- 15 ఏళ్లుగా సొంత భవనం లేని వైనం
మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి పట్టణంలో 2008లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటైంది. కాలేజీ ఏర్పాటై 15 ఏండ్లవుతున్నా నేటికీ సొంత భవనం లేదు. కనీసం స్థలం కూడా అలాట్ చేయలేదు. దీంతో వెంకట్రావుపేటలోని ఓ పాడుబడ్డ బిల్డింగ్‌లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. కనీస వసతులు లేక స్టూడెంట్లు, లెక్చరర్లు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ కాలేజీ మెట్‌పల్లి టౌన్‌కు 2 కిలోమీటర్ల దూరం ఉండడంతో అడ్మిషన్లు తగ్గుతున్నాయి. ఈ విషయమై ఏళ్లుగా పలుమార్లు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఏ ఒక్కరూ స్పందించలేదని స్టూడెంట్స్, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వెంకట్రావుపేటకు తరలింపు
మెట్‌పల్లిలో 2008లో డిగ్రీ కాలేజీ మంజూరుకాగా ఆ టైంలో హై స్కూల్ బిల్డింగ్ లో కాలేజీ నిర్వహించారు. ఒకే బిల్డింగ్‌లో హైస్కూల్‌తోపాటు జూనియర్, డిగ్రీ కాలేజీలు షిఫ్ట్ పద్ధతిలో కొనసాగాయి. క్లాసుల నిర్వహణ సరిగా లేకపోవడంతో 2016లో వెంకట్రావుపేటలో జూనియర్ కాలేజీ కోసం నిర్మించి వృథాగా ఉన్న బిల్డింగ్‌లోకి మార్చారు. కాగా ఈ బిల్డింగ్ 1996లో పెద్దమ్మకుంటకు చెందిన శిఖం భూమిలో నిర్మించారు.
డిగ్రీ కాలేజీని ఇక్కడికి మార్చాక ఈ భూమిని కాలేజీ పేరిట మార్చేందుకు ప్రయత్నించారు. కానీ అది నెరవేరలేదు. ఈ బిల్డింగ్ పాత పడడంతో క్లాస్ రూముల్లోని గోడల నుంచి నీరు కారుతోంది. శ్లాబులకు ప్లాస్టరింగ్, కింద ఫ్లోరింగ్ లేదు. కిటికీలకు తలుపులు, వెంటిలేటర్లు అసలే లేవు. కాలేజీ అరకొర వసతులతో నానాటికీ అడ్మిషన్లు తగ్గిపోయాయి. కాలేజీలో 180 సీట్లు ఉండగా బీఏలో 28, బీకామ్‌లో 29 మంది మాత్రమే చేరారు.