్తాయని, ఎమ్మెస్ పైపులతో పోల్చితే ఖర్చు తగ్గుతుందని చెప్పారు. హైదరాబాద్​లోని మేఘా ఫైబర్ గ్లాస్ ఇండస్ర్టీకి పైపుల ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ 2009 డిసెంబర్​లో కాంట్రాక్టర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు సీఈకి లెటర్ రాశారు. ఎమ్మెస్ పైపులకు రూ.75.34 కోట్లు, జీఆర్పీ పైపులకు రూ.71.57 కోట్లు ఖర్చవుతుందని, జీఆర్పీ పైపులు వేస్తే ప్రభుత్వానికి రూ.3.76 కోట్లు మిగులుతాయని పేర్కొన్నారు. కానీ లోపాయికారిగా మేఘా ఫైబర్ గ్లాస్ ఇండస్ర్టీకి పైపుల ఆర్డర్ ఇచ్చి ఆ కంపెనీకి మేలు చేసేందుకే ఈ మార్పులు జరిగాయని స్పష్టమవుతోంది. 

ఎమ్మెస్ పైపులైన్​కు రూ.144 కోట్లు

జీఆర్పీ పైపులు తరచూ పగులుతూ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. లిఫ్ట్ ప్రారంభించిన ఏడాది నుంచే పగుళ్లు మొదలయ్యాయి. ఎనిమిదేండ్లలో దాదాపు వందసార్లు ఈ పైపులు పగిలినట్టు సమాచారం. అధికారులు పగిలిన పైపులకు తాత్కాలికంగా రిపేర్లు చేసి మమ అనిపిస్తున్నారు. రెండు మోటార్లతో రోజుకు 290 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉండగా ఏనాడూ సజావుగా పారిన దాఖలాలు లేవు. ఫలితంగా ఏటా యాసంగిలో నీళ్లందక పొలాలు ఎండుతున్నాయి. దీంతో జీఆర్పీ పైపులను తొలగించి ఎమ్మెస్ పైపులు వేయడమే పరిష్కారమని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సీఎం కేసీఆర్ కూడా అంగీకరించారని మంత్రి హరీశ్​రావు రెండేండ్ల కిందట అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అతీగతీ లేదు. ఇటీవల రైతులు రోజూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్​లు ఆందోళనలు చేపట్టడంతో ఎమ్మెస్ పైపులు వేయడానికి ఇరిగేషన్ అధికారులు కలెక్టర్​తో పాటు ఈఎన్సీకి గత నెలలో నివేదిక ఇచ్చారు. ప్రస్తుత స్టాండర్డ్ రేట్ల ప్రకారం ఎమ్మెస్ పైపులకు కిలోమీటరుకు రూ.12 కోట్ల చొప్పున 12 కిలోమీటర్లకు రూ.144 కోట్ల ఖర్చవుతుందని సమాచారం. అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్టరే గూడెం లిఫ్ట్ ను 15 ఏండ్లు మెయింటెన్​చేయాలి. 50 ఏండ్లు సర్వీస్ ఇవ్వాల్సిన పైపులు ఏడాది నుంచే పగలడం, ఏడేండ్ల మెయింటనెన్స్ పీరియడ్ మిగిలి ఉండగానే ఎమ్మెస్ పైపులు వేయాలని నిర్ణయించడం వల్ల తిరిగి కాంట్రాక్టర్​కే   లబ్ధి జరగడంతో పాటు అప్పుల్లో ఉన్న ప్రభుత్వానికి  ఆర్థిక భారం మరింత పెరగనుంది.  

బావులు, బోర్లు తవ్విస్తున్న రైతులు

గూడెం లిఫ్ట్ కింద ఈ యాసంగిలో 20వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాగునీరందక ఇప్పటికే సుమారు 10వేల ఎకరాల్లో పొలాలు ఎండిపోయాయి. రైతులు ఎకరానికి రూ.25వేల పెట్టుబడి పెట్టి నష్టపోయారు. మిగిలిన పంటలను కాపాడుకునేందుకు పొలాల్లో బావులు, బోర్లు తవ్విస్తున్నారు. దీంతో తమపై రూ.2లక్షల నుంచి రూ.3లక్షల అదనపు భారం పడుతోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కడెం, ఎస్సారెస్పీ నుంచి నీళ్లు విడుదల చేయాలని, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.