రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.27 లక్షల కోట్లు

రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.27 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: దేశ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.27 లక్షల కోట్లుగా నమోదైందని రక్షణ మంత్రి రాజ్ నాథ్  సింగ్  తెలిపారు. అంతకుముందు సంవత్సరం 2022–23లో రూ.1.08 లక్షల కోట్లుగా రికార్డయిందని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు. 202–23తో పోలిస్తే 2023–24లో రక్షణ ఉత్పత్తుల విలువ 16.7 శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

దేశాన్ని ప్రపంచంలోనే రక్షణ తయారీ హబ్‌‌గా అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలను విజయవంతంగా అమలు చేశామని, ఈ నేపథ్యంలో 2023–-24 ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో నమోదైందన్నారు. డిఫెన్స్  ఉత్పత్తులను తయారుచేసే పబ్లిక్  సెక్టార్, ప్రైవేట్  సెక్టార్  సంస్థలను ఈ సందర్భంగా రాజ్ నాథ్  అభినందించారు.

‘‘2023–24 సంవత్సరంలో డిఫెన్స్  ఉత్పత్తుల్లో పబ్లిక్  సెక్టార్  కంపెనీల వాటా 79.20 శాతం కాగా.. ప్రైవేట్  కంపెనీల వాటా 20.80 శాతం.  అదే సంవత్సరంలో రక్షణ ఎగుమతులు రూ.21.083 కోట్లకు చేరాయి.  2022–23లో ఎగుమతులు రూ.15,920 కోట్లుగా నమోదయ్యాయి. అంటే, ఈసారి ఎగుమతులు 32.50 శాతం పెరిగాయి” అని రాజ్ నాథ్  వివరించారు. రక్షణ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయిలో నమోదు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.