
సీతారాముల కళ్యాణాన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా భక్తులు కనులపండుగగా చేసుకుంటారు. ప్రతి రామాలయంలోనూ ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు సంప్రదాయబద్ధంగా తమ ఇళ్లలోనూ ఈ పండుగను జరుపుకుంటారు...
సీతను సహనానికి ప్రతీకగా చెప్తారు. రాముడిని కార్యసాధనకు ఉదాహరణగా భావిస్తారు. వాళ్లిద్దరి పెళ్లిరోజు అంటే సహనంతో ఎన్ని కష్టాలు వచ్చినా లక్ష్యాన్ని సాధించడమనే వ్యక్తిత్వ వికాస సూత్రం వీళ్లిద్దరి పెళ్లిలో ఉంది. అది నేటి యువతకు ఆదర్శం..
పేరులో..
దశరథునికి పుత్రకామేష్టి యాగంలో నలుగురు కొడుకులు పుట్టినప్పుడు వాళ్లకు నామకరణం చేసింది వశిష్టుడు. రామ అంటే రమయతి గుణై : ప్రజా యితి రామ: అని. “రమించునది. ఆనందించునది. ఆహ్లాదం వంచునది అని అర్దం. వేదాల ప్రకారం సముస్త ప్రపంచానికి అగ్ని, సూర్యుడు, చంద్రుడు మాత్రమే ఆధారం, రామ శబ్దంలోని 'ర' అంటే అగ్ని ..అ .. అంటే సూర్యుడు. మ అంటే చంద్రుడు. అగ్ని వల్ల పాపం, సూర్యుడి వల్ల అజ్ఞానం, చంద్రుడి వల్ల తాపం తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే రాముడి పేరు వచ్చేటట్లు ఎంతోమంది రామయ్య, రామకృష్ణ, రమేష్... లాటి పేర్లు పెట్టుకొంటారు.
పుట్టినరోజు.. పెళ్లిరోజు ఒకటే..
శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ద నవమి.. పునర్వసు నక్షత్రం.. కర్కాటక లఘ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడని. చెప్తారు. అలాగే పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేసి, రావణాసురుడ్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషక్తుడయ్యాడు.. సీతతో రాముడి పెళ్లి జరిగింది అదే రోజని చెప్తారు. అలా మూడు సందర్భాలు ఒకటే రోజు కావడం ఈ రోజు ప్రత్యేకత రాముడి పుట్టినరోజునే సీతారాముల కల్యాణం జరపడానికి కారణం ఎవరో తెలుసా..! కంచర్ల గోపన్న. ఎలా అనుకుంటున్నారా?
భద్రాచలం తహసీల్దారుగా రామదాసు(కంచర్ల గోపన్న) పనిచేస్తున్నప్పుడ తొలిసారి సీతారాముల కల్యాణం ఎప్పుడు. నిర్వహించాలనే సందేహం వచ్చింది. అప్పుడు రామదాసు తన గురువైన రఘునాథ భట్టాచార్యులు పండితులతో చర్చించి విష్ణువు రాముడిగా భూమిమీద అవతరించిన రోజే కల్యాణం జరపాలని నిర్ణయించాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆది ఆచారంగా కొనసాగుతోంది. ఒక్క తెలుగు నేలపైనే కాకుండా దేశవిదేశాల్లోనూ ఇదే పాటిస్తున్నారు
పండుగ రోజు ఇలా...
శ్రీరామ నవమి రోజు ( ఏప్రిల్ 6) పెందలాడే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాలి. పూజగదిని శుభ్రం చేశాక శ్రీరామ పట్టాభిషేకం పటాన్ని పూజ గదిలో ఉంచి పూజించాలి. శ్రీరామ అష్టోత్తరాన్ని జపించాలి. ఆ రోజు ( ఏప్రిల్ 6) దీపారాధన కొబ్బరి నూనెతో చేస్తే మంచిదని అంటారు. రాముడికి ఇష్టమైన వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టాలి.
Also Read:-శ్రీరాముడి నుంచి ప్రజలు.. పాలకులు నేర్చుకోవలసినవి ఇవే..!
పూజ అయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి. సాయంత్రం రామాలయానికి వెళ్లి దేవుడిని దర్శనం చేసుకోవాలి అలాగే పందిళ్లలో లాగా గుడిలో జరిగే సీతారాముల కల్యాణాన్ని చూసి, మనసారా రామనామము స్మరించుకోవాలి. శ్రీరామనవమి రోజు కొందరు ఉపవాసం ఉంటారు. ఉపవాస దీక్షను ఇంట్లో పూజా కార్యక్రమాలు పూర్తయ్యే వరకు లేదా దేవాలయంలో సీతారాముల కళ్యాణం చూసి ఇంటికి వచ్చే వరకు వాళ్లవాళ్ల ఓపిక. ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని కొనసాగించాలి.
వడపప్పు.. పానకం
శ్రీరామ నవమి రోజు వడపప్పు పానకం తయారుచేసి శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పిస్తారు. సాధారణంగా దేవుళ్ల కోసం తయారు చేసే ప్రసాదాలన్నీ ఆయా కాలాలు, మనుషుల ఆరోగ్యాలకు సంబంధించినవై ఉంటాయి. అలాగే ఈ పండుగ రోజు తయారు చేసే వడపప్పు.. పానకం వెనక కూడా ఇలాంటి రహస్యమే ఉంది. ఈ కాలంలో ఎక్కువ గొంతు సమస్యలు వస్తాయి. బెల్లం పొడి చేసి, నీళ్లు కలిపి పానకం తయారు చేస్తారు. ఆ నీళ్లలో మిరియాలు, యాలకులపొడి కలుపుతారు అవి గొంతు సమస్యలను తగ్గిస్తాయి.
అలాగే పెసరపప్పును నానబెట్టి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. వడపప్పు దాన్ని తగ్గింది. జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. శరీరం నుంచి చెమట రూపంలో నీళ్లు ఎక్కువగా బయటకు పోతుంటాయి. అందుకే పానకం వడపప్పు శరీరానికి కావాల్సిన శక్తితోపాటు, చల్లదనాన్ని కూడా ఇస్తాయి. ఆలోచిస్తే వడపప్పులోనే 'వడ' అనే పదం ఉంది అంటే వడదెబ్బ నుంచి కాపాడుతుందని అర్ధం చేసుకోవచ్చు.
చలువ పందిళ్లు
శ్రీరామనవమికి గ్రామాల్లో ప్రత్యేకంగా చలువ పందిళ్లు వేస్తారు. ఈ పందిళ్ల కోసం తాటాకులు, కొబ్బరి మట్టలు, వెదురు గుంజలను మాత్రమే వాడతారు. ఆ పందిళ్లలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుల విగ్రహాలను పెట్టి పూజలు నిర్వహిస్తారు. తెలుగునేలపై కొన్ని ప్రాంతాల్లో కేవలం సీతారాముల వివాహాన్ని మూడు రోజులు, ఐదు రోజులు, తొమ్మిది రోజులు వాళ్ల వాళ్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ పందిళ్లలో ఘనంగా చేస్తారు.
ప్రతిరోజూ సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు భజనలు చేస్తారు. భక్తిగీతాలు పాడుతారు. వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. తాటాకులు, కొబ్బరి మట్టలు ఆ వేడిని గ్రహిస్తాయి. ఇలా పందిళ్లు వేసి, స్వామివారి పెళ్లి జరిపించడం అన్నది. కేవలం ఒక్క ఈ పండుగలోనే కనిపిస్తుంది. పందిళ్లు వేయడం. పెళ్లి చేయడం తెలుగు వారి సంస్కృతి. ఆ సంస్కృతిలో భాగంగానే సీతారాముల వివాహాన్ని సొంత పండుగలా భక్తులు చేస్తారు.