మూడు బ్యారేజీల్లో లోపాలున్నాయని..ముందే చెప్పినం

మూడు బ్యారేజీల్లో లోపాలున్నాయని..ముందే చెప్పినం
  • కాళేశ్వరం కమిషన్ ముందు ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేందర్ రావు
  • రామగుండం ఈఎన్సీకి ఇన్ స్పెక్షన్ నోట్స్ కూడా ఇచ్చాం
  • మేడిగడ్డ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీలో రూల్స్ పాటించలేదు
  • బ్యారేజీల ఆపరేషన్, మెయింటెనెన్స్ లో ప్రొటోకాల్ ఫాలో కాలేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలున్నాయని తాము ముందే గుర్తించామని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ఈఎన్సీ బి.నాగేందర్ రావు తెలిపారు. ఆ లోపాల గురించి మూడు బ్యారేజీల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న రామగుండం ఈఎన్సీకి తెలియజేశామని చెప్పారు. ఈ మేరకు కాళేశ్వరం కమిషన్ కు వెల్లడించారు. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై ఓపెన్​ కోర్టు విచారణ జరుపుతున్న జ్యుడీషియల్ కమిషన్..

బుధవారం ఓఅండ్ఎం ఈఎన్సీ  నాగేందర్​రావు, క్వాలిటీ కంట్రోల్ రిటైర్డ్​ సీఈ అజయ్ కుమార్, ఎస్ఈ సర్దార్ ఓంకార్ సింగ్ ను విచారించింది. మేడిగడ్డ సహా ఇతర బ్యారేజీలు, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యత ఫీల్డ్ ఈఎన్సీలు/సీఈలదేనని నాగేందర్ రావు తెలిపారు. ‘‘మూడు బ్యారేజీలను పర్యవేక్షించే రామగుండం ఈఎన్సీ వాటిల్లోని లోపాలను ఏనాడూ ఓఅండ్ఎం విభాగం దృష్టికి తేలేదు. మా విభాగం​అధికారులే బ్యారేజీలను పరిశీలించి సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. ఇన్​స్పెక్షన్​నోట్స్​కూడా రామగుండం ఈఎన్సీకి అందజేశాం. కానీ, తీసుకున్న చర్యలపై రిపోర్ట్​ను ఆయన తిరిగి మాకు అందించలేదు” అని చెప్పారు.

2021 అక్టోబర్ 25, 2021 నవంబర్​24న ఇన్​స్పెక్షన్​ రిపోర్ట్స్​ ఇచ్చామని నాగేందర్​రావు వెల్లడించారు. ఓఅండ్ఎం విషయంలో ప్రొటోకాల్ ఫాలో కాలేదని, సెంట్రల్ వాటర్ కమిషన్ మాన్యువల్​నూ అనుసరించలేదన్నారు. ఓఅండ్ఎం విభాగం ఏర్పాటుకు ముందు డ్యామ్​సేఫ్టీ ఆర్గనైజేషన్​ను సీడీవో (సెంట్రల్​డిజైన్స్​ఆర్గనైజేషన్) సీఈ చూసేవారని.. వర్షాకాలానికి ముందు, తర్వాత చేసే ఎవాల్యుయేషన్ రిపోర్టులను సీడీవో సీకే సమర్పించేవారని పేర్కొన్నారు.  

మేడిగడ్డ కుంగుబాటుకు రీజన్​ తెలియదు

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీని కేటగిరీ 1 కింద ఎవాల్యుయేషన్ రిపోర్టులో చేర్చారని.. అన్నారం, సుందిళ్లను కేటగిరీ 2 కింద పెట్టారని నాగేందర్ రావు చెప్పారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీ పూర్తయినట్టు రామగుండం ఈఎన్సీ కనీసం మాకు చెప్పలేదు. డిఫెక్ట్​ లయబిలిటీ పీరియడ్​ ఎప్పటి నుంచి మొదలవుతుందో కూడా చెప్పలేదు.  కంప్లీషన్​సర్టిఫికెట్​జారీలో నిబంధనలు ఉల్లంఘించారు” అని వివరించారు. బ్యారేజీ ఎందుకు కుంగిందో సరైన కారణం తెలియదని పేర్కొన్నారు.  

సప్లిమెంటరీ అగ్రిమెంట్​ చేస్కోవాలి.. 

ఓఅండ్ఎంకు సంబంధించి కాంట్రాక్టర్ డ్యూటీస్​ను అగ్రిమెంట్​లో పేర్కొనలేదని నాగేందర్ రావు చెప్పారు. అందుకు ఫీల్డ్​ సీఈలు సంబంధింత కాంట్రాక్ట్ సంస్థతో సప్లిమెంటరీ అగ్రిమెంట్​చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, మూడు బ్యారేజీలను స్పెసిఫైడ్​ డ్యామ్స్ లిస్టులో ఎలా చేర్చారని కమిషన్​ ప్రశ్నించగా.. ‘‘1998 డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్​ను ఏర్పాటు చేసినప్పుడు పెద్ద ప్రాజెక్టులు అని మాత్రమే మెన్షన్​ చేశారు. ఆ తర్వాతి కాలంలో 2021లో కేంద్రం డ్యామ్ సేఫ్టీ యాక్ట్​2021ను తీసుకొచ్చింది. అందులో భాగంగా 2023 మార్చి 31న లార్జ్​ డ్యామ్స్​ నిర్వచనాన్ని స్పెసిఫైడ్​ డ్యామ్స్​గా మార్చారు.

ఆయా డ్యాముల వివరాలను నమోదు చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలనూ కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే 2023 జులైలో రామగుండం ఈఎన్సీ.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను స్పెసిఫైడ్​ లిస్టులో చేర్చాలంటూ లేఖ రాశారు’’ అని వివరించారు. గేట్ల ఆపరేషన్ షెడ్యూల్​ను తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్​లేబొరేటరీస్ ఇచ్చిందని చెప్పారు.  డ్యామ్​సేఫ్టీ యాక్ట్​ వచ్చిన తర్వాత కూడా బ్యారేజీల వద్ద ఎలాంటి ఓఅండ్ఎం యాక్టివిటీస్​జరగలేదన్నారు. స్పెసిఫైడ్ డ్యామ్​లిస్టులో చేర్చడానికి ముందే మాన్సూన్​ సీజన్ ​స్టార్ట్ అయిందని, పోస్ట్​ మాన్సూన్​సీజన్​నాటికి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని తెలిపారు.

కరోనా సయమయంలో బ్యారేజీకి రిపేర్లు చేయలేమని కాంట్రాక్ట్ సంస్థ చేతులెత్తేసిందా? అని కమిషన్​ ప్రశ్నించగా.. తనకు తెలియదని సమాధానమిచ్చారు. దాంతోపాటు పలు ప్రశ్నలకు తెలియదనే నాగేందర్ రావు సమాధానమిచ్చారు. కాగా, బ్యారేజీలపై టెస్టులు పూర్తి కాకుండానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను ఇచ్చిందని.. అందులోని అంశాలు తప్పయినా, కరెక్టయినా అయి ఉండొచ్చని పేర్కొన్నారు. 

సుందిళ్లకు వెళ్లానో లేదో గుర్తులేదు : అజయ్ కుమార్ 

2019, 2020లో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పరిశీలనకు వెళ్లానని క్వాలిటీ కంట్రోల్​విభాగం రిటైర్డ్ సీఈ అజయ్​కుమార్ చెప్పారు. అయితే, సుందిళ్ల బ్యారేజీ వద్ద పరిశీలించానో లేదో గుర్తు లేదని పేర్కొన్నారు. తాను బాధ్యతలు చేపట్టే నాటికి ఆ బ్యారేజీలు ఆపరేషన్​లోకి వచ్చాయని తెలిపారు. బ్యారేజీకి వరదలు వచ్చాక తాను పరిశీలనకు వెళ్లలేదన్నారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీకి తాను ఈఈగా బాధ్యతలు చేపట్టినప్పుడు కేవలం భూసేకరణ అంశాలనే చూశానని సర్దార్ ఓంకార్ సింగ్ తెలిపారు.

వాప్కోస్ అలైన్మెంట్​ను ఫిక్స్​చేశాక.. ఎల్అండ్​టీ సంస్థతో కలిసి బ్యారేజీ వద్ద పరిశీలన చేశామన్నారు. డిఫెక్ట్​లయబిలిటీ పీరియడ్​ఎప్పటివరకు ఉంటుందని కమిషన్​ ప్రశ్నించగా.. బ్యారేజీల్లో సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించాల్సిందిగా సంస్థలకు లేఖలు రాస్తామని, చెప్పిన టైమ్ కు వాటిని రెక్టిఫై చేయకపోతే లయబిలిటీ పీరియడ్​మరింత పెరుగుతుందని వివరించారు. తనకు ఎస్ఈలు రమణారెడ్డి, కరుణాకర్ ఆదేశాలిచ్చేవారని పేర్కొన్నారు.