భద్రాద్రి రామయ్య వస్త్రాలకు డిజిటలైజేషన్​

భద్రాద్రి రామయ్య వస్త్రాలకు డిజిటలైజేషన్​
  • భక్తులు సమర్పించే వస్త్రాలు దుర్వినియోగం
  • అక్రమాల అడ్డుకట్టకు ఆలయ ఈవో చర్యలు

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తులు సమర్పించే వస్త్రాల డిజిటలైజేషన్ ను గురువారం నుంచి ప్రారంభించారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు టెక్నాలజీతో డిజిటలైజేషన్​కు ఈవో రమాదేవి శ్రీకారం చుట్టారు. గతంలో భక్తులు సమర్పించిన విలువైన పట్టువస్త్రాలు దారి మళ్లించి.. వాటి స్థానంలో వేరే వస్త్రాలు పెట్టేవారనే ఆరోపణలు ఉన్నాయి. స్వామికి ఆ వస్త్రాలను అలంకరించాక ఆలయ ప్రాంగణంలోనే ఒక కౌంటర్​ను పెట్టి భక్తులు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. 

దేవుడికి అలంకరించినవి కాకుండా ఇతర వస్త్రాలను భక్తులకు కట్టబెడుతున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో డిజిటలైజేషన్​ను ఎంచుకున్నారు. భక్తులు స్వామికి అందజేసి వస్త్రాలను కంప్యూటర్​లో ఇచ్చిన భక్తుడి పేరు, ఇచ్చిన వస్త్రం విలువ, ఏ రకం వస్త్రం వివరాలు  పొందుపరిచి ఒక కార్డును జారీ చేస్తారు. భక్తులు సమర్పించిన వస్త్రాలే కౌంటర్​లో ఉన్నాయా..? లేక ఇతర వస్త్రాలు పెట్టారా..? అనేది కార్డు నంబర్ ద్వారా తెలుసుకునేందుకు వీలుంటుంది. వస్త్రాలు దుర్వినియోగం కాకుండా అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకే డిజిటలైజేషన్​సిస్టమ్ అమలులోకి తెచ్చినట్టు ఈవో రమాదేవి తెలిపారు.