- సర్వీస్ రోడ్లుండవ్.. సైన్ బోర్డులు కనిపించవ్
- హైవే నిర్మాణంలో లోపాలే ప్రమాదాలకు కారణం
- వాహనదారులకు యూటర్న్తిప్పలు
- అడుగడుగునా హైవే అథారిటీ నిర్లక్ష్యం
నిజామాబాద్, వెలుగు: నార్త్, సౌత్ ఇండియాకు వారధి ఎన్‌హెచ్44. ఈ హైవే ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది. దీంతో ఎంతో మంది విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. హైవే నిర్మాణంలో లోపాలే ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ హైవేకు సర్వీస్ రోడ్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో హైవే అథారిటీ ఆఫీసర్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. గన్నారం వద్ద సర్వీస్ రోడ్ లేకపోవడంతో యూటర్న్ వద్ద జరుగుతున్న ప్రమాదాల్లో వాహనదారులు, స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాదిన్నరగా సుమారు 100 ప్రమాదాలు జరగగా 60 మంది వరకు చనిపోయారు. 5 నెలల కింద ఇద్దరు చనిపోయారు.
ఉమ్మడి జిల్లాలో 130 కి.మీ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బస్వాపూర్ నుంచి సోన్ బ్రిడ్జి దూద్ గాం వరకు 130 కిలోమీటర్లు హైవే ఉంది. ఈ రోడ్డుపై నిత్యం ఏదో ఒక చోట యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ హైవేపై ఎలాంటి హెచ్చరికలు లేకుండా పాత లేయర్ తొలగించి కొత్త లేయర్ వేస్తున్నారు. పనులు స్లోగా జరగడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పనులు జరుగుతున్న విషయం తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. టోల్‌చార్జీల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే నిర్వాహకులు.. రోడ్డు నిర్వహణను గాలికొదిలేశారన్న ఆరోపణలున్నాయి.
ఏటా పెరుగుతున్న ప్రమాదాలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత నాలుగేళ్లలో 615 జరగగా 365 మంది మృత్యువాతపడ్డారు. గతేడాది 164 ప్రమాదాలు జరుగగా సుమారు60 మంది చనిపోయారు. సగటున నెలకు ఐదుగురు చనిపోతున్నారు. గత మే లో సుమారు 40 ప్రమాదాలు జరగగా ఏడుగురు చనిపోయారు. తీవ్రంగా గాయపడి దివ్యాంగులుగా మారినవారు చాలామందే ఉన్నారు. ఈ హైవేపై భిక్కనూరు, కామారెడ్డి బైపాస్, సదాశివనగర్, మల్లన్నగుట్ట, డిచ్‌పల్లి, ఇందల్వాయి, చంద్రాయాన్ పల్లి, జక్రాన్ పల్లి మండలం అర్గుల్, బాల్కొండ క్రాస్ రోడ్డు వద్ద యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరగుతున్నా నివారణ చర్యలు చేపట్టడంలో హైవే అథారిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇందల్వాయి మండలం గన్నారంలో సర్వీస్‌రోడ్డు లేకపోవడంతో వెహికల్స్ డైరెక్ట్ గా హైవేపైకి వస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గన్నారం గ్రామస్తులు సుమారు ఈ నాలుగేండ్లలో 11 మంది చనిపోయారు. ప్రమాదాల నివారణకు నేషనల్ హైవేపైనా తనిఖీలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఓవర్ టేకింగ్, కొన్ని చోట్ల పశువులు రోడ్డు క్రాస్చేసే అవకాశం లేక హైవే పైకి రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేపై చాలా చోట్లా సైన్‌బోర్డులు కూడా లేకపోవడం గమనార్హం.
గోల్డెన్ అవర్ కీలకం
యాక్సిడెంట్ జరిగినప్పుడు తొలి గంట(గోల్డెన్అవర్) చాలా కీలకం. ఈ టైంలో క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ హైవేపై ఎక్కడ ప్రమాదం జరిగినా క్షతగాత్రులను నిజామాబాద్జనరల్ హాస్పిటల్‌కు తరలించాల్సిన పరిస్థితి. దీంతో హాస్పిటల్‌కు చేరేసరికి లేటు అవుతోంది. ఇందల్వాయి పీహెచ్‌సీలో వసతులు లేకపోవడంతో క్షతగాత్రులకు సరైన టైంలో చికిత్స అందక చనిపోతున్నారు. ఈ పీహెచ్‌సీని ట్రామా సెంటర్‌గా అప్గ్రేడ్చేయాలన్నా డిమాండ్ఉంది. ట్రామా ఏర్పాటుతో వెంటనే చికిత్స అంది ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది.
యాక్సిడెంట్స్ నివారణకు చర్యలు
నేషనల్ హైవే 44 పై యాక్సిడెంట్స్ నివారణకు చర్యలు చేపట్టాం. హైస్పీడ్ వల్లనే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. గన్నారం వద్ద సర్వీస్ రోడ్ సమస్యను గుర్తించాం. ఈ సమస్యను హైవే అథారిటీ దృష్టికి తీసుకెళ్తాం. హైవేలో యూటర్న్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. కిరణ్ కుమార్, ఏసీపీ, నిజామాబాద్
15 మంది చనిపోయిన్రు..
గన్నారం వద్ద సర్వీస్‌రోడ్లు లేకపోవడంతో హైవేపైనే క్రాస్చేయాల్సి వస్తోంది. దీంతో యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. మొత్తం యాక్సిడెంట్లో మా ఊర్లో 15 మంది చనిపోయిన్రు. యాక్సిడెంట్స్ జరగకుండా చర్యలు చేపట్టాలి. బాలమల్లు, గన్నారం