ప్రధాని మోడీతో రాజ్‎నాథ్ సింగ్ భేటీ.. యుద్ధానికి ముహూర్తం ఫిక్స్ చేశారా..?

ప్రధాని మోడీతో రాజ్‎నాథ్ సింగ్ భేటీ.. యుద్ధానికి ముహూర్తం ఫిక్స్ చేశారా..?

న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ ఎటాక్ ఘటనతో భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావారణం రాజుకుంది. ఇరు దేశాలు సై అంటే సై అంటుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలు, త్రివిధ దళాల సన్నద్ధతపై చర్చించినట్లు తెలిసింది.  

అలాగే.. జమ్మూ కాశ్మీర్‎లో ఉగ్రవాదుల ఏరి వేతకు తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోడీకి రాజ్ నాథ్ సింగ్ వివరించినట్లు సమాచారం. మోడీతో భేటీ కంటే ముందు రాజ్ నాథ్ సింగ్ ఆదివారం (ఏప్రిల్ 27) భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్‎తో సమావేశమయ్యారు. త్రివిధ దళాల యుద్ధ సన్నద్ధత, పాక్‎పై అనుసరించాల్సిన వ్యూహాల గురించి వీరు చర్చించారు. 

జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతోన్న ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ గురించి మంత్రికి వివరించారు అధికారులు. ఉన్నతాధికారులతో భేటీ అయిన మరుసటి రోజే మంత్రి రాజ్ నాథ్ సింగ్, అజిత్ దోవల్ ప్రధాని మోడీని కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో పాకిస్థాన్‎పై యుద్ధానికి ముహుర్తం ఖరారు చేయడానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి.

పహల్గాంలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన టెర్రరిస్టులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ ఇప్పటికే హెచ్చరించారు. ఉగ్రమూకలు ఏ మూలన దాక్కున్నా వెతికి వెంటాడుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మోడీ, రాజ్‎నాథ్ సింగ్ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశం తర్వాత ఏం జరగబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాయాది పాక్‎పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే దానిపై సస్పెన్స్ నెలకొంది.