స్టూడెంట్ల ఇండ్లకు..కేయూ ఆన్సర్​ షీట్స్​

స్టూడెంట్ల ఇండ్లకు..కేయూ ఆన్సర్​ షీట్స్​
  •     ఎగ్జామినేషన్స్​ బ్రాంచ్ రోజు కూలీల ద్వారా బయటకు..
  •     జవాబులు రాశాక మళ్లీ బండిల్స్​లోకి..
  •     కేసు నమోదు చేసిన పోలీసులు
  •     అధికారుల తీరుపైనా అనుమానాలు

హనుమకొండ, హసన్​ పర్తి, వెలుగు :  కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ ​బ్రాంచ్ ​నుంచి డిగ్రీ ఆన్సర్​ షీట్స్​ ఏకంగా స్టూడెంట్ల ఇండ్లకే వెళ్లాయి. ఎగ్జామినేషన్ బ్రాంచ్​లో రోజుకూలీగా పని చేస్తున్న ముగ్గురు ఈ బాగోతానికి తెరలేపగా..స్టూడెంట్లు ఆ ఆన్సర్​ షీట్లు రాసి మళ్లీ ఎగ్జామినేషన్​ బ్రాంచ్​లోని బండిల్స్​లోకి చేర్చారు. ఈ విషయం ఆలస్యంగా బయటపడగా..ఎగ్జామినేషన్​ బ్రాంచ్​అధికారుల ఫిర్యాదు మేరకు కేయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాకతీయ వర్సిటీలోని ఎగ్జామినేషన్ ​బ్రాంచ్​లో చింతగట్టుకు చెందిన ఎం.సునీల్​, పెగడపల్లికి చెందిన జి.రాణా ప్రతాప్​, గుండ్ల సింగారానికి చెందిన ఎన్​.శ్రీధర్​ దినసరి కూలీలు, అటెండర్లుగా పని చేస్తున్నారు. ఐదేండ్ల నుంచి ఎగ్జామినేషన్​బ్రాంచ్​లోనే పని చేస్తుండగా..బయట తమకు తెలిసిన స్టూడెంట్లు, ఇతర వ్యక్తుల ద్వారా డిగ్రీ విద్యార్థులను పాస్​ చేయించేందుకు డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు. 

ఇందులో భాగంగా పరీక్షలు పూర్తయిన తర్వాత ఆన్సర్​షీట్లన్నీ బండిల్స్ లో కేయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్​కు చేరితే..అక్కడి నుంచి ఆన్సర్​ షీట్లను బయటకు తీసుకువచ్చి స్టూడెంట్లకు చేరవేసేవారు. వారు మళ్లీ ఆన్సర్లు రాసి ఇస్తే యథాస్థానానికి చేర్చేవారు. ఇటీవల డిగ్రీ సెకండ్​, ఫోర్త్​, సిక్స్త్ ​సెమిస్టర్​ఎగ్జామ్స్​ జరగగా, మే 23న ఎగ్జామినేషన్​ బ్రాంచ్​నుంచి కొన్ని ఆన్సర్​షీట్లు బయటకు తీసుకెళ్లి స్టూడెంట్లకు అందజేశారు. ఆ మర్నాడు వాటిని తిరిగి సంబంధిత బండిల్స్​లో పెట్టారు. ఇదిలా ఉంటే మే 30న ఎగ్జామినేషన్​అడిషనల్ కంట్రోలర్ ​డా.ఎం.తిరుమలదేవి బ్రాంచ్​లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తుండగా అసలు విషయం బయటపడింది. సునీల్, రాణాప్రతాప్​, శ్రీధర్​ఆన్సర్ ​షీట్స్​ను  రూం నుంచి బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించారు. వర్సిటీ ఎగ్రామ్స్​ కంట్రోలర్​నరసింహా చారి, అడిషనల్​ కంట్రోలర్ ​తిరుమల దేవి యూనివర్సిటీ పోలీసులకు శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. 

50 పేపర్లు బయటికి.. 

పోలీసుల దర్యాప్తులో నిందితులు 50 పేపర్ల వరకు బయటకు తీసుకెళ్లి, తిరిగి తీసుకువచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఒక్కో పేపర్​కు స్టూడెంట్స్​ నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తుండగా, ఈ 50 మందిలో హనుమకొండలోని ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నట్లు తెలిసింది. నిందితులు ఐదేండ్ల నుంచి పని చేస్తుండగా ఎంతమందికి ఆన్సర్​ షీట్లు చేరవేశారో అన్న కోణంలో దర్యాప్తు సాగుతోందని కేయూ ఎస్సై రాజ్​కుమార్​ తెలిపారు.

ఆఫీసర్ల హస్తం?

వర్సిటీ ఎగ్జామినేషన్స్​ బ్రాంచ్​లోని ఆన్సర్​ షీట్స్ మూల్యాంకన రూముల్లోకి సిబ్బందికి అందరికీ ప్రవేశం ఉండదు. అవకతవకలు జరిగే ఆస్కారం ఇవ్వకుండా కార్యాలయ సిబ్బంది ప్రవేశానికి కూడా రిస్ట్రిక్షన్స్​ ఉంటాయి. అలాంటి గదుల్లోకి దినసరి కూలీలుగా పని చేసే ముగ్గురు ప్రవేశించడం, ఆన్సర్ ​షీట్లు బయటకు తీసుకువెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫీస్​లో పని చేసే అధికారుల సహాయం లేనిదే ఇది సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెరవెనుక పలువురు అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్సర్​ షీట్లు బయటకు వెళ్లిన విషయమై కేయూ ఎగ్జామినేషన్స్ ​కంట్రోలర్​ ఎస్.నరసింహా చారిని ఫోన్​ లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.