జీడీపీ లెక్కల్లో లోటుపాట్లు

భారతదేశ జాతీయ స్థూల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర వాటా 2014-–15 నుంచి 2022-–23 మధ్య 4.1 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగింది. ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణ స్థూల ఉత్పత్తి(జీఎస్​డీపీ) రూ.13.27 లక్షల కోట్లకు చేరింది. 2022–23లో తెలంగాణాలో తలసరి ఆదాయం రూ.3.17 లక్షలు చేరుకోగా, జాతీయ ఆదాయం రూ.1.46 లక్షలు మాత్రమే. ఇటీవల కేంద్రం లోకసభలో ఇచ్చిన తాజా గణాంకాల ప్రకారం 2022-–23లో తలసరి జీఎస్డీపీ రూ.3,08,732తో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. అయితే వాస్తవానికి మొత్తం 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన తలసరి ఆదాయం లెక్కల్లో 18 రాష్ట్రాలకు సంబంధించి 2022–-23 గణాంకాలు అందుబాటులో లేవు. సగానికి పైగా జీడీపీ అందుబాటులోకి రాలేదు. జీడీపీ లెక్కల్లో అనేక లోతులు, లోటుపాట్లు ఉన్నాయి. అది ఒక డొల్ల సూచిక.


పేదరికాన్ని దాచిపెడుతుంది


ఆర్థిక వ్యవస్థకు సూచిక అయిన జీడీపీ రాజకీయ సూచికగా మారినప్పటి నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రామాణికత మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్వతంత్ర ధ్రువీకరణ లేదు. మార్కెటేతర కార్యకలాపాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బదిలీ చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలు, సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకాలు జీడీపీలో ఉండవు. రిజిస్టర్డ్ మార్కెట్లకు రాని వ్యవసాయ ఉత్పత్తులూ అందులోకి రావు. జామకాయలు తోట బయట అమ్మితే  జీడీపీలోకి రావు. అవే జామకాయలు స్థానిక మార్కెట్​లో విక్రయిస్తే  మార్కెట్ లెక్కల ద్వారా జీడీపీలోకి వస్తాయి. చెట్టు నరికి మార్కెట్లో అమ్మితే జీడీపీలోకి వస్తుంది. అదే చెట్టు పండ్లు ఇచ్చి, ఆకలి తీర్చి, నీడ ఇచ్చినా, వాటి విలువ జీడీపీలోకి రాదు. ఉత్పత్తి చేసే కార్ల ఆర్థిక విలువను జీడీపీ గణిస్తుంది. కానీ ఆ కార్లు విడుదల చేసే కాలుష్య ఉద్గారాలను లెక్కించదు. జీడీపీ పెరుగుదలను సంపద సృష్టిగా కొందరు రాజకీయ నాయకులు ప్రచారం చేస్తుంటారు. అయితే, సగటు జీడీపీ పెరుగుదల పురోగతి కాకుండా తిరోగమనం కావచ్చు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లేదా ఆదాయం పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు సమాజ శ్రేయస్సును నిర్ధారించడంతో సమానం కాదు. జీడీపీ పేదరికాన్ని దాచిపెడుతుంది, అసమానతలను విస్మరిస్తుంది. జీడీపీ పెరిగినా ఖర్చు చేయగలిగే ఆదాయం(డిస్పోజబుల్ ఇన్​కమ్) పడిపోవచ్చు. సామాన్య ప్రజల జీవితాలతో సంబంధం లేకుండా సంపద సృష్టి జరగవచ్చు. 

అనేక విషయాల్లో సమాచారం లేక


జీడీపీ ఉత్పత్తి ద్వారా వస్తున్న సంపదను లెక్కిస్తుంది కానీ, ఆ సంపద ఎందరికి చేరింది, సంపద పంచుకోవడంలో ఉండే అసమానత్వాన్ని చెప్పదు. సగటు జీడీపీ లెక్కల ద్వారా అందరికీ సంపద చేరిందని భ్రమ కలిగిస్తారు రాజకీయ నాయకులు. సమాచార లభ్యత, నాణ్యతపై జీడీపీ కచ్చితత్వం ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో గణాంకాల శాఖలో గతంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్త నియామకాలు లేవు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా, ప్రైవేటు సంస్థలతో ఒప్పందాల మేరకు ‘పని’ జరుగుతున్నది. అనేక విషయాలపైన ప్రాథమిక సమాచారం లేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయాక, కొత్త జిల్లాలు ఏర్పడ్డాక ప్రజల ముందు ఉండాల్సిన అనేక రకాల సమాచారం ఉండటం లేదు. వస్తు, సేవల స్థూల ఆదాయం ఘనంగా చెప్పే ప్రభుత్వం దగ్గర వస్తు ఉత్పత్తి, సేవలు అందించే పరిశ్రమలు, సంస్థల సంఖ్యపై కచ్చితమైన గణాంకాలు లేవు. జీఎస్​డీపీలో  ప్రభుత్వ వ్యయం కూడా జోడిస్తారు. ప్రభుత్వ వ్యయం తెలంగాణ జీఎస్డీపీలో పెరుగుతున్నది. 2014-–15లో 11.2 శాతం నుంచి 2021-–22 నాటికి 14.7 శాతానికి పెరిగింది. పద్ధతి ప్రకారం మార్కెటేతర కార్యకలాపాలపై(సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ) ప్రభుత్వం ఖర్చు చేసినా జీడీపీలో చేరవు. బతుకమ్మ చీరల పథకంలో ఉత్పత్తి ఉంది. కానీ ఇది బీసీ సంక్షేమం కింద ఖర్చు చేస్తున్నారు. రైతు బీమా, వివిధ కులసంఘాల కోసం కట్టిస్తున్న బిల్డింగ్​లు చేరుతున్నాయా లేదా తెలవదు. తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్​లో కేటాయింపులు భారీగా ఉన్నా, ఖర్చు కావు. జీడీపీలో ఖర్చు అయినవి తీసుకున్నారా, లేక ప్రకటించినవి మాత్రమే ఉంటాయా? ఏ రకమైన ప్రభుత్వ వ్యయం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఉంటున్నదో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.

భూముల విలువ పరిగణనలోకి రాదు


ప్రైవేటు పెట్టుబడులు మీద ఉండే సమాచారం ఆయా పెట్టుబడుదారులు ఇచ్చిందే ఉంటున్నది. ఒక కంపెనీ రూ.100 కోట్లు పెట్టుబడి ప్రకటిస్తే, అప్పటికి నిజమే అయినా అనేక కారణాల వల్ల వాస్తవ రూపంలో ఉండకపోవచ్చు. డిపార్ట్​మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) నివేదిక ప్రకారం, 2021 మొదటి అర్ధభాగంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అత్యధిక మొత్తంలో పెట్టుబడి ప్రతిపాదనలను అందుకుంది. మొత్తం ప్రతిపాదిత పెట్టుబడి రూ.1.38 లక్షల కోట్లు. వాస్తవ పెట్టుబడులు కాకుండా కేవలం ప్రతిపాదనలు జీఎస్​డీపీ అంచనాల్లో చేరుస్తున్నట్లు అనుమానంగా ఉంది. ప్రైవేటు తుది వినియోగ వ్యయం (పీఎఫ్​సీఈ), స్థూల స్థిర మూలధన నిర్మాణం(జీఎఫ్ సీఎఫ్) జీడీపీలో రెండు ప్రధాన అంశాలు. జీఎఫ్​సీఎఫ్​అనేది ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడుల కొలమానం. 2020–-21 సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. తెలంగాణ జీడీపీలో జీఎఫ్​సీఎఫ్​ వాటా 2015-–16 లో 26.8 శాతం నుంచి 2020-–21లో 31.6 శాతానికి పెరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడుల పెరుగుదలను ఇది సూచిస్తున్నా, ద్రవ్యోల్బణం పరిగణిస్తే, పురోగతి ఎక్కువగా లేదు. భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీ, ఇతర సంబంధిత సేవల కోసం ప్రభుత్వం వసూలు చేసే ఫీజులను కూడా జీడీపీలో భాగంగా పరిగణిస్తారు. అయితే, భూమి విలువను పరిగణనలోనికి తీసుకోరు. స్థిరాస్తి లావాదేవీల్లో సాధారణంగా నగదు చెల్లింపులు లేదా అధికారిక ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయని ఇతర అనధికారిక ఏర్పాట్లు ఉంటాయి. అందువల్ల, ఈ రంగం నుంచి జీడీపీలో ఏది, ఎలా, ఎంత చేర్చబడుతుందనే దానిపై అస్పష్టత ఉంది.


జీవీఏ గణాంకాల్లో తేడా


రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తికి గణనీయంగా దోహదపడే ముఖ్యమైన రంగం వ్యవసాయం. పంటలు, పశువులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల విలువను, నీటిపారుదల, వ్యవసాయ కూలీల శ్రమ, రవాణా వంటి వ్యవసాయ సేవల విలువను అంచనా వేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి విలువను లెక్కిస్తారు. వ్యవసాయ జీడీపీ లెక్కింపు సంక్లిష్టంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న సమాచారం బట్టి, అంచనా పద్ధతులకు అనుగుణంగా ఉంటుంది. తెలంగాణ జీడీపీలో వ్యవసాయ ఉత్పత్తుల,సేవల విలువను అంచనా వేయడానికి ప్రభుత్వం ఎంచుకున్న పద్ధతులపై ప్రామాణిక సమాచారం లేదు. తెలంగాణలో 2014-–15 నుంచి 2019–-20 వరకు వ్యవసాయోత్పత్తి విలువ 2014-–15లో రూ.49,974 కోట్ల నుంచి 2019–-20లో రూ.74,121 కోట్లకు పెరిగింది. ఇది పంట మార్కెట్ విలువ కాకుండా తెలంగాణలో వ్యవసాయం స్థూల విలువ (జీవీఏ)ను సూచిస్తుంది. తెలంగాణలో జీవీఏ గణాంకాల్లో అనేక దోషాలు ఉన్నాయి.  వ్యవసాయోత్పత్తి విలువను రైతుల తలసరి ఆదాయంగా లెక్కించడానికి, రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య అందుబాటులో లేదు. 2015-–16 లో వ్యవసాయ భూమి(5.5 మిలియన్ హెక్టార్లు), సగటు కమతాల పరిమాణం 1.14 హెక్టార్లు తీసుకుంటే, తెలంగాణలో సుమారు 48 లక్షల మంది రైతులు ఉన్నారని అంచనా. ఆ మేరకు, రైతులకు వ్యవసాయం ద్వారా అందుతున్న తలసరి ఆదాయం 2014-–15లో రూ.10,406 నుంచి 2019-–20లో Rs.15,427. ధరల సూచీ సమాచారం లేకపోవడంతో తెలంగాణలో నిజమైన జీవీఏ గణాంకాలు అందుబాటులో లేవు. తెలంగాణ రాష్ట్రంలో పంటల వారీగా జీవీఏ సమాచారం అందుబాటులో లేదు. గణాంకాల ప్రకారం తెలంగాణ జనాభాలో భాగమైన ఒక రైతు తలసరి రూ.2,31,326 (జీడీపీతో గుణిస్తే), అయితే జీవీఏ ప్రకారం అదే రైతుకు ఆదాయం కేవలం రూ.15,427 (2019-–20) మాత్రమే వస్తున్నది. అంటే 4.8 మిలియన్ల మంది రైతుల తలసరి ఆదాయం కేవలం రూ.15,427 మాత్రమే. తలసరి జీడీపీ అనేది రాష్ట్రంలోని ఒక వ్యక్తి సగటు ఆర్థిక ఉత్పత్తి కొలత, తలసరి జీవీఏ అనేది ఒక రైతు ఆర్థిక ఉత్పత్తికి కొలమానం.

ప్రైవేటు పెట్టుబడులు


ప్రభుత్వ నిధులు(అప్పులు, ఆదాయం) ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది. పరోక్షంగా జీడీపీని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రజా ధనం ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేస్తూ ప్రభుత్వాలు వృద్ధిని ప్రేరేపిస్తాయి. ఇంకో వైపు, ప్రభుత్వ రుణం భారీగా పెరిగితే వడ్డీ రేట్లు పెరుగుతాయి. అధిక వడ్డీ రేట్ల వల్ల ప్రైవేట్ పెట్టుబడులు తగ్గి క్రమంగా ఆర్థికావృద్ధి నెమ్మదిస్తుంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న లక్షల కోట్ల అప్పులు జీడీపీ లెక్కల్లో ఏ మేరకు ఏ విధంగా వస్తున్నాయి? కొత్త రోడ్డుకు ప్రభుత్వం అప్పులు చేస్తే దాని విలువను జీడీపీలో చేర్చవచ్చు. నిర్మాణం కోసం ఉపయోగించే ముడి పదార్థాలు(సిమెంట్, ఇసుక, కంకర, ఇటుకలు, వగైరా), కార్మికులకు కూలీలు, ఇతర వస్తు, సేవలను మార్కెట్లో కొనుగోలు చేస్తారు కాబట్టి భవనాల నిర్మాణం (సచివాలయం, వైద్య కళాశాలలు, ఎమ్మెల్యే కార్యాలయాలు, రైతు వేదిక మొదలైనవి), సాగు నీటి ప్రాజెక్టులు కూడా స్వల్పకాలంలో జీడీపీలో కలపవచ్చు. ప్రభుత్వ రుణం, ప్రైవేట్ పెట్టుబడులు, జీడీపీ మధ్య ఒక సంక్లిష్ట సంబంధం ఉంటుంది. లోతుగా విశ్లేషణ అవసరం. ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించడం అవసరం.

- సంపతి రమేష్ మహారాజ్,
రాజన్న సిరిసిల్ల జిల్లా