రాడార్ సెంటర్​తో ఎలాంటి ముప్పుండదు: రాజ్ నాథ్ సింగ్

రాడార్ సెంటర్​తో ఎలాంటి ముప్పుండదు: రాజ్ నాథ్ సింగ్
  • ప్రజలకు, పర్యావరణానికి హాని జరగదు: రాజ్​నాథ్ సింగ్
  • స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతయ్
  • దీని ఏర్పాటులో సీఎం రేవంత్ రెడ్డి చొరవ అభినందనీయం
  • దేశ రక్షణ విషయంలో రాజీపడం.. ఒత్తిళ్లకు వెనక్కి తగ్గబోమని వెల్లడి
  • వికారాబాద్ జిల్లా దామగుండంలో రాడార్ సెంటర్​​కు శంకుస్థాపన 
  • హాజరైన కేంద్రమంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి ..

హైదరాబాద్, వెలుగు: దామగుండంలో ఏర్పాటు చేస్తున్న రాడార్ సెంటర్​తో ఎలాంటి ముప్పు ఉండదని.. పర్యావరణానికి, ప్రజలకు ఎలాంటి హాని జరగదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్తాయని చెప్పారు. మంగళవారం వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలోని పూడూరు దగ్గర వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) రాడార్ సెంటర్​​కు కేంద్రమంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాజ్​నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘రాజకీయాలు వేరు.. దేశ భద్రత వేరు. దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదు. రక్షణ రంగ పరికరాల తయారీలో హైదరాబాద్​కు మంచి పేరు ఉంది. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న రాడార్ సెంటర్​​ కూడా దేశ భద్రతలో కీలకంగా మారనుంది. తద్వారా దేశ రక్షణలో తెలంగాణ భాగస్వామి అవుతుంది’’ అని రాజ్​నాథ్ సింగ్ అన్నారు. రాడార్ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చూపిన చొరవ, చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. దేశం గర్వించదగ్గ గొప్ప శాస్ర్తవేత్త అబ్దుల్ కలాం జయంతి రోజు రాడార్ సెంటర్​కు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ‘‘కమ్యూనికేషన్ విషయంలో దామగుండం రాడార్ సెంటర్ కీలక పాత్ర పోషించనుంది. ఇది దేశ రక్షణకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ సెంటర్ ఏర్పాటు వల్ల స్థానికులకు ఎలాంటి నష్టం జరగదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయి” అని​చెప్పారు. నేవీని మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉన్నదని, ఈ క్రమంలోనే కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం త్రివిధ దళాల్లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నదని పేర్కొన్నారు. ‘‘గత పదేండ్లలో ఇండో ఫసిఫిక్ బెల్ట్ లో భారత్​కు సవాళ్లు పెరిగాయి. మన దేశ సముద్ర సంపదపై అన్ని దేశాలు గురిపెట్టాయి. ఇలాంటి తరుణంలో సముద్రాలపై ఆధిపత్యం సాధిస్తేనే దేశం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తున్నది’’ అని చెప్పారు. దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

రోడ్డు మార్గంలో దామగుండంకు రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌

సికింద్రాబాద్, వెలుగు: వికారాబాద్‌‌‌‌‌‌‌‌ దామగుండం పర్యటకు వచ్చిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్‌‌‌‌‌‌‌‌కు బేగంపేట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టులో కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్, బీజేపీ నేతలు మంగళవారం ఘన స్వాగతం పలికారు. అయితే బేగంపేట్ నుంచి ఆయన నేరుగా హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దామగుండం వెళ్లాల్సి ఉండగా ఆయన షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో స్వల్ప మార్పులు చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో రోడ్డు మార్గంలోనే దామగుండం రిజర్వ్‌‌‌‌‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌లో రాడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లారు. ఆయన వెంట కిషన్​రెడ్డి, బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ఉన్నారు.